ఒక తూరుపు పొద్దు పొడిచినపుడు
నారింజ కిరణాల శుశ్రూషకు ఉన్నట్టుండి
గాజా మూర్ఛ నుండి లేచింది..
దాని ఊపిర్లు, తిరుగుతున్న భూగోళం
చుట్టూ చక్కర్లు కొట్టి వచ్చేశారు
గుండెలపై, నిరుడు పారేసుకొన్న
నవ్వులు ఏరుకొంటూ పసిపాపల పాదముద్రలు
పరుగులు పెడుతుంటే కొత్తగా పుట్టాననుకొంది
జాత్యహంకార శరాఘాతానికి మూర్చిల్లి లేచి
కాళ్లు చేతులు విదిలించుకొంటూంటే..
దరిమిలా, అలాగే చచ్చిపొమ్మని
సామ్రాజ్యవాద హూంకరింపొకటి!
గాజా గుండెల్లో గిజిగాడి గూళ్లు అల్లుకొన్న
పాత బంధాలు
కూలిపోయిన బతుకులకు మిగిలిపోయిన
కొత్త ఆశలు ప్రోదిచేసుకొంటుంటే..
అంత బతికున్నాక శవంగా ఎలా అవుతుంది!
సరిహద్దుల వద్ద కొత్తదార్లకు కొన్ని వేడుకోళ్లు
పాతుకొంటుంటే
పగిలిన గాజు గుండె ముక్కల్లో
పాత ఉదయాల కోసం కోటి ఆకాంక్షలు
వెతుక్కొంటూన్న హృదయాలెన్నో..
గాజా! నీవిప్పుడు మరోజన్మే!
హృదయం నిండా శాంతి సుమాలే
విరబూయాలిప్పుడు!
-భీమవరపు పురుషోత్తమ్