ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం పీఆర్సీ నివేదికకు ఆదేశం
మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం : ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించినట్టు తెలిపారు. జూన్ 1లోగా ఆరోగ్య భద్రతా కార్డులు అందజేస్తామని హామీనిచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రతి పథకాన్ని ఉద్యోగులు భుజాన వేసుకుని పని చేశారని తెలిపారు. ”ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నాం. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగులకు ప్రతీ నెలా మొదటి తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నాం. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించాం. ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించాం. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశాం. ఉద్యోగుల ఆరోగ్య భద్రతా కార్డుల ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ రెండేండ్లలో ప్రజా ప్రభుత్వంలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. వంద రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ.6 వేల కోట్లు చెల్లిస్తాం. ఈ నిధుల ఖర్చు ప్రాధాన్యతల నిర్ణయం మీదే. పీఆర్సీపై తక్షణమే రిపోర్టు అందించాలని అధికారుల కమిటీని ఆదేశించాం. రిపోర్టు ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటాం. జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులను ఉద్యోగులకు అందిస్తాం. ప్రతీ రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలి. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం… మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది” అని ఆయన భరోసా ఇచ్చారు.
పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాం : డిప్యూటీ సీఎం భట్టి
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను చాలా వరకు పరిష్కరించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల బీఆర్‌ఎస్ హయాంలో రూ.వేల కోట్ల బిల్లులు పేరుకుపోయాయని చెప్పారు. దీనిపై కసరత్తు చేసి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నట్టు తెలిపారు. 100 రోజుల్లో దాదాపు రూ.6 వేల కోట్ల పెన్షన్ బకాయిలను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులపై ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవీయ దక్పథంతో ఆలోచించారని చెప్పారు. వారి సమస్యల పరిష్కారం కోసం సీఎం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిందని గుర్తు చేసుకున్నారు. టీవీవీపీలో 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పీఆర్సీ, హెల్త్ కార్డుల సమస్యలతోపాటు ఉద్యోగ సంఘాల ఇతర డిమాండ్లను పరిష్కరించాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు.
5న నిరసన కార్యక్రమాలు రద్దు
సీఎంతో చర్చల నేపథ్యంలో ఈ నెల 5న నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమంతో పాటు అన్ని రకాల కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు ఉద్యోగ జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, టీజీఈజేఏసీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల డిమాండ్లపై స్పష్టతనిచ్చిన ముఖ్యమంత్రికి వారు ధన్యవాదాలు తెలిపారు. సీఎం హామీపై హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ఉద్యోగ జేఏసీ సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు, కో చైర్మెన్లు చావ రవి, జి.శ్రీనివాస్ రెడ్డి, పి.దామోదర్ రెడ్డి, జి.సదానందం గౌడ్, వి.రవీందర్ రెడ్డి, ముజీబ్ హుస్సేన్, బి.శ్యాం, కటకం రమేశ్, రామకృష్ణ గౌడ్, టి.లింగారెడ్డి, వెంకటేశ్వర్లు, ఎండీ అబ్దుల్లా టీజీఈజేఏసీ సెక్రెటరీ జనరల్ వి. రాజశేఖర్, నాయకులు కె.రామకృష్ణ, ఎస్.రాములు, ఏ.వెంకటేశం, బానాల రామిరెడ్డి, నిర్మల, దర్శన్ గౌడ్, రమేశ్ పాక, తెల్కలపల్లి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య భద్రతా కార్డులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



