”నన్ను చంపేశావా? నిజంగానే చచ్చిపోయానా? ఇంక కదలడం, మెదలడం, నవలడం ఏమీ లేదా? గోడకు తల గుద్దుకుని, గొంతును నొక్కిపట్టిన పిల్లో ఆఖరుశ్వాసను కూడా మింగేస్తే” అన్నదామె.
”నేను నిన్ను చంపడమేమిటి? నువ్వే బతకలేక చచ్చావు. ఇలా చేత్తో విదిలించానో లేదో గోడకు తల బాదుకున్నావు. చచ్చావో బతికావో చూద్దామని ఎంత సేపు ఊపిరి పీల్చుకుంటావో చూద్దామని జస్ట్ మెత్తతో సుతిమెత్తగా వొత్తాను అంతే” అన్నాడతను.
”అన్నీ అబద్దాలే! నువ్వే నన్ను గోడకేసి బాదావు. చచ్చేదాకా కనుగుడ్లు బయటకు వచ్చేదాకా పిల్లోతో గొంతునొక్కావు. నువ్వో గుండెల్తీసిన బంటువి. నువ్వోహంతకుడివి” అని అరిచిందామె.
”అరవకు. అస్తమానం అరిచి గీపెట్టి, నరాలు మెలిపెట్టి, నా నెత్తుర్ను మరిగించి ఇంత దూరం తెచ్చుకున్నావు. ఇంత ఘోరం జరిపించుకున్నావు. చచ్చావు. ఇంకా ఎందుకు అరుస్తావు. నువ్వు ఇప్పుడో కదలలేని కట్టెపేడువి. మోటారులేని యంత్రానివి. చచ్చిన శవానివి” అని అరిచాడతను.
”నేను శవాన్ని అయితే, నన్ను శవంగా మల్చిన వాడివి, దుర్మార్గుడివి, హంతకుడివి నువ్వే కదా!” అన్నదామె జీరబోయిన గొంతుకతో.
”దుర్మార్గుడినీ, హంతకుడినీ కాదు, నేను నీ మొగుడ్ని. మొగాడ్ని. నిన్నేమైనా చేయగల మొనగాడ్ని” అన్నాడు అతను క్రౌర్యం ధ్వనించే గొంతుకతో.
శవంగా మారిన ఆడమనిషి కాసేపు మౌనంగా వుండిపోయింది. కదలకుండా మొద్దులా వుండిపోయింది. ఆ తర్వాత నలుపెక్కి బండబారిన పెదాలు విప్పింది.
”మొగుడ్ని మొగాడ్ని అన్న అహంకారంతో పశుబలంతో ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నావు. ఈ పాపం నిన్ను వదిలిపెట్టదు. నీకు ఇంతకు ఇంతా జరగకపోదు. ఈ లోకంలో నీలాంటి మగ మృగాలకు బలైపోయిన భార్యల, ఆడకూతుర్ల ఉసురు ముట్టకపోదు” అందామె శోకిస్తూ.
”మీ శాపాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు. యుగయుగాలనుంచీ మేం జయిస్తూనే వున్నాం. ఆడవాళ్ల ముఖాల మీద యాసిడ్లు పోసి, వాళ్లను ఫ్యాన్లకు వేలాడదీసి, ఇదుగో నాలాగ ఇప్పుడు గది గోడలకేసి బాది, దూది దిండుతో ప్రాణాల్ని తీసి మా పెత్తనం తగ్గకుండా చూసుకుంటున్నాం. మీరు తలపైకెత్తి చూడకుండా నిరోధిస్తున్నాం. మీ శాపాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు. మీ కన్నీళ్లు ఇంకిపోతయి, ఆవిరైపోతయి తప్ప కాలువలై, నదులై, సముద్రాలై మమ్మల్ని చుంచేస్తయనుకోకు” అంటూ పగలబడి నవ్వాడతను.
గది గోడలను ఆ నవ్వులు ఢకొీట్టినవి. ఆమె ఛీ కొట్టింది. ”ఇంత పాపం చేసి కూడా గొప్ప చెప్పుకుంటున్నావు. నువ్వూ నాలా ఏడ్చేరోజు వస్తుంది. భోరున ఏడుస్తావు. ముందా వెకిలినవ్వు ఆపు” అందామె.
