– మొబైల్, వెబ్ ఆధారిత గేమ్స్‌కు కేంద్రం యోచన
– ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆహ్వానం
– జాతీయభావం, కేంద్ర పథకాలు, కార్యక్రమాలే అంశాలు
– ఇదంతా రాజకీయ ప్రయోజనం కోసమే : విశ్లేషకులు
న్యూఢిల్లీ : పౌరుల కోసం కొత్త రకమైన మొబైల్, వెబ్ ఆధారిత గేమ్‌లను తీసుకురావటా నికి కేంద్రం యోచిస్తున్నది. పౌరుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ, ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి, సమస్య-పరిష్కార, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను అభివృద్ధి చేయటం కోసం ఈ ప్రయత్నమని కేంద్రం చెప్తున్నది. ఈ మేరకు జాతీయభావం, కేంద్ర ప్రభుత్వ, కార్యక్రమాలను స్పృశించేలా చర్యలు తీసుకుంటున్నది. అయితే ప్రజలలో ఈ గేమ్స్‌ను ఒక ప్రచారసాధనంగా ప్రభుత్వం వినియోగించుకుంటున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద సిటిజన్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన ‘మైగవ్’.. జాతీయ ఆసక్తి ఉన్న థీమ్‌ల ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ గేమ్‌ల అభివృద్ధి కోసం ప్రతిపాదనలను ఆహ్వానించింది. ”ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగంలో పెరుగుదల, ఆసక్తి స్థాయిని పరిగణనలోకి తీసుకుంటే, పౌరుల కోసం కొత్త మోడళ్లను రూపొందించే సమయం ఆసన్నమైంది” అని గత వారం విడుదల చేసిన రిక్వెస్ట్ ఫర్ ఎంపానెల్‌మెంట్(ఆర్‌ఎఫ్‌ఈ) పత్రం మంత్రిత్వ శాఖ వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నది. ప్రజల అవగాహనను మెరుగుపరచడం, అభిప్రాయాన్ని తెలుసుకోవడం, నేర్చుకోవడం, సమాచార వ్యాప్తికి ఆటలు గొప్ప సాధనం అని అనేక పరిశోధన అధ్యయనాలు సూచిస్తున్నాయని వివరించింది. 2014లో ప్రధాని మోడీ ప్రారంభించిన ‘మైగవ్’ 3.41 కోట్ల కంటే ఎక్కువ నమోదిత వినియోగదారులను కలిగి ఉన్నది.
ఈ అంశాల పైనే గేమ్స్
యుద్ధవీరులు, స్వచ్ఛతా మిషన్, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ), నగర ప్రణాళిక, పట్టణ అభివృద్ధి, వాతావరణ మార్పు, గ్రామీణాభివృద్ధి, జాతీయ వ్యవసాయ విధానం, లైఫ్ (సుస్థిర భవిష్యత్తును నిర్మించడం), నా సంస్కృతి నా ప్రైడ్ వంటి ”జాతీయ ఆసక్తికి సంబంధించిన థీమ్‌ల” ఆధారంగా ఈ గేమ్స్ రూపొందించబడతాయని తెలిసింది. క్రాస్‌వర్డ్, వర్డ్ సెర్చ్, నంబర్, తేడాను కనుగొనడం, లాజిక్ పజిల్స్ వంటి పజిల్ గేమ్‌లుగా వీటిని అభివృద్ధి చేయొచ్చని సమాచారం. అయితే, వీటిని అన్ని వయసుల పౌరులు, విద్యార్థులను ఆకర్షించడానికి ఉపయోగపడతాయని టెక్ నిపుణులు అంటున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జాతీయత అనే భావోద్వేగ, సున్నితమైన అంశాన్ని మోడీ సర్కారు మరో విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నదనీ, అందుకే ఈ వేదికను ఉపయోగించుకుంటున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ”ఇలాంటి గేమ్స్ స్వీయ – ప్రేరేపిత వ్యవస్థలు. గత కొన్ని సంవత్సరాలుగా, గేమ్ డిజైనర్లు భావోద్వేగాలను సష్టించేందుకు, వాటి ద్వారా లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి మార్గాన్ని కేంద్రం అనుసరించాలనుకుంటున్నది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇలాంటి మొబైల్, వెబ్ ఆధారిత గేమ్స్‌ను తీసుకురావాలనుకుంటున్నది. ప్రజలు ఈ విషయంలో జాగరూకతతో వ్యవహరించాలి” అని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
2019లో సార్వత్రిక ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న ‘పుల్వామా ఉగ్రదాడి’ అంశాన్ని మోడీ సర్కారు రాజకీయంగా ఉపయోగించుకొని ఎన్నికల్లో లబ్ది పొందిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అదే దారిలో ఈ వీడియోగేమ్స్ ద్వారా ప్రయోజనం పొందాలన మోడీ సర్కారు యోచిస్తున్నదనీ, ఈ విషయం పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.