అస్సాంలో భారీ వరదలు.. 30 మంది మృతి

నవతెలంగాన – అస్సాం: ఈశాన్య రాష్ట్రం అస్సాంను వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పోటెత్తిన వరద కారణంగా రాష్ట్రం అతలాకుతలమవుతోంది. సుమారు 15 జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షానికి నదులు పొంగి పొర్లుతున్నాయి. పలు నదులు ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తీవ్రమైన వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమైనట్లు చెప్పారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం.. కరీంగంజ్ జిల్లాలో పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ సుమారు 1,52,133 మంది వరదనీటిలో చిక్కుకుపోయారు. వరదలకు 1,378.64 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ప్రస్తుతం 24 రెవెన్యూ సర్కిళ్లలో 470 గ్రామాలు నీట మునిగాయి. మొత్తం 43 సహాయ శిబిరాల్లో 5,114 మంది తలదాచుకుంటున్నారు.

Spread the love