పాస్ పోర్టు నుంచి వీసా వరకు.. నకిలీలదే హవా

– కొరడా ఝులిపిస్తేనే అభాగ్యులకు న్యాయం
నవతెలంగాణ – సిరిసిల్ల
ఓ వ్యక్తికి సంబంధించిన కష్టం కాదు. అనేకమంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇబ్బందులు పడుతున్నారు. ఏజెంట్లపై నియంత్రణ లేకపోవడంతో ఇబ్బడి ముబ్బడిగా కార్యాలయాలు వెలిశాయి. వాస్తవానికి పాస్ పోర్టు తీసేందుకు ఆన్లైన్ లో నమోదు చేసుకుంటే సరిపోతుంది. కానీ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల జిల్లాల్లో పలు కార్యాలయాలు వెలిసి, తాము పాస్ పోర్టుకు దరఖాస్తు చేస్తామని, పాస్ పోర్ట్ ఇప్పిస్తామని వేలాది రూపాయలు పొందుతున్నారు. పాస్ పోర్టుతోనే మొదలైన మోసాల పరంపర.. వీసాలు తెప్పించేంతవరకు ఎదగడంతో ఏజెంట్ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.
లైసెన్సులు తక్కువ.. నకిలీలు ఎక్కువ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గల్ఫ్ తదితర దేశాలకు కార్మికులు ఉద్యోగులను పంపించేందుకు తక్కువ సంఖ్యలో లైసెన్స్ కలిగిన ఏజెంట్లు ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో కేవలం ఇద్దరే లైసెన్సు కలిగి ఉండగా.. జగిత్యాల జిల్లాలో ఏడుగురు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగ్గురు మాత్రమే భారత విదేశాంగ శాఖ నుంచి అనుమతి పొందారు. వీరితో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో లైసెన్సులు పొందినవారు ఆయా జిల్లాల్లో ప్రభుత్వ అనుమతితోనే శాఖలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం 12 మంది లైసెన్స్ కలిగి ఉండగా, అనుమతి పొందిన శాఖలు మరో 20 వరకు ఉన్నాయి. వీరు మాత్రమే కార్మికులు ఉద్యోగులకు వీసాలు తెప్పించాల్సి ఉన్నా.. పుట్టగొడుగుల్లా పల్లెలు, పట్టణాల్లో నకిలీలు పుట్టుకొచ్చి, వీసాల పేరిట లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఆయా జిల్లాలో 200కు పైగా ఏజెంట్లు పాస్ పోర్టు వీసాల దండ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వీసా వివరాలు ఆన్లైన్ లో కనిపిస్తున్నా.. వీసా రుసుము వేళల్లో ఉంటున్నా.. ఏజెంట్లు మాత్రం ఇతర ఖర్చులపై సరాసరి లక్ష నుంచి లక్షన్నర వసూలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి సౌదీ అరేబియా తో పాటు యూఏఈ పరిధిలోని ఏడు దేశాలు మలేషియా తదితర దేశాలకు గతంలోనే మూడున్నర లక్షలకు పైగా కార్మికులు వెళ్లినట్లు అంచనా వేశారు. ఇందులో చాలా మంది ఏజెన్ల మోసాలతో కంపెనీలు మారడంతో పాటు నిబంధనలకు వ్యతిరేకంగా ఇతర పనులు చేయడంతో కేసులు నమోదవుతున్నాయి. ఆయా దేశాలు ఆమ్నేష్టి పేరిట నిబంధనలు సవరించినప్పుడు కార్మికుల కష్టాలు తెలుస్తున్నాయి. తాము ఏజెండ్ల మోసాలతో బయటపడినట్లు వారు చెబుతుండడంతో, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది తమను ఏజెంట్లు మోసం చేసినట్లు సోషల్ మీడియాలో పంపుతున్న వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
ఇలా చేస్తే మేలు..
– ఏజెంట్లు చేసిన మోసాలు వివరించేందుకు వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో తెలుగు మాట్లాడేవారు లేరు.
– మలేషియా, దుబాయ్, బెహరాన్, ఖతర్, కువైట్, సౌదీ అరేబియా, ఓమన్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాల్లో తెలుగు తెలిసిన వారు ఉంటే ప్రయోజనం ఉంటుంది.
– పాస్పోర్టులతో పాటు వీసాలు తెప్పించే నకిలీ ఏజెంట్ల పై కేసులు నమోదు చేస్తే సత్వర న్యాయం జరుగుతుంది.
– భారత విదేశాంగ ఆధ్వర్యంలో వివిధ దేశాల్లోని కంపెనీల వివరాలను పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉంచాలి.
– గల్ఫ్ తో పాటు ఇతర దేశాలకు వెళ్లే వారు తమకు ఏజెంట్లు ఇచ్చింది అసలు వీసానా.. నకిలీదా అని ఆన్లైన్లో తెలుసుకునే వెసులుబాటు ఉంది.
– ఏజెంట్ లైసెన్సు కలిగి ఉంటే వారి లైసెన్స్ రెన్యువల్ అయింది లేనిది ఆన్లైన్లో తెలుసుకోవాలి.
– వివిధ దేశాల్లో ఎంత మేర జీతం వస్తుందో కచ్చితంగా ఏజెంట్లు తెలిపే వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.
– ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని కంపెనీలో కార్మికుల నుంచి తాము పొందిన వీసా వివరాలను చెబితే వాస్తవాలు తెలుస్తాయి.
– వీసా పేరిట మోసం చేస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి.

Spread the love