పండ్ల మొక్కలు పెంచండిలా…

ఆరోగ్యకరమైన ఆహారంలో పండ్లు చాలా ముఖ్యమైనవి. ఆ పండ్లను పక్వానికి తెచ్చేందుకు ఈ రోజుల్లో లెక్కలేనన్ని రసాయనాలు కలుపుతున్నారని, అవి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయని వింటూనే ఉన్నాం. ఆ భయంతోనే సగం మంది పండ్లు తినడం మానేశారు. అలాంటి సమస్యను అధిగమించాలటే ఇంట్లోనే పండ్లను పండించుకుంటే.. వాటిని తినడానికి ఇష్టపడకుండా ఉండరు కదా. అయితే వాటిని ఎలా పెంచగలమనేది ప్రశ్న.. ఇందుకు సంబంధించి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం…
కుండీ పరిమాణం : సాధారణంగా మొక్కల పెంపకానికి కుండల ఎంపిక చాలా ముఖ్యం. పెంచే మొక్కలు ఎంత ఎత్తు వరకు పెరుగుతాయి.. మొక్క బరువు ఎంత వరకు ఉంటుందనేది కూడా చాలా ముఖ్యం. మొక్కలను సాధారణంగా 8 అంగుళాల కుండీలలో పెంచుతారు. కాస్త పొడవైన మొక్కలు 36-37 అంగుళాల వరకు ఉండే కుండీలను ఉపయోగిస్తారు.
నీటి పారుదల : కుండీలలో పండించే పండ్లు అధిక నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. కుండలలోని రంధ్రాల ద్వారా నీరు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. నీరు కుండీల నుంచి బయటకు వస్తుంటే మొక్కలకు సరైన నీరు అందకపోవచ్చు. మొక్క పెరిగే కొద్ది వేర్లు పెరుగుతుంటాయి.
వేర్ల సంరక్షణ : రంధ్రాలున్న కుండీల వల్ల వేర్లు బయటకు వస్తాయి. ఇలా రాకుండా జాగ్రత్త వహించాలి. వేర్లు బయటకు రాకపోతే లోపలే ఉండి బలంగా, గట్టిగా తయారవుతాయి. ఇలా ఉంటే పండ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కొన్ని మొక్కలకు వేర్లు కత్తిరించాల్సి ఉంటుంది. వేర్లు కత్తిరించేపుడు మొక్క బరువును పరిగణలోకి తీసుకోవాలి. వేర్ల కత్తిరింపు మొక్కల పెరుగుదల సమయంలోనే చేసుకోవాలి. మొక్కను జాగ్రత్తగా బయటకు తీసి వేర్లు కత్తిరించి తిరిగి కుండీలో సర్దుబాటు చేయాలి. ఇలా చేస్తేనే ఇంటి లోపల మొక్కలను పెంచగలం.
ఎరువుల వాడకం : పండించే పండ్ల రకాల మీద వాడే ఎరువులు ఆధారపడి ఉంటాయి. ఎరువులు సిద్ధం చేసేప్పుడు, అవి సరైన నిష్పత్తిలో ఉండాలి. అలాగే మంచి వెంటిలేషన్‌, డ్రైనేజీ వ్యవస్థను కలిగి ఉండాలి. సాధారణంగా ఉపయోగించే పాటింగ్‌ మట్టిలో నిజమైన మట్టి ఉండదు, కానీ కంపోస్ట్‌ చేసిన నేలలా కనిపిస్తుంది. అందువల్ల స్వంత కంపోస్ట్‌ తయారు చేసుకోవడం ఉత్తమం.
ఎప్పుడు, ఎక్కడ : పండ్ల మొక్కలను సూర్యరశ్మి అందుబాటులో ఉన్నపుడు ఆరుబయట, చలికాలంలో ఇంటి లోపల ఉంచాలి. చలికాలంలో పండ్ల మొక్కలను బయట ఉంచాల్సి వస్తే వాటికి అవసరమైన సూర్యరశ్మి అందేలా చూసుకోవాలి. మొక్కలను లోపలకు బయటకు మార్చే సమయంలో ఓర్పుగా జాగ్రత్తగా మార్పు చేయాలి. మొక్కలను ఇంట్లోకి తీసుకురావడానికి ముందు ఆకులపై ఉండే దుమ్ము, ధూళి, ఇతరత్రాలేవీ లేకుండా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి పురుగుమందుతో పిచికారీ చేసుకోవాలి. పండ్ల మొక్కలు లేదా పండ్ల చెట్లకు ఇంటి లోపల ఉన్నపుడు ఎక్కువ నీరు అవసరం లేదు. అయితే పొడిగానూ ఉంచొద్దు.
ఇలాంటి చిన్న పాటి జాగ్రత్తలు పాటించి ఇంట్లోనే మొక్కలు పెంచుకోవచ్చు.

Spread the love