క్యారెట్‌ తో క‌మ్మ‌గా..

Delicious with carrot..క్యారెట్‌.. మనం నిత్యం ఉపయోగించే కూరగాయల్లో ఒకటి.. దీన్ని పచ్చిగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు.. ఇందులో పోషకాలూ పుష్కలంగా ఉంటాయి. క్యారెట్‌ తినటం వల్ల ఆరోగ్యం, చర్మం రెండింటికీ మేలు చేస్తుంది. క్యారెట్‌లో విటమిన్‌ ఏ, విటమిన్‌ కె, విటమిన్‌ సి, పొటాషియం, ఫైబర్‌, కాల్షియం వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్‌ ఏ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. క్యారెట్‌ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే క్యారెట్‌లో యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఎన్నో ప్రయోజనాలున్న ఈ క్యారెట్‌తో చేసే వెరైటీ రెసిపీలను చూద్దాం…
క్యారెట్‌ హల్వా
కావలసిన పదార్థాలు : క్యారెట్‌ – ఒక కేజీ. చిక్కటిపాలు – ఒక కప్పు, చక్కెర ఒక కప్పు, నెయ్యి కొద్దిగా, యాలుకల పొడి, గార్నిష్‌ కోసం డ్రై ఫ్రూట్స్‌.
తయారీ విధానం : క్యారెట్లను కడిగి పై పొట్టు తీసుకోవాలి. క్యారెట్‌ హల్వా కోసం ఒక్కో క్యారెట్‌ను తురమడానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా సులభంగా క్యారెట్‌ను తురమాలంటే క్యారెట్‌ను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని ముక్కలు బరకగా అయ్యేట్టుగా మిక్రీలో గ్రైండ్‌ చేసుకోవాలి.
తరువాత ప్యాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యిని వేసి అందులో తురిమిన క్యారెట్‌ను వేసి రెండు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. క్యారెట్‌ పచ్చి వాసన పోయేంత వరకు, కొంచం బ్రౌన్‌ కలర్‌లో వచ్చేంతవరకు అలాగే కలుపుకోవాలి.
ఒక కప్పులో చిక్కటి పాలను తీసుకోవాలి. ప్యాన్‌లో ప్రై అవుతున్న క్యారెట్‌లో ఆ పాలను పోసి కలుపుకోవాలి. పాలు, క్యారెట్‌ రెండింటినీ మీడియం ఫ్లేమ్‌ మీద అరగంటపాటు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత అందులో ఒక కప్పున్నర చెక్కర వేసుకోవాలి. రెండింటినీ బాగా మిక్స్‌ చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు కలుపుకోవాలి. చెక్కర పాకం, పాలు, రెండూ ప్యాన్‌లో మిగలకుండా క్యారెట్‌లో కలిసిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్‌పై వుంచి కలుపుకుంటూ ఉండాలి.
తరువాత రెండు టేబుల్‌ స్పూన్ల కోవాను యాడ్‌ చేసుకోవాలి. టేస్ట్‌ కోసం యాలాకుల పొడి, తరుమిన డ్రైఫ్రూట్‌ను వేసుకోవాలి. క్యారెట్‌ హల్వా కొంచెం ఎర్రగానే ఉంటుంది కాబట్టి ఎలాంటి కలర్‌ను యాడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.
దోసె
కావలసిన పదార్థాలు : బియ్యం – ఒక కప్పు మినప్పప్పు – ఒక కప్పు, తురిమిన క్యారెట్‌ – ఒక కప్పు, పసుపు – అర స్పూను, కారం – అర స్పూను, వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను,అల్లం పేస్ట్‌ – ఒక స్పూను, నూనె – సరిపడా, జీలకర్ర – ఒక స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – తగినన్ని
తయారీ విధానం : బియ్యం, మినప్పప్పును శుభ్రంగా కడిగి విడివిడిగా మూడు గంటల పాటు నానబెట్టాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాన్ని రాత్రంతా వదిలేయాలి. దీనివల్ల ఆ పిండి పులుస్తుంది. మరుసటి రోజు దోశ పిండిని బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు, నీరు కలుపుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్‌ కోసం క్యారెట్‌ను రెడీ చేసుకోవాలి. ఒక స్టవ్‌ మీద కళాయి పెట్టి నూనె వేసి ఒక కప్పు తురిమిన క్యారెట్‌ ను వేసి బాగా వేయించాలి.
