రాజన్న ఆలయ అభివృద్ధిపై సీఎం పట్టుదలతో ఉన్నారు: ప్రభుత్వ విప్ ఆది

– రాజన్న కోడెలపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్..
– సీఎం ఆదేశాలతో గోశాలను పరిశీలించిన ఓఎస్డీ శ్రీనివాస్, ప్రభుత్వ విప్ ఆది..
నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కోడెల విశిష్టత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా తెలుసునని, ఇప్పటివరకు జరిగిన చాలా సమావేశాల్లో కోడెల సంరక్షణపై సీఎం చాలాసార్లు ప్రస్తావించారని, ఓఎస్డీ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తిప్పాపూర్ లోని గోశాలను ఓఎస్డి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేసి, కోడెల సంరక్షణ కొరకు చేపటాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలసి ఆలయ  మీడియాతో మాట్లాడారు.  రాజన్న భక్తులు ఎంతో విశ్వాసంతో చెల్లించుకునే కోడె మొక్కుల పట్ల ముఖ్యమంత్రి కి పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని, కోడెల దీనస్థితిని అధ్యయనం చేసే క్రమంలో ఇప్పటికే  ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎండోమెంట్ కమిషనర్ గోశాలను సందర్శించడం జరిగిందని అన్నారు. అదే క్రమంలో తాను కూడా గోశాలను పరిశీలించానని అన్నారు. చిన్నగా ఉన్న గోశాల స్థలంలో 1500 కోడెల సంరక్షణ కష్టంగా ఉందని, కోడెల సంరక్షణ కొరకు ఇప్పుడు ఉన్న7 షెడ్లతో పాటు మరో రెండు షెడ్లు వేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.1.11 కోట్లతో గోశాలలో ఫ్లోరింగ్ వేసేందుకు నిధులు మంజూరయ్యాయని, గోశాల అభివృద్ధికి ఇంకెన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కోడెలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి ఆరోగ్య స్థితగతులను పరిశీలిస్తూ, పౌష్టికాహారం అందించడం, బలహీనంగా ఉన్న కోడెలకు వైద్యం చేయించడం కొరకు  వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వీలైతే గోశాలకు వచ్చే కోడెలను వివిధ మఠాలకు, గుర్తింపు పొందిన  గోశాలలకు, వ్యవసాయం చేసే రైతులకు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని,  గత 5నెలల క్రితమే రాజన్న ఆలయం, గోశాల అభివృద్ధి కొరకు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశామని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో గతంలో వెనక్కి వెళ్లిన వి.టి.డి.ఏ నిధులు రూ.20కోట్లను తిరిగి రప్పించడం జరిగిందని, మధ్యలో ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధిలో కొంత ఆలస్యం జరిగిందని అన్నారు. రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకునే భక్తులు ఆరోగ్యంగా, పాలు మరచిన, నిర్ణీత వయసు నిండిన కోడెలను మాత్రమే సమర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామకృష్ణ, ఆలయ అధికారులు అర్చకులు,సిబ్బంది తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love