ఎందెందు వెదకిన…

ఎందెందు వెదకిన...ఈ లోకంలో బంధాలు, అనుబంధాలు అనేవి ఒక్క కుటుంబ సభ్యుల మధ్యమాత్రమే వుంటాయనుకోవడం నూటికి నూరుశాతం కరెక్టుకాదు. ఈ బంధాలు, అనుబంధాలు వివిధ రకాల మనుషుల మధ్య, వివిధ కారణాల వల్ల ఏర్పడే అవకాశం వుందనడం వందకు వందశాతం కరెక్టుకాకుండా పోదు.
ఆఫీసుల్లో బాస్‌కీ ఉద్యోగులకీ, ఆసుపత్రుల్లో డాక్టర్లకీ రోగులకీ, రాజకీయాల్లో నాయకులకీ ఓటర్లకీ, సినిమాల్లో హీరోలకీ విలన్లకీ… ఇలా చెప్పుకుంటూ పోతే అనేకులకు అనేక రకాలుగా బంధాలు, అనుబంధాలు వుండవచ్చు లేదా ఏర్పడవచ్చు. ఈ అనేకరకాల భవబంధాలలో పోలీసులకీ, దొంగలకీ వున్న సంబంధ బాంధ్యవ్యాలు కూడా చెప్పుకోదగినవే.
దొంగలను తరుముతూ పోలీసులు, పోలీసుల్ని తప్పించుకుంటూ దొంగలు పరుగుపెట్టడం అనే ఆట మనుషులంతా చిన్నప్పుడు ఆడుకునే దొంగ-పోలీసు ఆటే కదా. నెత్తిన టోపీ చేతిలో లాఠీతో పోలీసయితే, బుగ్గమీద పులిపిరీ కన్నుకింద గాటూ దొంగ అవుతాడు కద. దొంగలనే వాళ్లు లేకపోతే పోలీసులనే వాళ్లు వుండరు మరి. అందువల్ల పోలీసులూ దొంగలూ వుండితీరాల్సిందే. కాకపోతే దొంగలు లేకపోతే పోలీసులకు పని వుండదు. పోలీసుల్లేకపోతే దొంగలకు చేతినిండా పనే.
అదో పోలీస్టేషన్‌. ఊరికి దూరంగా వుంది. అడవికి దగ్గరగా వుంది. జనం అట్టే తిరగని చోటు బావురుమనే రోడ్డు ఓటి వుంది. పోలీసుస్టేషన్లో పోలీసులున్నారు ఓ అరడజనుమంది. పోలీసులన్నాక వారికి బాగా కావల్సినవాళ్లు కూడా వుండాలి కదా. లాకప్‌ రూంలోనూ ఓ అరడజనుమంది దొంగలున్నారు. దొంగల్లో ఇద్దరు లెక్కపెట్టిన ఊచల్నే మళ్లీ మళ్లీ లెక్కపెడ్తున్నారు. నలుగురు మాత్రం గోడకు ఆనుకుని కూచుని అత్తారింటి నుంచి బయటపడ్డాక ఎక్కడ దొంగతనం చేద్దామా అని చర్చించుకుంటున్నారు. పోలీసుల్లో ఒకడు ద్వారపాలకుడి పని చేస్తుంటే ఇద్దరు గుర్రుకొడుతూ నిద్రపోతున్నారు. ఒకడు ఫైళ్లు దులుపుతుంటే ఇద్దరు చెస్సు ఆడుకుంటున్నారు.
‘అసలీ స్టేషన్‌లో పనిచేయడం అంత బుద్దితక్కువ పనేం లేదు. ఆదాయం అస్సలు లేదు. దొరికిన ఈ దొంగనాయాళ్ల దగ్గర చిల్లుపడ్డ జేబులు తప్ప మరేం లేదు’ అన్నాడొక పోలీసు టోపీ తీసి తలమీది గ్రౌండు మీద వేళ్లతో వాకింగ్‌ చేస్తూ. ‘ఎంత తన్నినా దొంగతనం ఒప్పుకోరు. దొంగసొమ్ము ఎక్కడ వున్నదీ ఒక్కడూ చెప్పడు. లాఠీలు విరిగాయి. భుజాలకు నెప్పులు వచ్చేయి అంతే’ అన్నాడు మరొక పోలీసు తలమీది అరణ్యంలో వేళ్లతో కూంబింగ్‌ చేస్తూ. వచ్చేవాడూ లేదు, పోయేవాడూ లేడు. రోడ్డంతా ఖాళీగా వుంది. పైన వేడి ఆకాశం బోర్లించిన మూకుడులా వుంది. ‘ఎన్ని ఫైళ్లు ఎన్నిసార్లు దులిపినా గడియారంలో ముల్లు పరుగెత్తడం లేదు. బోరుకొడుతూ ఉంది’ అన్నాడు నిద్దర రాక, చెస్సు ఆడటం రాక ఫైళ్లు దులుపుతున్నవాడు.
‘ఎంతసేపు ఊచలు లెక్కపెడతాం. మాకూ బోరు కొడుతూ వున్నది. రోజంతా ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు’ అన్నాడో దొంగ. ‘వదిలేస్తాంరా పారిపొండి. మీ వెనకాల పరుగెత్తి మళ్లీ పట్టుకొచ్చి కొట్లో వేస్తాం. అప్పుడు మీకూ మాకూ టైం పాస్‌ అవుతుంది’ అన్నాడో పోలీసు నిద్ర మెలుకువ వచ్చి కళ్లు నులుముకుంటూ. ‘చిన్నప్పుడు ఆడుకున్న దొంగ – పోలీసు ఆట మళ్లీ ఆడుకుందాం అంటావు’ అన్నాడింకో పోలీసు నిద్ర చాలించి ఆవలించిన నోట్లో చిటికె వేస్తూ.
