నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక వైద్యసేవలు అందించే దిశగా కీలక అడుగు పడింది. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ని ప్రారంభించింది. బుధవారం ఈ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. సెన్సిటైజేషన్ శిక్షణ పొందిన వైద్య నిపుణుల సిబ్బంది ట్రాన్స్‌జెండర్లకు విస్తృతమైన వైద్య చికిత్సలను అందిస్తారు. ప్రస్తుతం ఈ క్లినిక్ వారానికి ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ప్రతి బుధవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేస్తుంది. దవాఖానకు వచ్చే వారి సంఖ్యకు అనుగుణంగా రానున్న రోజుల సంఖ్యను పెంచాలని యోచిస్తున్నారు. అయితే ఉస్మానియా ఆస్పత్రిలో తమ కోసం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేయడంపై ట్రాన్స్ జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.