– మొత్తం ఓటర్లు 2 లక్షల 44,514
నవతెలంగాణ – హుజురాబాద్: హుజురాబాద్ 1957లో నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో రెండు తాలుకాలు ఉండేవి. ఒకటి హుజురాబాద్ కాగా రెండవది భీమదేవరపల్లి. హుజురాబాద్ నియోజకవర్గం మొదట (ఎస్సీ) గా ఉండేది. ఇక్కడ నాలుగుసార్లు కాంగ్రెస్, మూడుసార్లు టిడిపి, మూడుసార్లు ఇండిపెండెంట్లు,6 సార్లు బి ఆర్ఎస్, ఒకసారి బిజెపి అభ్యర్థులు విజయ సాధించారు. ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇనుగాల పెద్దిరెడ్డి, కెప్టెన్ వి లక్ష్మి కాంతారావు మంత్రులుగా పని చేశారు. 2004 నుంచి బి ఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో కమలాపూర్ నియోజకవర్గ కేంద్రంతో పాటు జమ్మికుంట, వీణవంక హుజురాబాద్ నియోజకవర్గం లో విలీనం అయ్యాయి. కమలాపూర్ నియోజకవర్గం కనుమరుగయ్యింది. ఇక్కడి నుంచి 2009, 2010 ఉపఎన్నిక, 2014, 2018లో వరుసగా నాలుగు పర్యాయాలు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బి ఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో ఆర్దిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా రెండోసారి ఏర్పడిన బి ఆర్ఎస్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ పనిచేశారు. సీఎం కేసీఆర్ తో విభేదించి ఈటల రాజేందర్ 2021 లో మంత్రి పదవికి, ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. 2021లో బిజెపిలో చేరి ఉప ఎన్నికల బరిలో నిలిచారు. బిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న హుజరాబాద్ లో 2021 జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ విజయం సాధించారు. నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు ఇలా… హుజురాబాద్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది మొదటగా ఎస్సీ నియోజకవర్గం గా ఉండేది. 1960లో జనరల్ నియోజకవర్గంగా మారింది. 1957 నుంచి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 14 సాధారణ, మూడు ఉప ఎన్నికలు జరిగాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హుస్నాబాద్ నియోజకవర్గంలో కలిశాయి. కమలాపూర్ నియోజకవర్గాన్ని హుజురాబాద్ లో విలీనం చేశారు. కాగా 1957లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా పోలుసాని నర్సింగరావు గెలుపొందారు. 1962లో గాడిపల్లి రాములు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిపిఐ అభ్యర్థి దేవయ్య పై విజయం సాధించారు. 1967 లో పొలసాని నరసింగరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి కొత్త రాజిరెడ్డి పై విజయం సాధించారు. 1972లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వొడితల రాజేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థి అలిగిరెడ్డి కాశి విశ్వనాథరెడ్డి పై గెలుపొందారు. 1978లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దుగ్గిరాల వెంకట్రావు పోటీచేసి జనత పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అలిగిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి పై విజయం సాధించారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కొత్త రాజిరెడ్డి మరో స్వతంత్ర అభ్యర్థి దుగ్గిరాల వెంకట్రావు పై గెలుపొందారు. 1985లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన దుగ్గిరాల వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి పై విజయం సాధించారు. 1989లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేతిరి సాయిరెడ్డి టిడిపి అభ్యర్థి దుగ్గిరాల వెంకటరావు పై గెలుపొందారు. 1994లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఇనుగాల పెద్దిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొప్పరాజు లక్ష్మీ కాంతారావు పై ఘనవిజయం సాధించారు. 1999లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఇనుగాల పెద్దిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరి సాయి రెడ్డి పై గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పెద్దిరెడ్డి పై 44669 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. లక్ష్మీకాంతరావుకు 81121 ఓట్లు రాగా, పెద్దిరెడ్డి 36451 ఓట్లు పొందినాడు. కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి చెందిన ఇనుగాల భీమారావు 5281 ఓట్లు పొందినాడు. అనంతరం 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డి పై లక్ష్మీ కాంతారావు గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగగా హుజురాబాద్ నియోజకవర్గం ముఖచిత్రం మారిపోయింది. కమలాపూర్ నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం లో విలీనం జరిగింది. 2009 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వకలాభరణం కృష్ణ మోహన్ రావు పై విజయం సాధించారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 69 మంది అభ్యర్థులు పోటీ చేయగా బి ఆర్ఎస్ నుండి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుండి వకలాభరణం కృష్ణ మోహన్ రావు, టిడిపి నుండి ముద్దసాని దామోదర్ రెడ్డి లు పోటీలో నిలువగా బి ఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బి ఆర్ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి పై భారీ మెజార్టీతో గెలుపొందారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి పై విజయం సాధించారు. 2021 లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ఈటెల రాజేందర్ బి ఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై గెలుపొందారు. హుజురాబాద్ నియోజకవర్గం లో ఐదు మండలాలు ఉన్నాయి. హుజురాబాద్ మండలంతో పాటు జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాలు ఉండగా మొత్తం 62 గ్రామాలు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. అందులో 305 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 2లక్షల 44514 మంది ఓటర్లు ఉండగా అందులో 119676 మంది పురుషులు, 124833 స్త్రీలు, 5 గురు ట్రాన్స్ జెండర్ లు ఉన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గం..
