– అభ్యర్థుల విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలలతోపాటు జూనియర్ కళాశాలల బలోపేతం కావాలంటే 1,392 జూనియర్ లెక్చరర్ల (జేఎల్) పోస్టులకు తుది ఫలితాలు విడుదల చేసి వారికి నియామక పత్రాలను ఇవ్వాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. విద్యను బలోపేతం చేయడంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా చాలా ముఖ్యమని తెలిపారు. రాష్ట్రంలో 425 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయనీ, బోధించే వారు సరిగ్గా లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడుతున్నదని పేర్కొన్నారు. 2022లో 1,392 జేఎల్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని వివరించారు. 2023లో పరీక్షలు నిర్వహించిందనీ, ఈ ఏడాదిలో జీఆర్‌ఎల్‌ను ప్రకటించిందని తెలిపారు. 1:2 పద్ధతిలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తుది ఫలితాలు రాకపోవడం వల్ల జేఎల్ అభ్యర్థులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. 56 రోజుల్లోనే డీఎస్సీ ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వం ఈనెల తొమ్మిదిన ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలను ఇస్తున్నట్టు ప్రకటించిందని తెలిపారు. కానీ రెండేండ్లుగా ఎదురుచూస్తున్న జేఎల్ అభ్యర్థులకు మాత్రం తుది ఫలితాలను ప్రకటించి నియామక పత్రాలను అందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల బాగుకోసం ఉపాధ్యాయులు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల బలోపేతానికి జూనియర్ లెక్చరర్లు ఎంతో అవసరమని వివరించారు. అందుకే జేఎల్ పోస్టులకు తుది ఫలితాలను ప్రకటించి 1,392 మంది జేఎల్స్‌కు నియామక పత్రాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని ఫలితాలు ప్రకటించేలా చూడాలని కోరారు.