మోటివేటర్ సుదర్శన్ కు సన్మానం..

Tribute to motivator Sudarshan..నవతెలంగాణ – భువనగిరి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉత్తమ మోటివేషనల్  ట్రేనర్ గా అవార్డు పొందిన భువనగిరి కి చెందిన ఎల్ఐసి చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కర్కాల సుదర్శన్ ను యువజన కాంగ్రెస్ ఆద్వర్యంలో ఆదివారం సింగన్న గూడెంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్ మాట్లాడుతూ భువనగిరి ప్రాంతానికి గొప్ప గుర్తింపు తెచ్చిన సుదర్శన్ సేవలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందన్నారు. విద్యార్థులకు, యువతకు నైతిక విలువలపై, జీవిత ఆశయాలపై, జీవితంలో సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కలిగించుటకు కర్కాల సుదర్శన్ కృషి చేయాలని  ఆయన కోరారు. జవహర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్ మాట్లాడుతూ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు ఆద్వర్యంలో సుమారు 50 రోజుల పాటు ఆన్ లైన్, రెండు రోజుల పాటు ఆఫ్ లైన్  నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కర్కాల సుదర్శన్  ఉభయ రాష్ట్రాల ఉత్తమ మోటివేషనల్ ట్రేనర్ గా అవార్డు పొందడం గొప్ప విషయం అని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని  ప్రభుత్వ/ప్రైవేటు పాఠశాలల/కళాశాలల విద్యార్థులకు “టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్” లాంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు కర్కాల సుదర్శన్ అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.  సదస్సుల ఏర్పాటుకు మా వంతు సహాయ సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు రాసాల సాయికుమార్ యాదవ్ ,రమేష్ , సంపత్, నరేష్ , వెంకటేష్, ముకేష్, శ్రీకాంత్, నవీన్, సంతోష్  పాల్గొన్నారు.
Spread the love