– అక్షింతలు, క్యాలెండర్ తప్ప బీజేపీ చేసిందేమీ లేదు
– వెంకటరామ్ రెడ్డి ని గెలిపిస్తే జోడెడ్లలా సేవ చేస్తాం
నవతెలంగాణ – చిన్నకోడూరు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిందని మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో గురువారం నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల విస్తృత స్థాయి సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపి అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ…. ఓ వైపు ఎండలు మరో వైపు ఎన్నికల సమయంలో నా ఎంఎల్ఏ ఎన్నిక ఎంత
ముఖ్యమో ఎంపి అంతే ముఖ్యం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ ద్వారా మంచి నీటి సరఫరా, కాళేశ్వరం ద్వారా సాగునీరు ఇలా అనేక పథకాలు అమలు చేసామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు చెరువులు నిండింది లేదని, కాళేశ్వరం నిర్మాణంతో చెరువులు ఎండింది లేదు అన్నారు. పశుగ్రాసం కొనుక్కుని పశువుల కాపాడుకున్నా పరిస్థితులను గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీతో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయనీ, 100 రోజుల్లో 6గ్యారెంటీలు 13 హామీల పేరుతో నయవంచనకు గురి చేసింది అని దుయ్యబట్టారు. 6గ్యారెంటీలు 13 హామీల కొట్లాడి అమలు చేపిస్త అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలను స్క్రీన్ పై వీడియో ద్వారా చూపిస్తూ వివరించారు. సిద్దిపేట అభివృద్ధి ని అడ్డుకునే వ్యక్తి రఘునందన్ రావు అనీ, అభివృద్ధి అడ్డుకునే వ్యక్తికి ఓటు వేయొద్దని అన్నారు. దుబ్బాక లో చెల్లని రూపాయి మెదక్ లో చెల్లుతుందా అన్నారు. సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం యువతను మోసం చేసిందని తెలిపారు. అక్షింతలు, క్యాలెండర్ తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు. నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలకు ఆర్థిక సహాయం చేసాననీ, దేవుని పేరిట రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. డిల్లీ లో జై తెలంగాణ నినాదం ఇచ్చేది కేవలం బీఆర్ఎస్ ఎంపి లు మాత్రమే అని చెప్పారు. వెంకట్రామ్ రెడ్డి ని గెలిపిస్తే జోడెడ్లలా సేవ చేస్తాం అన్నారు. సిద్దిపేట అభివృద్ధిలో వెంకట్రామ్ రెడ్డి పాత్ర ఉందని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ..
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గర్విస్తున్నాను అన్నారు. ఉద్యోగం చేసినా ప్రాంతంలో పోటీ చేయడం, అభివృద్ధి ప్రాంతంలో కలెక్టర్ గా ఉండటం నా అదృష్టం అని చెప్పారు. కేసిఆర్, హరీశ్ ఆదేశంతో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. గెలిచిన నెల రోజుల లోపు వెంకటరామ్ రెడ్డి ట్రస్ట్ ద్వారా 100 కోట్లతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తానని హామీ ఇచ్చారు. చేసిందే చెప్తా చెప్పిందే చేస్తా అని, మోసపూరిత ప్రకటనలు చేయనని ప్రకటించారు. పేద కార్యకర్తల కోసం 9నెలల్లో ప్ఫంరతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాలు నిర్మిస్తా అని చెప్పారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉద్యోగాల నోటిఫికేషన్ సమయంలో ఫంక్షన్ హాలులో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. నాకోసం 30రోజులు ఇవ్వండి మీకు 5 సంవత్సరాలు ఇస్తానని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, ఎంపిపి కూర మాణిక్య రెడ్డి, ఎంపిపి ఉపాధ్యక్షులు కీసర పాపయ్య, మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, ఎంపీటీసీలు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.