రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల పక్షపాత ధోరణి వహించకుండా దుబ్బాక అభివృద్ధికి నిధులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాటుగా ఎలాంటి నిధులు మంజూరు చేయకపోవడంతో దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్ గ్రామంలో ఎమ్ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.1 లక్ష 13 వేలతో నిర్మించతలపెట్టిన ఫామ్ పాండ్ పనులకు రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో కలిసి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఈజీఎస్ ద్వారా ఎక్కువ రోజులు పని చేసిన బైతి దుర్గవ్వను,మొక్కల రక్షణలో విశేష సేవలు అందించిన వనసేవక్ రాములు ను,శానిటేషన్ విభాగంలో సేవలందిస్తున్న జే.బాబులను శాలువాలతో సత్కరించారు.రూ.10 లక్షలతో చేపట్టబోయే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా వంద పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు.రోగులకు అందుతున్న వైద్య సేవలు,కలుగుతున్న అసౌకర్యాలను ఆరా తీశారు. అనంతరం మెడిసిన్ స్టోర్ ను,అక్కడి రికార్డులను పరిశీలించారు.ప్రభుత్వ వైద్యులు,సిబ్బంది సకాలంలో విధులకు ఆలస్యంగా హాజరవడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి సకాలంలో డ్యూటీకి రాని వైద్యులు,సిబ్బందిని సస్పెండ్ చేయాలని కోరారు.ఆసుపత్రి అంతా కలియ తిరుగుతూ రోగులను పరామర్శించారు.విధుల్లో అలసత్వం వహించే వారిపట్ల ఆసుపత్రికి చెడ్డపేరు వస్తుందని.. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు.ఆ తర్వాత మండల పరిధిలోని రాజక్కపేటలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి,కౌన్సిలర్లు,పీఏసీఎస్ చైర్మన్ కైలాష్,ఏపీడీ శివాజీ,ఎమ్మార్వో సంజీవ్ కుమార్,ఎంపీడీవో భాస్కర శర్మ, పలువురు బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.