మా ఇంటికి వస్తే ఏం తెస్తవ్‌…

మా ఇంటికి వస్తే ఏం తెస్తవ్‌...కొందరు పిసినాసివాల్లు వుంటరు. వీల్లు ఎప్పుడు మందిది తిందామని ఎదిరిచూస్తరు. ఇతరులకు మాత్రం ఏమీ పెట్టరు. వీల్లు ‘మీదీ మాకే, మాదీ మాకే’ అన్న చందంగా కన్పిస్తరు. వీల్ల పద్ధతి ఎట్లుంటదంటే ‘మా ఇంటికొస్తే ఏం తెస్తవ్‌, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తవ్‌’ అన్న తీరుగ వుంటది. వీల్లు మంది సొమ్ము ఆరగించేందుకే పుట్టిండ్రా అన్పిస్తది. ఇట్టాంటివాల్ల ఇంటికి సుట్టాలు కానీ, స్నేహితులు గానీ పోతె ఇక అంతే సంగతులు. ఎంతసేపు కూర్చున్నా చాయ కూడా పొయ్యరు. మంచినీల్లు కూడా ఇయ్యాల రాలేదు అని అంటరు. ఇలాంటి వాల్లే ఏదైనా ఆటల్లోకి వస్తే ఓడినా తామే గెలిచినట్లు డాంభికాలు ప్రదర్శిస్తరు. గెలిస్తే కూడా మహా ఫోజులు పెడుతరు. వీల్లను ‘కిందపడ్డా నేనే సిపాయి మీద పడ్డా నేనే సిపాయి’ అంటరు. అంటే కొట్లాటలో లేదా మల్ల యుద్ధంలో కిందపడిపోతే ఓడిపోయినట్టు కానీ లేచి నేనే గెలిచిన అని వాదన చేస్తరు. మీద పడుడు అంటేనే గెలిచినట్టు. ఇట్లా అడ్డంగ వాదించేవాల్లు అంతటా కన్పిస్తరు. కొందరు వయసు చూస్తే పెద్ద మనిషి లెక్క కన్పిస్తరు కానీ చిల్లర చిల్లర బుద్దులు కన్పిస్తయి. వయసుకు తగ్గ వ్యక్తిత్వం కన్పించదు. ఇలాంటివాల్లను ‘మనిషేమో పెద్ద మనిషి బుద్దేమో గాడిద బుద్ది’ అంటరు. నిజానికి గాడిదతో అనవసరంగ పోలుస్తరు గానీ మనుషులకన్నా జంతువులే అన్నిట్లో నయం. వాటి పద్ధతిలో అవి జీవిస్తయి. మనిషే పక్కదార్లు పడుతడు. కానీ సామెతలు ఇట్లా పుట్టాయి. మీది మీకే మాది మాకే తరహా మనుషులను ‘ఈసం వేసి మాసం దొబ్బేరకం’ అని కూడా అంటరు. అట్లనే ‘పప్పుల ఉప్పు వేసి పొత్తు కూడే రకం’ అని కూడా అంటరు. పప్పు, నూనె, పొయ్యి మంట, వండుడు అన్ని ఒకరు చేస్తే ఆ పప్పులో చిటికెడు ఉప్పు వేసి ఇది ఇద్దరి పొత్తు పప్పు అని అంటరు. లోకం మీద అందరి సంగతులు అందరికి ఎరుకే. ‘మామ ఒకింటి అల్లుడే, అత్తా ఒక ఇంటి కోడలే’ అన్న సామెత కూడా ఉంది.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love