గృహజ్యోతి ఎవరికో.?

– గ్యాస్.. ఉచిత విద్యుత్ లకే అధికం
– మండలంలో 9,357 దరఖాస్తులు
– అమలు ఎలా అనేదానిపై సవాలక్ష ప్రశ్నలు
నవతెలంగాణ –  మల్హర్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ,ప్రజాపాలన,కార్యక్రమంలో భాగంగా ఉచిత విద్యుత్, గ్యాస్,ఇందిరమ్మ ఇల్లు,మహిళలకు ఆర్థిక సాయం పైనే అధికంగా దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది. మండల వ్యాప్తంగా 9,357 వచ్చినట్లుగా అధికారులు తేల్చారు.అయితే ఇందులో రేషన్ కార్డులు,ఇతర వాటికోసం తెల్ల కాగితంపై రాసి ఇచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేయలేదు.ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతోనే నమోదు చేయలేదని అధికారులు చెబుతున్నారు.దీంతో దరఖాస్తు దారుల్లో ఆందోళన నెలకొంది.
గ్యాస్,ఉచిత విద్యుత్ అధికం: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాపన పేరిట గత డిసెంబర్ 28 నుంచి ఈ 6వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం విదితమే.వీటిలో అధికంగా రూ.500 గ్యాస్,ఉచిత విద్యుత్,మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు వచ్చాయి.వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతం ఈఐదు గ్యారంటీలకె వచ్చాయని వీటిని పోర్టల్ డిటిపి ఆపరేటర్ల ద్వారా ఆన్లైన్లో ఈనెల 14లోపు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు.
సర్వత్రా ఉత్కంఠ: ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలు ఎప్పుడు చేస్తారోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే దీనికి అర్హులు ఎవరు.?అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.లబ్ధిదారులను ఏవిధంగా ఎంపిక చేస్తారనేదానిపై తెలియాల్సి ఉంది.ఒకవేళ 200 యూనిట్లు వినియోగం దాటితే ఎం చేస్తారనేది స్పష్టత లేదు.మండలంలో గృహ విద్యుత్ కనెక్షన్లు 5,512, వాణిజ్య 377,వ్యవసాయం 4,045, ఇతరులు 282 కనెక్షన్లు ఉన్నాయి.ఇందులో 80 శాతం వరకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.
విధివిధానాలు రాలేదు: ట్రాస్కో ఏఈ సంపత్ కుమార్ గృహజ్యోతి పథకానికి సంబంధించి ఇంకా ఎలాంటి విధివిధానాలు రాలేదు.మండల వ్యాప్తంగా ఎన్ని ఇళ్ల కనెక్షన్లు ఉన్నాయనే దానిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించాము.ఎలా అమలు చేస్తారా అన్నది ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
Spread the love