హైడ్రాపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

– నిబంధనల మేరకు చర్యలుండాలని ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మూసీ రివర్‌ బెడ్స్‌లో నిర్మాణాల కూల్చివేత, రిజర్వాయర్ల రక్షణకు ఏర్పాటైన హైడ్రా చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. బాధితులకు నోటీసులు ఇచ్చాకే తదుపరి చర్యలు ఉండాలని ఆదేశించింది. సర్వే చేశాక అక్రమణలను గుర్తించాలనీ, ఆ తర్వాత ఆక్రమణదారులకు గడువుతో కూడిన నోటీసులు ఇచ్చాకే కూల్చివేత చర్యలుండాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌ వేసిన పిల్‌ను హైకోర్టు బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. భవనాలను కూల్చివేయకుండా హైడ్రాకు ఆదేశాలు జారీ చేయాలని పాల్‌ వాదించారు. బాధితులకు నోటీసులు జారీ చేయాలనీ, వారు ఇండ్లు ఖాళీ చేయడానికి లేదా కోర్టుల్లో కేసులు వేసేందుకు సమయం ఉండేలా నోటీసులు ఉండాలని కోరారు. పేదలను గుర్తించి పునరావాసం కల్పించాలని కోరారు. మూసీ రివర్‌బెడ్‌లో నిర్మాణాల కూల్చివేతలకు ముందు అధికారులు ఆ ఇండ్లకు మార్కింగ్‌ చేశాక చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామనీ, బాధితులకు పునరావాస చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ ఇచ్చిన హామీని హైకోర్టు రికార్డు చేసింది. పరిహారంపై సంప్రదిపులు చేశాకే అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపడుతున్నామన్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకే కూల్చివేతలు ఉంటాయని హైడ్రా లాయర్‌ చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు ధర్మాసనం, స్టే జారీ చేయాల్సిన పరిస్థితులు లేవంటూ తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైడ్రాను ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాథే, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Spread the love