నాన్నమ్మ భోజనం

Grandma's lunchరమ్య ఎనిమిదవ తరగతి, హేమ ఆరవ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ క్రమశిక్షణ కలవారు, బాగా చదువుతారు. కానీ అన్నం తినే దగ్గర ఇద్దరూ రోజూ గోలే. ఏ పూటకాపూట వాళ్ళకు కూర నచ్చకపోతే సగం అన్నం కూరతో, సగం అన్నం పచ్చడితో తింటారు. కూర నచ్చకపోతే అన్నం అంతా పచ్చడితోనే తింటారు.
”పచ్చళ్ళు ఎక్కువగా తినొద్దమ్మా, ఏదో ఒకటిరెండు ముద్దల్లో తినాలి. లేదంటే మజ్జిగలో నంజుకోవాలి” అని వాళ్ళ అమ్మ లక్ష్మి చాలాసార్లు చెప్పింది. అయినా సరే వాళ్ళు వినరు. పచ్చళ్ళు తింటూనే ఉంటారు. తరచూ కడుపులో నొప్పి, కళ్ళుమండటం, జుట్టు రాలటం, ఒక్కోసారి జ్వరం రావడం వంటి సమస్యలతో బాధపడుతూనే ఉంటారు.
పచ్చళ్ళు అదేపనిగా తినవద్దని గట్టిగా చెబితే అసలు అన్నం తినటమే మానేస్తారు.
పచ్చళ్ళు అతిగా తినకూడదని భర్తతో పిల్లలకు చెప్పించింది లక్ష్మి. వాళ్ళ అర్థం చేసుకోలేదు. అదే విషయాన్ని వాళ్ళు చదివే పాఠశాల ఉపాధ్యాయులతో చెప్పించింది లక్ష్మి. ఉపయోగం లేదు. వైద్యునితో కూడా చెప్పించింది. కానీ పిల్లలు వినలేదు. లక్ష్మికి వాళ్ళలో మార్పు ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు.
అంతలో వాళ్ళ ఇంటికి రమ్య, హేమల నానమ్మ, తాతయ్య వచ్చారు. నానమ్మ కబుర్లు చెపుతుంది. తాతయ్య కథలు చెపుతాడు. పిల్లల ఆనందానికి అంతులేకుండా పోయింది.
రమ్య, హేమల తిండి సంగతి అత్తగారు గంగమ్మకు చెప్పింది లక్ష్మి. ఇక ఆ రోజు నుండీ రమ్య, హేమలకు భోజనం వాళ్ళ నాన్నమ్మ గంగమ్మ పెట్టసాగింది.
కొన్ని రోజులు గడిచాయి. ఎలాంటి మారాం లేకుండా, పచ్చడి వాడకుండా పిల్లలు అన్నం తినటం లక్ష్మికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అత్తగారు పిల్లలకు అన్నం ఎలా పెడుతుందో అని ఒక రోజు గమనించింది లక్ష్మి.
రాత్రి ఏడు గంటలు కాగానే భోజన పదార్థాలన్నీ సర్ది పిల్లల్ని భోజనానికి పిలిచింది గంగమ్మ.
రమ్య, హేమ భోజనానికి వస్తూనే ”నానమ్మా, అవి ఏవి?” అని అడిగారు.
”ఉన్నాయమ్మా, ఇవిగో” అంటూ వేయించిన అప్పడాలు, వడియాలు పిల్లల ముందు పెట్టింది గంగమ్మ.
”నాన్నమ్మ భోజనం చాలా బాగుంటుంది” అంటూ భోంచేశారు రమ్య, హేమ. పిల్లలు మధ్యాహ్నం పాఠశాలలో తినటానికి పంపే భోజనంలో కూడా నంజుకోవటానికి అప్పడాలు, వడియాలు పెడుతోంది గంగమ్మ. దానితో వాళ్ళు పచ్చడి వైపు చూడవలసిన అవసరమే లేకుండాపోయింది.
సమస్యను ఇంత సులభంగా పరిష్కరించినందుకు అత్తగారికి ధన్యవాదాలు తెలిపింది లక్ష్మి.
– కళ్ళేపల్లి తిరుమలరావు, 9177074280

Spread the love