తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక కేజీ టూ పేజీ పేరుతో గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలను విస్తృతపరిచింది.రాష్ట్రంలో మొత్తంగా వివిధ సామాజిక తరగతుల వారిగా ఏర్పాటు చేసిన గురుకులాలు అన్ని కలుపుకుని 1080 వరకు ఉంటాయి. ఇందులో సుమారు ఆరులక్షల మంది విద్యార్థిని, విద్యార్థులు విద్యనభ్య సిస్తున్నారు.20,897 మంది గురువులు బోధన, బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దశాబ్దకాలం తర్వాత కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 7800 మంది నూతన టీచర్స్‌ని నియమించింది. ఇంకా 6,500 వరకు ఉద్యో గాలు ఖాళీగా ఉన్నవి. ప్రస్తుతం ఒక్కో పాఠశాలలో 550 నుండి 600 మంది విద్యార్థులున్నారు. ఇప్పటివరకు తొంభై శాతం పాఠశాలలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. గురుకులాలకు సొంత భవనాల్లేక, అద్దె భవనాల్లో సరైన సౌకర్యాల్లేక విద్యార్థులు, టీచర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలను ఒకే సమూహంగా విశాల మైన స్థలంలో 2500 మంది విద్యార్థులు చదువుకునే వీలుగా నూతన భవనాలు నిర్మిస్తామని శంకుస్థాపనలు కూడా చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మెనూ కూడా ఒకే విధంగా అమలు చేస్తామని చెబుతున్నది. ఇది ఆచరణలో సాధ్యం అవుతుందా? వేచి చూడాల్సిందే.
ఇదంతా నాణేనికి ఒకవైపు, మరోవైపు విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు వర్ణణాతీతం. విద్యార్థులకు నాణ్యమైన విద్య, క్రీడలు, పౌష్టికాహారం అందాలంటే పాలకులకు దీర్ఘకాలిక లక్ష్యం ఉండాలి. అది లేకపోవడంతో ఆ భారమంతా కూడా గురువులు యోయాల్సి వస్తున్నది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని, ట్రైనింగ్ పొందిన టీచర్లతో బోధనేతర (బాధ్యతలు) డిప్యూటీ వార్డెన్, పాఠశాలల్లో ప్లంబింగ్, ఎలక్ట్రికల్, వాటర్ సప్లై, తదితర బోధనేతర పనులు అప్పగించడం, రాత్రిపూట స్టడీ అవర్స్ పేరిట తొమ్మిది గంటల వరకు, (స్టే) పేరుతో పాఠశాలల్లోని నిద్రిం చడం, ఆదివారం,సెలవు, పండగ రోజుల్లో కూడా వారికి అదనంగా విధులు నిర్వహించాలని చెప్పడంతో వారు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారు. కుటుంబానికి సరైన సమయం కేటాయించకపోవం, వారి పిల్లలతో ఏకాంతంగా గడిపే అవకాశం కూడా లేకపోవడంతో ‘ఇదేం కొలువురా బాబో’ అని బాధపడుతున్నారు. ఇది ఒక్క గురువులకే కాదు, విద్యార్థులకు సైతం శిక్షగానే ఉంటోంది. విద్యార్థులకు చదువు చాలా ముఖ్యమైనదే కానీ దాంతో పాటు మానసిక వికాసం పెంపొందించే కార్యక్రమాలు లేకపోవడం వల్ల వారు కూడా భారంగా ఫీలవుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే పాఠశాలల్లో ఉండాలని కఠిన నిబంధనలు పెడుతూ గురువులను, దాంతో పాటు విద్యార్థులను కూడా తీవ్ర ఒత్తిడిలోకి నెట్టివేస్తున్నారు. డిప్యూటీ వార్డెన్ డ్యూటీ ఉన్నప్పుడైతే వారి ఉద్యోగం కత్తి మీద సాము లాంటిదేనని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. వంటవారు సరిగా పనిచేయకున్నా, పాలు పగిలినా, గ్యాస్ సిలిండర్లు అయిపోయినా, పైపులు లీకైనా, కూరగాయలు అపరిశుభ్రంగా ఉన్నా, నిత్యావసర వస్తువులు నాణ్యత లేకున్నా, టీచర్లే బాధ్యత వహించాల్సి వస్తున్నది. ఇతరులు చేసిన తప్పిదాల మూలంగా వంటలో చిన్న పొరపాటు జరిగినా, వాటర్ కలుషితంగా వచ్చినా సంబంధం లేని బోధన సిబ్బంది పైనే వేటు వేస్తూ, సస్పెండ్ కూడా చేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వార్డెన్ డ్యూటీ దినదిన గండంలా ఉంటుందని, రోజువారి స్టాకు రాయడం, తమకు సంబంధం లేని పనులతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టడీ అవర్ పేరిట రాత్రి తొమ్మిది గంటల వరకు స్కూల్లోనే డ్యూటీ చేస్తే ఇంటికి వెళ్లడానికి బస్సులు దొరక్క, రాత్రిపూట ఒంటరి ప్రయాణాలు చేయలేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు.
మహిళా టీచర్ల పరిస్థితి మరింత దారుణం. రాత్రి తొమ్మిది గంటలకు ఒంటరి ప్రయాణాలు చేయడం, ఇంట్లో, బయట వేధింపులకు గురవుతూ, నెలసరి సమయంలో కూడా సెలవుల్లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. బోధన సిబ్బందికి బోధనేతర పనులు అప్పజెప్పడం ఏంటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కఠినమైన నిబంధనల మూలంగా కొంతమంది మానసిక ఒత్తిడికి గురై గురుకుల ఉద్యోగానికి స్వస్తి పలుకుతున్నారు. ఇతర పాఠశాలల మాదిరిగానే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సమయం మార్చాలని చాలారోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే పర్మినెంట్ వార్డెన్లను, కేర్ టేకర్లను నియమించాలని, శిక్షణ పొంది బోధించే టీచర్లకు బోధనేతర బాధ్యతలు అప్పగించవద్దని , కేరళ తరహాలో మహిళలకు పీరియడ్ సెలవులు మంజూరు చేయాలని, ఉపాధ్యాయులు, సంఘాలు ఏండ్లకొద్దీ వేడుకుం టున్నప్పటికీ వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయం. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిం చాలంటే టీచర్లపై ఒత్తిడి పెంచడం కాదు పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి పర్మినెంట్‌గా పాఠశా లలకు, కళాశాలలకు కేటాయించాలి. భోజన సిబ్బందితో పాటు బోధనేతర సిబ్బందిని కూడా నియమించడం ద్వారా గురువులపై ఒత్తిడి తగ్గించాలి. అలా చేస్తే విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను బోధించే అవకాశం ఉంటుంది.ఆ దిశగా సర్కార్ చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గురువులు కోరుతున్నారు.
– గుడికందుల సత్యం, 9849232515