అందులోనే పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం వేసుకొని బాగా ఫ్రై అయ్యేలా చూడాలి. కాస్త ఉప్పును కూడా వేసుకోవాలి. నాలుగు నిమిషాల పాటు వేయించాక మిక్సీలో వేసి పేస్టులాగా చేసుకోవాలి. దాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. మసాలా దోశకు ఎలా అయితే ఆలూ కూర చేస్తారో క్యారెట్‌ దోశకు అలాగే ఈ క్యారెట్‌ మిశ్రమాన్ని చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ మీద పెనం పెట్టి ఆయిల్‌ రాసి దోశను వేసుకోవాలి. దోశ మీద ఈ క్యారెట్‌ మిశ్రమాన్ని ఒక రెండు టేబుల్‌ స్పూన్లు వేసి దోశ అంతా పరుచుకునేలా చేయాలి. బాగా కాలాక దోశెను ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ దోశలో అదనంగా క్యారెట్‌ని వినియోగించాం కాబట్టి సాధారణ దోశతో పోలిస్తే ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
పరాటా
కావలసిన పదార్థాలు : క్యారెట్‌ తురుము – రెండు కప్పులు, గోధుమపిండి – నాలుగు కప్పులు, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – అరకప్పు, అల్లం తరుగు – ఒక స్పూను, ఉల్లిపాయ తరుగు – అరకప్పు, పచ్చిమిర్చి తరుగు – ఒక స్పూను, నెయ్యి – తగినంత,
తయారీ విధానం : క్యారెట్లు, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర… అన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో గోధుమపిండి వెయ్యాలి. రుచికి సరిపడా ఉప్పును కలుపుకోవాలి. తురిమిన క్యారెట్లు, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసుకోవాలి. అలాగే నీరు కలిపి చపాతీ పిండిలా వచ్చేలా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం నుండి చిన్న భాగాన్ని తీసుకొని గుండ్రంగా బంతిలా చేసి ఒత్తుకోవాలి. స్టవ్‌ మీద పెనం పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక ఒత్తుకున్న చపాతీని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే క్యారెట్‌ పరాటా రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
మిల్క్‌ షేక్‌
కావాల్సిన పదార్థాలు : క్యారెట్‌ తరుగు – ముప్పావు కప్పు, యాలకుల పొడి – చిటికెడు, పాలు – ఒక కప్పు, బాదం తరుగు – మూడు స్పూన్లు, కోవా – రెండు స్పూన్లు
తయారీ విధానం : క్యారెట్‌ని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. బాదం పప్పులను నాలుగు గంటల పాటు నానబెట్టి దాని పైన ఉన్న తొక్కను తీసేయాలి. ఇప్పుడు స్టవ్‌ మీద ఒక గిన్నె పెట్టి పాలు పోయాలి. పాలు బాగా మరగనివ్వాలి. అలా మరుగుతున్నప్పుడు తరిగిన బాదం, క్యారెట్‌ తరుగు, యాలకుల పొడి వేసి కలపాలి. అలాగే కోవాను కూడా వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లారాక మిక్సీలో వేసి ఒకసారి రుబ్బుకోవాలి. పైన యాలకుల పొడిని చల్లుకోవాలి. అంతే టేస్టీ క్యారెట్‌ మిల్క్‌ షేక్‌ రెడీ. గ్లాస్‌లో పోసుకుని సర్వ్‌ చేసుకోవటమే.

Spread the love