కోడూరు బడి – కొలువుల గడి

కోడూరు బడి - కొలువుల గడిరామాపురం ప్రభుత్వ పాఠశాలలో, రాజు ఏడవ తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఉన్నత తరగతులు పొరుగూరు కోడూరు పెద్ద బడిలో చదవాలని రాజు కోరిక. అక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బాగా చెబుతారని, ఆ బడిలో చదివిన వారు చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు అయ్యారని రామాపురం ఉపాధ్యాయులు చెప్పగా విన్నాడు. కోడూరు బడిలో చదువుకోవాలనే కోరిక రాజు మనసులో చిన్ననాటి నుండే బలంగా నాటుకుపోయింది.
రాజు తండ్రి గోపయ్య మధ్యతరగతి రైతు. పొలంలో విత్తనాలు నాటే సమయం. రాజును బడిలో చేర్పించి, త్వరగా వచ్చి పొలం పనులు చూసుకోవచ్చని గోపయ్య కోడూరు బడికి వచ్చాడు. బడిలో చేరడానికి వివిధ గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులు నలభై మందికి పైగానే ఉన్నారు. అందరూ ప్రధానోపాధ్యాయుల గదికి వెళ్లి అడిగారు.
”ఇక్కడ సీట్లు లేవు. మీరందరు వేరే బడికి వెళ్ళండి” అన్నారు (ప్రధానోపాధ్యాయులు) పెద్దసారు.
రాజు ఖంగు తిన్నాడు. చాలా మంది తల్లిదండ్రులు పెద్దసారును బతిమాలారు. కొంతమంది సర్పంచ్‌లను తీసుకునివచ్చి ఒత్తిడి తెస్తున్నారు. పెద్దసారు ఒప్పుకోలేదు.
”ఇప్పటికే రెండు సెక్షన్‌లు నిండిపోయాయి. గోపాలపురం బడిలో చేర్పించండి” అని చెప్పి తరగతి గదిలోనికి వెళ్ళిపోయారు పెద్దసారు.
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలతో వెనుతిరిగారు. కొంతమంది పెద్దసారును బతిమాలుదామని అక్కడే ఉన్నారు. పెద్దసారును ఎలాగైనా బతిమాలి ఇక్కడే చదవాలి అని రాజు ఆరాటపడుతుంటే, పెద్దసారు ఇక ఎవరిని తీసుకోరు అని గోపయ్య రాజును తీసుకెళ్లి సరాసరి గోపాలపురం బడిలో చేర్పించి పొలానికి వెళ్లిపోయాడు. రాజు ఆశలన్నీ నిరాశలయ్యాయి.
గోపాలపురం బడిలో సార్లు తక్కువ. ఇప్పుడిప్పుడే ఉన్నత పాఠశాలగా మారింది. సరైన సౌకర్యాలు లేవు. విద్యాబోధన అంతంత మాత్రమే. రాజు అయిష్టంగానే మూడు సంవత్సరాలు చదివాడు. పదో తరగతి ఉత్తీర్ణులైన అతి కొద్దిమందిలో రాజు ఒకడు. అదొక్కటే రాజుకు కొంత ఉపశమనం కలిగించిన విషయం.
నాణ్యతలేని విద్య కారణంగా రాజు కాలేజీ చదువు అస్తవ్యస్తమైనది. అత్తెసరు మార్కులతో ఇంటర్‌ గట్టెక్కాడు. ఎటువంటి లక్ష్యం లేకుండా ఏదో ఒకటి చదివే స్థాయికి చేరింది రాజు చదువు.
ఇప్పుడు రామాపురం బడిలో రాజు తమ్ముడు శివ ఏడవ తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు. శివ భవిష్యత్తు తనలా కాకూడదని రాజు గట్టిగా నిర్ణయించుకున్నాడు. శివను కోడూరు బడికి తీసుకెళ్ళి పెద్దసారుని వినయంగా అడిగాడు రాజు. పెద్దసారు మారారు కాని వారి సమాధానం మాత్రం మారలేదు.
”సీట్లు లేవు, సెక్షన్లు నిండాయి”
రాజు పెద్దసారును ఎంతగానో బతిమాలాడు. ఇక్కడ చదువుకోనందుకు తను ఎంత నష్టపోయాడో వివరించాడు… ”తెలివైన విద్యార్థులకు కోడూరు బడి గొప్ప వరమని”
తమ్ముడు శివను బడిలో చేర్చుకొమ్మని రాజు పెద్దసారుని ప్రాధేయపడినాడు. పెద్దసారు మనసు కరగలేదు. రాజు ప్రతిరోజూ కోడూరు బడికి వెళ్ళి పెద్దసారుని కలుస్తూనే ఉన్నాడు. గోపాలపురం బడిలో మాత్రం శివను చేర్పించలేదు. తన తోటి విద్యార్థులు వేరే వేరే బడుల్లో చేరినా, పాఠాలు మిస్‌ అవుతున్నా శివ బాధపడలేదు. అన్న మీద నమ్మకముతో ఎదురుచూస్తున్నాడు.
బడులు తెరిచి పదిహేను రోజులు దాటింది. రాజు పెద్దసారుని కలుస్తూనే ఉన్నాడు. బడిలో ప్రవేశానికి మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. చివరి ప్రయత్నంగా ఒక రోజు ఉదయం రాజు కొండపల్లిలో ఉన్న పెద్దసారు ఇంటికి వెళ్ళాడు. పెద్దసారు పొలం దగ్గరికెళ్ళి ఇంటికి వచ్చే సమయానికి రాజు సైకిల్‌పై అక్కడికి చేరుకున్నాడు.
ఇంటి గుమ్మము ముందు నిలుచున్న రాజును చూడగానే పెద్ద సారుకు విపరీతమైన కోపం వచ్చింది.
”నా ఇంటికే వస్తావా, నన్ను ఏమనుకుంటున్నావ్‌?” అన్నారు.
పెద్దసారు ఎన్ని మాటలు అన్నా, రాజు ఓర్పుతో అలాగే నిలబడి, వినయంతో ప్రాధేయపడినాడు. రాజు వినయం, సహనం పెద్దసారులో కొంత మార్పు వచ్చింది. ఎంతోమందిని చూసాడు కాని ఒక సీటు కోసం ఇంతలా తపించేవారిని చూడలేదు అనుకున్నాడు. రెండు రోజుల తర్వాత శివ కోడూరు బడిలో చేరాడు.
రాజు నమ్మకం వృధా కాలేదు. శివ కష్టపడి చదివాడు. ఉపాధ్యాయుల మన్నన పొందాడు. పదోతరగతి పరీక్షలో శివ మండలములోనే టాపర్‌గా నిలిచాడు. పెద్దసారు అభినందనలు అందుకున్నాడు. ఒక వైపు ట్యూషన్లు చెబుతూ, మరోవైపు చదువుతూ రాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు.
నిత్యం శ్రమిస్తూ శివ ఉన్నత చదువులు చదివి కేంద్ర ప్రభుత్వ ఇంజనీరుగా స్థిరపడినాడు. తాను కోడూరు బడిలో చదవలేకపోయినా, తన తమ్ముడు చదివి ప్రయోజకుడు కావడం పట్ల రాజు సంతోషానికి అవధులు లేవు.
– దుర్గమ్‌ భైతి, 9959007914

Spread the love