పిడుగుపాటుకు నాలుగు పాడి పశువుల మృత్యువాత

– వేగంగా వచ్చిన గాలి దుమారానికి పలువురు రైతుల ఇండ్లు ధ్వంసం 
– ఆదివారం రాత్రి కురిసిన భారీ గాలి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మండలంలో తీవ్రంగా వాటిల్లిన ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు
– ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండలంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు పైగా ఉండి ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి తీవ్రమైన గాలి దుమారం, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం గంటల తరబడి పడి  బీభత్సం సృష్టించడంతో భారీగా పలు గ్రామాల్లో పలువురు రైతులు పాడి పశువులు, ఆస్తి, కొంత మేరకు రబీ పంట, పండ్ల తోటలు తీవ్రంగా నష్టపోయారు. గత రాత్రి వేగంగా వీచిన గాలి దుమారానికి మండల పరిధిలోని లొద్దిగూడెం గ్రామంలో రైతులు కొమరం పాపయ్య, కొమరం పరమయ్య, పాయం వెంకటేశ్వర్లు, పాయం పెద్ద రామయ్య, పాయం చిన్నరామయ్యలకు  చెందిన రేకుల ఇండ్లు దులాతో సహా పూర్తిగా లేచిపోయి ధ్వంసం అయ్యాయి. ఓ ఇంటి రేకులు లేచి విద్యుత్ మెయిన్ లైన్ వైర్ల మీద పడటంతో ఆ గ్రామంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా జాకారం గ్రామంలో పాయం జంపన్న అనే రైతు తన ఇంటి రేకులు సైతం దూలాలతో సహా పైకి లేచిపోయి కింద పడ్డాయి. దూలాలు పడే క్రమంలో తన ఇంటి ముందు ఉన్న దుక్కి టెడ్డు పై పడటంతో నడుము విరిగి, ఎద్దు లేవలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే బోడాయికుంట గ్రామంలో లింగన్న అనే రైతు తన ఇంటి రేకులు భారీ స్థాయిలో వచ్చిన గాలికి కర్రలతో సహా లేచిపోయి ధ్వంసం అయ్యాయి.
అలాగే పెద్దూరు గ్రామంలో పూనెం రాము, కొమరం రఘుబాబు ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కాగా, ఆదివారం రాత్రి పిడుగు పాటుకు గురై బోడాయికుంట గ్రామానికి చెందిన గుమ్మడి పొట్టయ్య, గొగ్గెల నర్సయ్య అనే రైతులకు చెందిన  సుమారు రూ.80 వేల విలువ చేసే 2 దుక్కి టెద్దులు, పెద్ద వెంకటాపురం గ్రామంలోని వజ్జ రామయ్య అనే రైతుకు చెందిన ఒక గిత్త, ఆవు సుమారు రూ.90 వేల విలువ చేసే పెద్ద జాతి పశువులు సైతం మృత్యువాత పడ్డాయి. అదేవిధంగా పలు గ్రామాల్లో భారీ గాలి దుమారం, వర్షానికి పలువురు రైతుల రబీ పంటలు కొంత మేరకు నష్టపోగా, కాయ పెరుదల లేక కోయని మామిడి తోటల రైతులకు సైతం నష్టం వాటిల్లింది. గత రాత్రి పిడుగులు, భారీగా వీచిన గాలి దుమారానికి, వర్షానికి పాడి పశువుల ప్రాణం, ఆస్తి, పంట, పండ్ల తోటలు నష్టపోయిన రైతులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని దీనంగా వేడుకుంటున్నారు.
Spread the love