17 సార్లు ఎన్నికలు
14 సాధారణ, మూడు ఉప ఎన్నికలు
విజయం సాధించిన పార్టీలు..
6 సార్లు బి ఆర్ఎస్
3 సార్లు టిడిపి
4 సార్లు కాంగ్రెస్
3 సార్లు స్వతంత్రులు
ఒకసారి బిజెపి
1957 పొలుసాని నరసింగరావు స్వతంత్ర 24296
గాడి పెళ్లి రాములు స్వతంత్ర 19373
2.1962 గాడిపెళ్లి రాములు కాంగ్రెస్ 22162
నాయిని దేవయ్య సిపిఐ 8057
3. 1967 పొలుసాని నరసింగరావు కాంగ్రెస్ 23470
కొత్త రాజిరెడ్డి స్వతంత్ర 18197
4. 1972 వొడితల రాజేశ్వర్ రావు కాంగ్రెస్ 29686
అలిగిరెడ్డి కాశీ విశ్వనాధ రెడ్డి స్వతంత్ర 22153
5. 1978 దుగ్గిరాల వెంకట్రావు కాంగ్రెస్ 35516
అలిగిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి జనతా పార్టీ 21822
6.1983 కొత్త రాజిరెడ్డి స్వతంత్ర 24785
దుగ్గిరాల వెంకట్రావు స్వతంత్ర 20602
7. 1985 దుగ్గిరాల వెంకట్రావు టిడిపి 54768
భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 17876
8.1989 కేతిరి సాయి రెడ్డి స్వతంత్ర 32953
దుగ్గిరాల వెంకట్రావు టిడిపి 29251
9.1994 ఇనుగాల పెద్దిరెడ్డి టిడిపి 57727
బొప్పరాజు లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ 38436
10.1999 ఇనుగాల పెద్దిరెడ్డి టిడిపి 45200
కేతిరి సాయి రెడ్డి కాంగ్రెస్ 38770
11.2004 వొడితల లక్ష్మీకాంతరావు టిఆర్ఎస్ 81121
ఇనుగాల పెద్దిరెడ్డి టిడిపి 36451
12.2008 వొడితల లక్ష్మీకాంతరావు టిఆర్ఎస్ 53547
కేతిరి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ 32727
13.2009 ఈటల రాజేందర్ బి ఆర్ఎస్ 56752
వకులాభరణం కృష్ణమోహన్ రావు కాంగ్రెస్ 41717
14.2010 ఈటల రాజేందర్ బి ఆర్ఎస్ 93026
ముద్దసాని దామోదర్ రెడ్డి టిడిపి 13799
15.2014 ఈటల రాజేందర్ బి ఆర్ఎస్ 95315
కేతిరి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ 38278
16.2018 ఈటల రాజేందర్ బి ఆర్ఎస్ 110000
పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ 61730
17.2021 ఈటల రాజేందర్ బిజెపి 101974
గెల్లు శ్రీనివాస్ యాదవ్ బి ఆర్ఎస్ 79452