సంకెళ్ళ నుంచి విముక్తి వరకు

From shackles to liberationపుస్తకాలు చదవాలి అని నిర్ణయించుకున్న తరువాత చదివిన పుస్తకాల్లో ఇది ఒకటి. అప్పటికి దాని గురించి ముందూ వెనకా సమాచారం ఏమీ తెలియదు. కేవలం ఎర్రని అట్టపైనున్న బొమ్మను మాత్రమే చూసి కొనుక్కున్న పుస్తకం. ఏం అంచనాలు లేకుండానే మొదలుపెట్టాను.
పట్టపగలు మొదలు పెట్టిన పుస్తకం. ఆకలి దప్పులు మరిచేపోయా. రాత్రయింది. ఎవరో లైటు వేశారు. నన్ను పిలుస్తున్న చప్పుళ్ళు ఎక్కడో బ్యాగ్రౌండ్‌ సౌండ్స్‌ లాగే ఉండిపోయాయి. గుండెను పిండేస్తున్న బాధ. కడుపులో చేయిపెట్టి పేగులను మెలితిప్పే దుఃఖం. కట్టలు తెంచుకునేంతటి ఉక్రోషం. ఆపుకోలేని ఉత్కంఠ. గుక్క తిప్పుకోనివ్వని ఉద్వేగం. ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్న కళ్ళు. అక్షరాల వెంట పరుగులుతీస్తూ ఆ చీకటి ప్రపంచంలోనే కొట్టుమిట్టాడుతున్న నేను ఆఖరు పేజీ దాకా వదలనివ్వకుండా అంటిపెట్టుకుందా పుస్తకం. ఆ తరువాత చూశాను వెనుక అట్టపైన రచయిత పేరు, ఫొటో
ఒక పుస్తకం మనిషిని ఇంతలా అతలాకుతలం చేస్తుందని పందొమ్మిదో సంవత్సరం దాకా తెలియలేదు. అంతదాకా పేదరాశి పెద్దమ్మ కథలో, సింద్‌ బాద్‌ సాహస యాత్రలు మాత్రమే తెలిసిన నాకు ఈ పుస్తకం ఒక కుదుపు. అలాంటిలాంటి కుదుపు కాదది. అంతదాకా సుపరిచితులైన వారి స్వభావాలపై ఎటువంటి అంచనాకు రావాలో తెలియని అయోమయపు కుదుపు. ఒక బాస్‌ వద్ద పనిచేసే సబార్డినేట్‌ను… ఇద్దరి దష్టి కోణాలను గమనించదగిన కుదుపు. అదే విధంగా హైరార్కీలో ఏ విధంగా ఉంటుందో తరచి చూసే కుదుపు. నెలరోజులపాటు వెంటాడి నన్ను నన్నుగా నిలబెట్టడంలో ఘనమైన పాత్ర పోషించిన పుస్తకం అది. జీవితాంతం మరిచిపోలేని, వదలలేని పుస్తకమై కూర్చుంది. అదే ‘ఏడు తరాలు’. ఇరవై ఏళ్ళు గడిచాయి ఈ పుస్తకం చదివి. మళ్లీ చదివే స్థైర్యాన్ని ఇంకా కూడగట్టుకుంటూనే ఉన్నాను. పుస్తకాన్ని ప్రేమగా హత్తుకుంటాను. తిరిగి పెట్టేస్తూ ఉంటాను. నా దష్టిలో కుంటా కింటే గొప్ప యోధుడు. నల్లజాతి యోధుడు. నా మనో ఫలకంలో ఇలాగే నిక్షిప్తమై ఉన్నాడు.
మనుషుల్లో ఇంతటి క్రౌర్యం దాగి ఉంటుందా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక నీగ్రో జాతికి చెందిన రచయిత తరతరాలుగా కొనసాగుతున్న వర్ణ వివక్ష మూలాలకు బీజం ఎక్కడ పడిందో వెతుక్కుంటూ తన వంశ ఏడు తరాల చరిత్రను వెలికి తీశాడు. ఎంత అబ్బురమైన విషయమిది. ఇందుకోసం శతాబ్దాల చరిత్రను పరిశోధించి తన మూలాలను పట్టుకుని మనకో హీరోను పరిచయం చేస్తాడు. అతడే రచయిత వంశానికి చెందిన మూల పురుషుడు కుంటా కింటే. పదహారేళ్ళ దాకా తల్లిదండ్రుల చెంత స్వేచ్ఛగా విహరించే కుంటా కింటేను తెల్లదొరలు బంధించి తీసుకెళ్తారు. తెల్ల జాతీయులు, నల్లజాతీయులను బానిసలుగా మార్చుకోవడం అప్పుడే ప్రారంభమవుతుంది. అంటే 1619లో అన్నమాట. అక్కడి నుంచి కుంటా కింటే పేరు మార్చుతారు. తన నేల పశ్చిమ ఆఫ్రికా నుంచి తెల్ల తోలువారి బందీగా ఒక బోటులో ప్రయాణిస్తాడు. అది కూడా బోటులో గాలీ వెలుతురు ఆడని చీకటి భాగాన కుక్కి తీసుకు వెళ్తారు. అక్కడి నుంచి బానిసల మార్కెట్లో మరెవరో యజమాని చేతుల్లోకి మారతాడు. తన నేల పరిసరాలు తప్ప మరేమీ తెలియని కింటే ఆ వింతైన ప్రపంచం నుంచి పారిపోజూస్తాడు. నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమవుతాడు. ఇతడి పెనుగులాటను భరించని ఒక తెల్ల యజమాని కింటే కాలును నరికేస్తాడు. అది సహించలేని ఆ యజమాని సోదరుడు ఇతడిని కొనుగోలు చేసి వైద్యం అందించి ప్రాణాలు కాపాడతాడు. చివరకు అదే ఇంటిలో ఉంటూ వాస్తవాలను జీర్ణం చేసుకుంటూ నెమ్మదిగా రాజీ పడతాడు. అక్కడే వంట చేస్తున్న బానిసను పెళ్ళి చేసుకుంటాడు. వారికో కుమార్తె కలుగుతుంది. ఆమెకు తన నాయనమ్మ పేరు పెట్టుకుని తన వంశాచారాల ప్రకారమే పెంచుతాడు. ఆమె కూడా ఎదిగిన తరువాత బానిసగా మరో ఇంటికి అమ్ముడవుతుంది. అక్కడ యజమాని చేతిలో అత్యాచారానికి గురై అతడి కొడుకుకు తల్లి అవుతుంది. అతడు బానిస కొడుకుగానే గుర్తింపు పొందుతాడు తప్ప తెల్ల యజమాని బిడ్డగా కాదు. అయితే కింటే తన బిడ్డకు తన కథ అంతా చెబుతాడు. అదే కథను బిడ్డకు పుట్టే బిడ్డలకు, ఆ తరువాత బిడ్డలకు అలా చెబుతూ పోవాలని కోరుకుంటాడు.
ఏడో తరం అయిన రచయిత తన నాయనమ్మ నోట ఈ కథ విన్న తరువాతే పరిశోధన మొదలుపెట్టి రాసిన వాస్తవిక గాథ ఇది. ఆ రచయిత అలెక్స్‌ హేలీ.
అగ్రరాజ్యంగా విర్రవీగుతూ ఇతర దేశాలపై పెత్తనం చెలాయిస్తూ, నీతి బోధలు చేసే ఈ దేశ చరిత్రా ఇంత హీనం అనిపించకమానదు. సాటి మనుషులను బానిసలుగా చేసుకుని వారి రక్తమాంసాల ప్రవాహాలపై, శవాల గుట్టలపై నడిచొచ్చిన నీచమైన చరిత్రకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. జాత్యహంకారం ఎంత దారుణంగా ఉండేదో చెప్పడానికో ఉదాహరణ ఈ పుస్తకం.
గొర్రెనో, బర్రెనో కొనుక్కున్నట్లు ఒక మనిషిని కొనడం, బానిసగా మార్చుకోడం. ఆ బానిసకో ఆలోచన, మనసు ఉంటుందనే స్పహే వారికి ఉండకపోవడం విచిత్రం. ఒక బల్లనో, కుర్చీనో తమ గదిలో ఉన్నట్లుగా ఓ బానిసా పడి ఉంటుంది ఓ పక్కన. గుక్క తిప్పుకోకుండా మాట్లాడుకునే అనేక విషయాలు పుస్తకంలో ఉన్నాయి. పుస్తకం చదువుతూ ఆ పరిస్థితులను ఆవాహన చేసుకున్నప్పుడు అద్భుతంగా తోస్తుంది. ఈ పుస్తకాన్ని ప్రతి నల్ల జాతీయుడు బైబిల్‌ గా దాచుకున్నాడు.
పుస్తకం వెలువడిన తరువాత ప్రపంచవ్యాప్తంగా లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. ఎన్నో దేశాలు పుస్తకాన్ని వారి వారి భాషల్లోకి అనువదించుకునే హక్కులు పొందారు. అమెరికా నిజ స్వరూపం ప్రపంచానికి వెల్లడించిన పుస్తకంగా నిలిచిందీ ఏడు తరాలు. అమెరికా అధ్యక్షుడిగా అబ్రహం లింకన్‌ ఉన్న సమయంలో ఈ నల్ల జాతీయులకు విముక్తి లభించింది. లింకన్‌ బానిసత్వాన్ని రద్దు చేసాడు. అందుకోసం దేశంలో అంతర్యుద్ధం జరిగింది. బానిసత్వం రద్దు చేసిన వారం రోజుల్లోనే లింకన్‌ హత్యకు గురయ్యాడు. తళుకు బెళుకుల రాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాలో ఇప్పటికీ జాతి వివక్ష కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే వ్యక్తి ‘ఐ కాంట్‌ బ్రీత్‌’ అంటూ ఒక అమెరికన్‌ పోలీసాఫీసర్‌ మోకాలికింద నలిగి ప్రాణాలర్పించాడు.
ఈ పుస్తకం గురించి వికీపీడియాలో ఇలా రాసి ఉంది… ”స్వేచ్ఛనుంచి సంకెళ్ళ దాకా, సంకెళ్ళనుంచి విముక్తికి సాగిన ఒక ప్రస్థానం ‘ఏడు తరాలు”. అక్షరసత్యం ఈ అక్షరాలు.
– నస్రీన్‌ ఖాన్‌

Spread the love