ద‌క్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం..

నవతెలంగాణ – హైదరాబాద్: సొంత‌గ‌డ్డ‌పై ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది. 281 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యం సాధించింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో స‌ఫారీల‌పై కివీస్‌కు ఇదే పెద్ద విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం. 1994లో జొహ‌న్నెస్‌బ‌ర్గ్‌లో జ‌రిగిన టెస్టులో కివీస్ 137 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికాను ఓడించింది. 528 ప‌రుగుల భారీ ఛేద‌న‌లో ఆల్‌రౌండ‌ర్ కైలీ జేమీస‌న్ నాలుగు వికెట్లు తీసి ద‌క్షిణాఫ్రికాను ఓటమి అంచుల్లోకి నెట్టాడు. ద‌క్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో డేవిడ్ బెడింగ‌న్‌(87) ఒక్క‌డే హాఫ్ సెంచ‌రీతో పోరాడినా జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు. శాంట్న‌ర్ చివ‌రి వికెట్ తీయ‌డంతో 247 ప‌రుగుల వ‌ద్ద‌ స‌ఫారీ జ‌ట్టు ఇన్నింగ్స్ ముగిసింది. డబుల్ సెంచ‌రీతో చెల‌రేగిన యువ ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌(240)కు ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ద‌క్కింది. ఈ విజ‌యంతో కివీస్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బే ఓవ‌ల్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ర‌చిన్ ర‌వీంద్ర‌(240) డబుల్ సెంచ‌రీ, కేన్ విలియ‌మ్స‌న్(118) సెంచ‌రీల‌తో క‌దం తొక్క‌డంతో 511ర‌న్స్ కొట్టింది. అనంత‌రం ఇన్నింగ్స్ మొద‌లెట్టిన స‌ఫారీల‌ను కివీస్ పేస‌ర్లు హ‌డ‌లెత్తించారు. ఓవర్‌నైట్‌ స్కోరు 80/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా 162 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ‌ను విలియమ్సన్‌ (109) మరో సెంచరీతో ఆదుకున్నాడు. నాలుగో రోజు 179 పరుగుల వ‌ద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సౌథీ సేన‌.. ద‌క్షిణాఫ్రికాను 247 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసి భారీ విజ‌యాన్ని అందుకుంది.

Spread the love