ప్రభుత్వాలు ఏవైనా పోరాటాలు ఆగవు

ప్రభుత్వాలు ఏవైనా పోరాటాలు ఆగవు– పర్సా సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల ముగింపు సభలో.. : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వాలు ఏవైనా పోరాటాలు ఆగవని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన పర్సా సత్యనారాయణ శతజయంతి ఉత్సవాల ముగింపు సభలో ”మతోన్మాదం-కార్మిక వర్గంపై ప్రభావం” అనే అంశం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మళ్ళీ మోడీ ప్రధాని అయితే ఆందోళనలు, పోరాటాలకు అడ్డంకిగా మారుతుందని అన్నారు. ప్రభుత్వాలు ఏవైనా కార్మిక వర్గ సమస్యల కోసం, కార్పొరేట్‌ శక్తుల కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. కార్మిక వర్గంపై మతం ప్రభావం పడుతున్నప్పటికీ వాటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ సేవకుడిని అని, చౌకీదారునని చెప్పుకున్నారని, ఇప్పుడు ఏకంగా దేవుడునని చెప్పుకుని ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడాన్ని బట్టి చూస్తే దేశానికి ప్రమాదం పొంచి ఉందని అన్నారు. పరిశ్రమల్లో కార్మిక ఉద్యమాలు తగ్గాయని, అంత బలంగా లేవని అభిప్రాయపడ్డారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం సరైంది కాదని, దాని ప్రభావం నుంచి కార్మిక వర్గం దూరంగా ఉండాలని సూచించారు. ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవడానికి వెనకాడేవారు కానీ, నేడు పేరు పక్కన కులం తోక పెట్టుకుని దర్జాగా తిరుగుతున్నారని తెలిపారు. మతం ఒకప్పుడు కొంత మందికే పరిమితం కాగా, నేడు దాన్ని ఫ్యాషన్‌గా చెప్పుకుని తిరగడం కనిపిస్తుందని విమర్శించారు. దేశంలో కార్మిక శక్తికి మించిన బలమైన శక్తి మరొకటి లేదని, దానికి జరిగే అన్యాయానికి ఎర్రజెండా ముందు బాగాన నిలబడి ఉద్యమాలు చేస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎర్రజెండా ఆధ్వర్యంలో కార్మిక, కర్షక, రైతు కూలీలు ఐక్యమై.. పెద్దఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు.

Spread the love