స్విమ్మింగ్‌ ఛాంపియన్‌గా మారింది

Became a swimming championగీతా కన్నన్‌… పోలియోతో బాధపడుతున్న ఈ చెన్నై మహిళ ఒకప్పుడు కదలలేని స్థితిలో మంచానికే మరిమితమయ్యింది. ఇప్పుడు స్విమ్మింగ్‌ ఛాంపియన్‌గా మారింది. పోలియో ఉందని తెలిసిన తర్వాత జీవితంలో సుదీర్ఘమైన, కష్టమైన ప్రయాణం చేసింది. అయినప్పటికీ పారా స్విమ్మర్‌ ఆమెకు స్వేచ్ఛనిచ్చింది. తన శరీరంపై తిరిగి నియంత్రణ పొందేందుకు నీరు, స్విమ్మింగ్‌ పూల్‌ను ఎంచుకున్న ఆమె విజయ ప్రస్థానం నేటి మానవిలో…
‘దూకడం, పరుగెత్తడం, ఆడడం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ నా చిన్నతనాన్ని గడిపాను. కొన్నేండ్ల తర్వాత ఈ కోరిక కూడా నీటితో నా బంధాన్ని బలపరిచింది. కోల్పోయిన నా చిన్ననాటి క్షణాలను తిరిగి పొందుతున్నాను’
గీతా కన్నన్‌కు చిన్నతనంలో పోలియో సోకింది. అలాగే నీటిని చూసినా ఆమెకెంతో భయం. మెడ కింది భాగం నుంచి శరీరాన్ని కదపలేని ఆమె చిన్నతనమంతా భయం భయంగా గడిపింది. నీరు, మునిగిపోవడంలో ఆమెకున్న ఓ చేదు జ్ఞాపకం కారణంగా ఆమె మరింత భయపడేది. ‘నేను స్నానం చేయడానికి కూడా భయపడేదాన్ని. అక్కడ నేను చిక్కుకుపోయాను, నా ఊపిరితిత్తులలో నీరు ప్రవేశిస్తుందని నేను భావించాను’ అని గీతా చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, ఆమె శరీరం, దాని కదలికలపై నియంత్రణను తిరిగి పొందేందుకు చేసిన వైద్య ప్రయత్నాల ఫలితంగా ఆమె నీటితో కూడా సంబంధాన్ని అభివృద్ధి చేసుకుంది.
భయపడుతుండేది
రెండేండ్ల వయసులో గీతకు ఓ రకమైన పోలియో ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీని వల్ల ఆమె దాదాపుగా కదలలేని స్థితికి చేరింది. ప్రాథమిక పనుల కోసం కుటుంబ మద్దతు అవసరం. ఆమె కుటుంబం భారతదేశంలోని వివిధ నగరాల్లో నివసించింది. అతని తండ్రి భారత సాయుధ దళాలలో ఉన్నారు. తల్లి కూతురు కోసం వారు వెళ్లిన ప్రతిచోటా చికిత్స కోసం ప్రయత్నించేది. ఈ ప్రయత్నాలతో ఆమె తన కాళ్ళను మినహాయించి తన శరీరంలోని ప్రతి భాగాన్ని కదిలించగలదు. దాంతో మంచం నుండి వీల్‌చైర్‌కి మారింది. తన పాఠశాలలోని ప్రతి విద్యార్థి పీటీ క్లాస్‌ కోసం ఎదురుచూస్తుంటే గీత మాత్రం చాలా భయపడుతుండేది.
కన్నీటిని మిగిల్చింది
‘ఇక నేను ఎప్పుడూ ఆటలు ఆడలేనని తెలుసు. అందుకే నా శక్తిని చదువులో పెట్టాను. పబ్లిక్‌ పరీక్షల సమయంలో పాఠశాలలో చేరాను’ అని ఆమె అన్నారు. పోలియో గీత ఎడమ కాలును, కుడి కాలుకంటే కొన్ని మిల్లీమీటర్లు తక్కువ చేసింది. తన వయోజన జీవితమంతా రెండు కాళ్లపై కాలిపర్స్‌ సహాయంతో నడిచింది. అంతేకాదు ఆమెకు గూని కూడా వచ్చింది. వైద్యం వల్ల వెన్నెముక వంకర తిరిగింది. ఈ సంఘటనతో ఆమె జీవితానికి ముంగిపు పలుకుతుందని అందరూ భావించి ఉంటారు. అయితే 2016లో గీత కారు ప్రమాదంలో చిక్కుకుంది. అది ఆమె ఎడమ రోటేటర్‌లో కన్నీటిని మిగిల్చింది. నాలుగు కండరాలు, స్నాయువుల సమూహం భుజం కీలుకు ఇబ్బంది వచ్చింది. ఆమె ఎడమ చేయి పని చేయకపోవటంతో కుడి చేతిని ఎక్కువగా ఉపయోగించేది. అందువల్ల ఎముకల్లో క్షీణతకు దారితీసింది. ఆ ఏడాది మొత్తం (2016-2017) మంచానికే అతుక్కుపోయింది. నొప్పులను భరించలేక ఆపరేషన్‌ కూడా చేయించుకోలేదు. ఆ సమయంలో స్నేహితుడు, సెరిబ్రల్‌ పాల్సీ ఉన్న సతీష్‌ కుమార్‌ ఆమెను చెన్నైలోని వికలాంగులతో పనిచేసే 39 ఏండ్ల విద్యా సాగర్‌ అనే సంస్థలో టీమ్‌కి పరిచయం చేశాడు.