”నేను ఏడవటమా? ఎందుకు ఏడుస్తాను. సక్సెస్‌ఫుల్‌గా నన్ను ఎలిమినేట్ చేశాను. ఈ లోకంలో లేకుండా చేశాను. నేను ఏం చేసినా మాటల్తో, చేతల్తో ఎంత హింసించినా సరిపోక ఏమీ చెయ్యలేని ఈ నిస్పహాయ స్థితిలోకి నెట్టాను. నేనే గెలిచాను. అయాం ద విన్నర్, యూ ఆర్ ద లూజర్” అన్నాడు పొగరుగా తల ఎగరేస్తూ.
”నీ గెలుపు, ఈ నవ్వు ఎంతోకాలం కంటిన్యూ కాలేవు. నువ్వు గెలుపు అనుకుంటున్నది నీకు ఉరి తాడవుతుంది. నీ ఈ నవ్వు నీ ముఖంలో చావు కళ అవుతుంది. తప్పించుకుందామనుకుంటున్నావా? నిండు ప్రాణాలు తీసి, హాయిగా కులుకుదామనుకున్నావా? నా చావు నీ బ్రతుకు భవిష్యత్తుకు పునాది అవుతుందనుకోకు. నీ బ్రతుకు బండలే అవుతుందిక. జైల్లో ఊచలు లెక్కపెట్టడానికి రడీగా వుండిక” అందామె ఉక్రోషంగా.
”అబ్బఛా! అంతేనంటావా? అరేరే భయం వేస్తున్నది. వణుకు పుడుతున్నది. ఉర్కో! నన్ను ఎవరూ అవమానించరు. నాకేమీ కాదు. నా సేఫ్టీ నేను చూసుకోగలను” అన్నాడతను ధీమాగా.
”అదీ చూద్దాం. ఎలా తప్పించుకుంటావు. న్యాయం, చట్టం, పోలీసులు ఎవరూ లేరా? ఎవరూ రారా?” అందామె వణికే స్వరంతో.
”న్యాయం, చట్టం, పోలీసులు ఎవ్వరూ ఏమీ చేయకుండా చూసుకుంటాగా” అన్నాడతను కాన్ఫిడెంట్‌గా.
చుట్టూ ఇళ్లు, ఇంట్లో, హాల్లో నా శవంతో నేను. తలుపు తీయి తెలుస్తుంది. కదలలేని కట్టెపేడు అనుకుంటున్న ఈ శవమే నీ అంతు చూస్తుంది. బతికున్న మనిషిని శవాన్ని చేశావు. శవాన్ని ఏం చేస్వావోరు” అందామె.
”శవానివి నువ్వు నన్ను ఏమీ చేయలేవుగానీ, బతికున్న మగమహారాజుని. నిన్ను ఏమైనా చేయగలను” అన్నాడతను.
”ఏం చేస్తావు. ట్రంకుపెట్టెలో పెట్టి దాటిస్తావా? కారు డిక్కీలో తీసుకెళ్లి నదిలో తోసేస్తావా? లేక ఇక్కడే మంట పెట్టి నన్ను తగలేస్తావా? తగలేసినా నా అవశేషాలు నిన్ను ఉరికంబం ఎక్కిస్తాయిలే” అందామె.
నువ్వు చెప్పినవన్నీ పాత పద్ధతులు. అవన్నీ అవుట్ డేటెడ్. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. నిన్నిప్పుడు మూడు ముక్కలుగా కోస్తాను. ముక్కల్ని మళ్లీ ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టి కుక్కర్‌లో ఉడికించి, ఎముకల్ని మిక్సీలో పొడి పొడి చేసి, నువ్వనే దానివి వుండేదానివన్న ఊసే లేకుండా చేసి చట్టాన్ని పరిహసిస్తాను. పోలీసుల్ని వెక్కిరిస్తాను” అంటూ కత్తులు, కటార్లు, రంపమూ వగైరాలున్న బ్యాగ్ ఓపెన్ చేశాడు.
శవంగా మారిన ఆమె భయపడ్డది. తన ఆనవాళ్లనేవేమీ మిగలకపోయినా ఎక్కడో ఏదో శక్తి తనకు అండగా నిలుస్తుందని, ఆ పాపాత్ముడ్ని చట్టానికి అప్పగిస్తుందని నమ్మి ముక్కలవడానికి సిద్ధపడ్డది ఆమె అతని భార్య.
శవం రంపపు కోతను చూడకూడదని తెర్చుకుని వున్న ఆమె కళ్లని మూసేశాడు అతను ఆమె భర్త.
– చింతపట్ల సుదర్శన్
9299809212