భారత, చైనా సరిహద్దులో 1959లో జరిగిన సం ఘటనలో దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పించిన వీర పోలీ సుల త్యాగాలను స్మరిస్తూ ప్రతీ సంవత్సరం అక్టోబర్ 21 వ తేదీని పోలీస్ సంస్మరణ దినంగా దేశ వ్యాప్తంగా నిర్వహి స్తున్నారు. ఈ సంవత్సరం నుండి ఈ సంస్మరణ దినాన్ని ‘పోలీస్ ఫ్లాగ్ డే’ గా అక్టోబర్ 21 వతేదీ నుండి 31 వ తేదీ వరకు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ సంవత్సరం ఈ పోలీసు అమర వీరుల సంస్మరణ దినం – పోలీస్ ఫ్లాగ్ డేనూ పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వ హించడం ద్వారా అమర పోలీసుల త్యాగం నుండి స్ఫూర్తిని, ప్రేరణను, ఉత్సాహాన్ని పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా తీవ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో 264 మంది పోలీసులు అమరులయ్యారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కేవలం ఒక పోలీసు అధికారి మాత్రమే తీవ్రవాదుల చేతిలో మరణించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రావిర్భావ అనంతరం పీపుల్స్ ఫ్రెండ్లీగా, పోలీసులు అంటే ప్రజల సేవకులు, ప్రజలే మాకు బాస్ లు అనే విశ్వాసం కలిగే విధంగా తెలం గాణా పోలీస్ శాఖ ఎన్నో విప్లవాత్మక మార్పు లకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగం గానే, ‘ఒక కెమెరా వందమంది పోలీసులతో సమానం’ అనే విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సహకారంతో పెద్దఎత్తున సీసీ కెమెరాల ఏర్పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్‌లో వినియోగిం చుకోవడం, ఫ్రెండ్లీ పోలీసింగ్, డయల్ 100, మహిళా భద్రతకు ప్రత్యేకంగా మహిళా భద్రతా విభాగం ఏర్పాటు, స్వాతంత్య్ర భారతచరిత్రలో మరెక్కడా లేని విధంగా వేలమంది పోలీసు అధికారుల నియామకం, కొత్త పోలీసు కమిషనరేట్లు, పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు, రాష్ట్రంలో అంతర్గత భద్రతకు కమాండ్ కంట్రోల్ నిర్మాణం ఇలా ఎన్నో వినూత్న కార్యక్రమాలను పోలీస్ శాఖ అమలు చేస్తున్నది.
ఒకవైపు ఆధునీకరణ దిశగా పోలీ సింగ్‌లో సరికొత్త విధానాలు ఉపయోగించు కుంటూ మెరుగైన సేవలను పౌరులకు అందిస్తూనే మరో వైపు అంతేస్థాయిలో సరికొత్త ఆలోచనలతో నేరాలకు పాల్ప డుతున్న నేరస్తులను మరింత సమర్థ వంతంగా అణచి వేసేందుకు పోలీస్‌శాఖ నిర్విరామ కృషి చేస్తోంది. ఈ ప్రయాణంలో పోలీసులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా, తమ కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఆలోచించకుండా ప్రజల రక్షణే ధ్యేయంగా నిర్విరామంగా విధులు చేపడుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర అంతర్గత భద్రతకు సవాలు విసురుతున్న వామపక్ష తీవ్రవాదులతోనూ అంతే స్థాయిలో సవాళ్ళను ఎదుర్కొంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దిశలోనే రాష్ట్ర ప్రజల భద్రతలో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణకు చెందిన పోలీసులు మావోయిస్టు, వారి గ్రూపులకు చెందిన చేతుల్లో హతులయ్యారు.
తెలంగాణలో మొట్టమొదటి పోలీస్ అమర వీరుడు మహమ్మద్ ఇబ్రహీం. ఇప్పటివరకు నిస్వార్థ సేవలందిస్తూ, విధి నిర్వహణలో మొత్తం 326 మంది కానిస్టేబుల్ స్థాయి నుండి ఐ.పీ.ఎస్ స్థాయి పోలీస్ అధికారులు అసువులు బాసారు. వీరి లో 180 మంది కానిస్టేబుళ్లు, 52 మంది హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు ఏ.ఎస్.ఐ లు, 39 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, పది మంది ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు డీ.ఎస్.పీలు, ముగ్గురు ఐ.పీ.ఎస్ అధికారు లతో పాటు ప్రత్యేక దళాలకు చెందిన 32 మంది వివిధ హోదాల అధికారులున్నారు. ప్రజల భద్రత, శాంతి పరిరక్షణకు నిస్వార్థ సేవలందించిన ఈ అమర పోలీసులకు మొత్తం దేశ ప్రజలు అక్టోబర్ 21న నివాళులు అర్పిస్తున్నారు. వారందించిన సేవలను గుర్తుకు తెస్తున్నారు.ఈ అమరవీరుల పోరాట స్పూర్తితోనే రాష్ట్రంలో అమలవుతున్న పోలీసింగ్ విధానాల వల్ల పోలీసులంటే మనలో ఒక ఒక భాగమనే మార్పును ప్రజల్లో కల్పించడంలో విజయవంతం కావడం జరిగింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు ఇచ్చిన ప్రాధా న్యత కూడా ప్రధాన కారణం.
దేశ అంతర్గత రక్షణలో, సమాజ శాంతి నిర్మాణంలో పని చేస్తూ తీవ్రవాదుల చేతుల్లో బలవుతున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ స్ఫూర్తిగా, పోలీసు అమరుల వారసులుగా సమాజం కోసం పని చేయవలసి ఉన్నది. తమకు కష్టం కలిగితే మిత్రుడైన పోలీసు ఉన్నాడనే నమ్మకం ప్రజల్లో కలిగేలా విధులు నిర్వర్తించాలి. ఖాకీ దుస్తులు, పోలీసు వత్తి అంటేనే త్యాగాలకు ప్రతీక. ఈ విషయాలను పోలీసు సిబ్బంది తమ మనస్సులో ఉంచుకోవాలి. ప్రజలకు శాంతిని అందించే క్రమంలో ఎప్పటికప్పుడు స్ఫూర్తివంతంగా పనిచేయడం అమర పోలీసులకు అందించే అసలైన నివాళి అవుతుంది.
(నేడు పోలీసు అమరవీరుల దినం)
– కన్నెకంటి వెంకట రమణ