జీవిత గమనాన్ని మార్చింది
విద్యా సాగర్‌ సంస్థలో గీతా పారా స్విమ్మర్‌ మాధవి లతను కలుసుకున్నారు. ఆమె హైడ్రోథెరపీని ప్రయత్నించమని ప్రోత్సహించింది. ఇది ఆమె జీవిత గమనాన్ని మార్చింది. ‘భూమిపై నేను ఎన్నడూ చేయని పనులను సాధనతో చేయగలనని నమ్మాను. నాలుగేండ్లు నేను పడిన బాధంతా కేవలం 15 రోజుల్లో మాయమైంది’ అంటూ ఆమె గుర్తుచేసుకున్నారు. చాలా ఏండ్ల తర్వాత ఆమె తన జీవితంలో మొదటిసారి ఈత ద్వారా ఆట స్ఫూర్తిని అనుభవించారు. ‘దూకడం, పరుగెత్తడం, ఆడడం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ నా చిన్నతనాన్ని గడిపాను. కొన్నేండ్ల తర్వాత ఈ కోరిక కూడా నీటితో నా బంధాన్ని బలపరిచింది. కోల్పోయిన నా చిన్ననాటి క్షణాలను తిరిగి పొందుతున్నాను’ గీత జతచేస్తున్నారు. వెంటనే ఆమె స్విమ్మింగ్‌ కోచ్‌ డి.పురుషోత్తమన్‌ను కలుసుకుంది. ‘అనేక విఫల ప్రయత్నాల తర్వాత కోచ్‌ నన్ను ఫ్రీస్టైల్‌ స్విమ్మింగ్‌తో ప్రారంభించమని సూచించారు. రెండు నెలల్లో 25 మీటర్లు దాటగలిగాను’ అంటూ ఆమె గర్వంగా చెప్పారు.
వంద మీటర్లు ఈదుతుంది
చెన్నై నెహ్రూ స్టేడియంలోని స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ తమిళనాడు పూల్‌లో ఆమె పురోగతిని చూసిన ఇతర స్విమ్మర్లు పోటీతత్వంతో ఈత కొట్టాలని ఆమెను కోరారు. నేడు గీత ప్రతి టోర్నమెంట్‌ కోసం రోజుకు 100 మీటర్లు ఈదుతుంది. ఆమె రోజు ఉదయం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు విదేశీ విద్యార్థులకు అకౌంటింగ్‌ టీచర్‌గా పని చేస్తున్నారు. తర్వాత భోజనం తిని మధ్యాహ్నం 2.30 గంటలకు తన స్విమ్మింగ్‌ ప్రాక్టీస్‌ కోసం బయలుదేరి సాయంత్రం వరకు పూల్‌ వద్దనే ఉంటారు. రాత్రి 9.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి రాత్రి భోజనం ముగించి మళ్లీ పనిలో కూర్చుంటారు.
వికలాంగులకు సౌకర్యంగా…
ఇద్దరు మగ పిల్లలకు తల్లి అయిన గీత దక్షిణ చెన్నై శివారులోని తాంబరంలోని తన ఇంటి నుండి ఉత్తరాన పెరియమేడు వరకు ప్రతిరోజూ 34 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో రాంప్‌, కుర్చీ లిఫ్ట్‌తో కూడిన ఏకైక పూల్‌ ఉంది. కుర్చీ లిఫ్ట్‌ గీత నీటిలోకి వెళ్ళడానికి, బయటికి రావడానికి సహాయం చేస్తుంది. ‘చాలా మంది యువ వికలాంగుల్లో క్రీడలలో చేరడా నికి, ముఖ్యంగా స్విమ్మింగ్‌లో పాల్గొనడానికి ప్రతిభ, ధైర్యసాహసాలు ఉన్నాయి. నా భర్త నన్ను నడిపిస్తున్నాడు. అయితే చాలా మందికి నాలాగా కారు లేదు. దానివల్ల ప్రయాణం చాలా ఇబ్బందికరం గా, ఖర్చుతో కూడి ఉంటుంది. నగరం చుట్టూ మరిన్ని క్రీడలు, స్విమ్మింగ్‌ క్లబ్‌లు ఏర్పాటు చేస్తే వికలాంగులకు సౌకర్యంగా ఉంటుంది. క్రీడలు మా స్వేచ్ఛకు మాత్రమే కాకుండా, సురక్షితమైన భవిష్యత్తుకు కీలకం’ అంటూ గీత తన మాటలు ముగించారు.
స్వర్ణం సాధించారు
ప్రస్తుతం 43 ఏండ్ల వయసులో గీతా పారాలింపిక్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌. ఈ ఏడాది మార్చిలో జరిగిన తమిళనాడు రాష్ట్ర స్థాయి పారాలింపిక్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించారు. ‘ఒక విషయాన్ని గ్రహించాను. నేను నా సొంతంగా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లగలిగే ఏకైక ఉపరితలం నీరు. ఇది నా జీవితంలో ఎన్నడూ అనుభవించని స్వేచ్ఛను నాకు ఇచ్చింది’ అని గీత చెబుతున్నారు. నీటితో స్వాతంత్య్రాన్ని రుచి చూసిన తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ఫ్రీస్టైల్‌, ఫ్రంట్‌, బ్యాక్‌స్ట్రోక్‌ టెక్నిక్‌లలో ప్రావీణ్యం సంపాదించారు. ఇప్పుడు గీత రోజులు ప్రణాళిక చేయబడ్డాయి. ఆమె ప్రతిరోజూ 14 గంటలు ఎంతో చురుగ్గా స్విమ్మింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

Spread the love