ఆరుగురు దొంగలూ ఊచల దగ్గరికి వచ్చి నిలబడ్డారు. వాళ్లల్లో ఒకడు ‘ఈ ఎండలో మేం పరుగెత్తడం మీరు ఆయాసపడ్డం ఎందుకులే అన్నా! టైం పాస్‌కు ఇక్కడే మన రెండు టీములూ ఆడుకుంటే సరి’ అన్నాడు. ‘ఇక్కడేనా? పోలీసుల టీమూ, దొంగలటీమూ ఆడుకునే ఆటా? ఏంటో అది చెప్పు’ అన్నాడో పోలీసు. ‘చెప్పాక ఏమీ అనవద్దన్నా’ అన్నాడు దొంగ. ‘ఏమీ అనుకోం చెప్పు చెప్పు’ అన్నాడో పోలీసు కుతూహలంగా. ‘ఏం లేదన్నా మీకూ మాకూ బంధమో, అనుబంధమో లేకుండా వుండదు కదా. మేం ఎప్పుడూ దొంగలమై మీరు ఎప్పుడూ పోలీసులైతే ఏం మజా వుంటుంది. కాసేపు మీరు దొంగలుగా లాకప్‌లో వుండి చూడండన్నా. అలాగే కాసేపు మేం పోలీసులమవుతాం. ఆటకు ఆటా అవుతుంది. ఒకరి కష్టాలు ఒకరికి తెలిసివస్తయి’ అన్నాడో దొంగ.
ఈ ప్రపోజల్‌ ఒక్కడికి తప్ప అందరికీ అస్సలు నచ్చలేదు. ఒక్కడు మాత్రం ‘బాగుందన్నలూ! ఆటే కదా! ఆడితే పోలా!’ అనేశాడు. అరడజను పోలీసులూ గుసగుసలాడుకున్నారు. చివరికి ‘సరే! దొంగనాయాళ్లారా, మీ కోరిక తీరుస్తాం కానీ మీలా మాకు గడ్డాలూ, పులిపిర్లూ, గాట్లూ అవీ లేవుకదా. అవి వున్న మీరూ పోలీసు డ్రస్సులు వేసుకున్నా దొంగల్లాగానే కనపడ్తారు కదా!’ అన్నాడో పోలీసు. ‘అదా నీ డౌటు. మేం దొంగల్లా కనపడ్డానికి అవన్నీ పెట్టుకుంటాం. ఇవన్నీ పెట్టుడు గడ్డాలే, పెట్టుడు పులిపిర్లే, గాట్లే. అన్నీ పీకి మీ చేతుల్లో పెడతాం. అవి పెట్టుకుంటే మీరంతా మాలాగే దొంగలైపోతారు. తీసేస్తే మేమంతా మీలాగే పోలీసులైపోతాం’ అన్నాడో దొంగ.
రెండు టీములూ ఆట మొదలుపెట్టెయి. పోలీసులంతా దొంగలై లాకప్పులో ఊచలు లెక్కపెట్టసాగారు. దొంగలు ఇచ్చిన గడ్డాలు, పులిపిర్లు, గాట్లూ పెట్టుకుని అచ్చంగా దొంగనాకొడుకులైపోయేరు. అన్నీ పీకేసుకున్న దొంగలు సబ్బుతో ముఖాలు కడుక్కుని, పాండ్స్‌ పౌడరు పూసుకుని లుంగీలు, పైజమాలు పోలీసులకు ఇచ్చి ఖాకీ డ్రస్సులు వేసుకున్నారు. ఈ ఆటకు వాళ్లు ఓ గంట టైం ఫిక్స్‌ చేసుకున్నారు. ఇంకో పదినిమిషాల్లో ఆట అయిపోయి ఎవరి జాగాలోకి వాళ్లు చేరుకుంటారన్నమాట. ఇక్కడే కథ అనుకోకుండా మలుపుతిరిగింది.
జీపు చప్పుడయింది. పెద్ద పోలీసాఫీసరు స్టేషన్‌లోకి జొరబడ్డాడు. ఏకకాలంలో బయటున్న దొంగ పోలీసులు, లోపలున్న పోలీసు దొంగలు సెల్యూట్‌ చేశారు. ఆఫీసరుకు అర్ధం కాక నోరు తెరిచాడు. ‘లాకప్‌లో వున్న మేం పోలీసులం సార్‌! బైట మా డ్రస్సుల్లో వున్న వాళ్లంతా దొంగలు సార్‌’ అని అరిచాడో దొంగ అయిన పోలీసు. ‘ఆళ్ల గడ్డాలు, పులిపిర్లూ, గాట్లూ చూడండి సార్‌. ఆళ్లే దొంగలు’ అన్నాడో పోలీసు అయిన దొంగ.
ఎవరు పోలీసులో, ఎవరు దొంగలో అర్ధంకాలేదు ఆఫీసరుకి. దొంగలు పోలీసుల్లా, పోలీసులు దొంగల్లా కనపడ్తున్నారు. దొంగలు పోలీసులు కాలేక పోవచ్చు కానీ పోలీసులు దొంగలు అవలేరని అనుకోవడం నూటికి నూరు శాతం కరెక్టు కాదు. వేరు వేరు వృత్తుల్లో పనుల్లో వున్నవారిలో కూడా దొంగలు వున్నారని అనుకోవడం వందకు వందశాతం కరెక్టు కాకుండా పోదు.

– చింతపట్ల సుదర్శన్‌
9299809212

Spread the love