బీజేపీకే అత్యధిక విరాళాలు

Highest donations to BJP– ఎలక్టోరల్‌బాండ్ల రూపంలో రూ.5,272 కోట్లు (57%)
– కాంగ్రెస్‌కు కేవలం 10 శాతం : ఏడీఆర్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అత్యధిక ఎలక్టోరల్‌ బాండ్లు బీజేపీకే వచ్చాయని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) స్పష్టం చేసింది. ఏడీఆర్‌ డేటా ప్రకారం, ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో 2021-22 వరకు అన్ని రాజకీయ పార్టీలకు కలిపి రూ. 9,188 కోట్లకు పైగా విరాళాలుగా అందించాయి. అందులో బీజేపీకి 57 శాతం పైగా నిధులు అందగా, కాంగ్రెస్‌కు కేవలం 10 శాతం మాత్రమే అందాయి. 2016-17 నుంచి 2021-22 మధ్య, డేటా అందుబాటులో ఉన్న చివరి సంవత్సరం వరకు ఏడు జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా మొత్తం రూ.9,188.35 కోట్ల విరాళాన్ని అందుకున్నాయి. ఇందులో బీజేపీకి రూ.5,272 కోట్లు, కాంగ్రెస్‌కు కేవలం రూ.952 కోట్లు రాగా, మిగిలినవి ఇతర పార్టీలకు చేరాయి.
జాతీయ పార్టీల ఎలక్టోరల్‌ బాండ్ల విరాళాలలో గణనీయమైన పెరుగుదల ఉంది. 2017-18 నుంచి 2021-22 మధ్య 743 శాతం పెరుగుదల ఉంది.అదే సమయంలో కార్పొరేట్‌ విరాళాలు మాత్రం 48 శాతం మాత్రమే పెరిగాయని ఏడీఆర్‌ పేర్కొంది. ప్రాంతీయ పార్టీలు కూడా ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా తమ విరాళాలలో గణనీయమైన భాగాన్ని పొందాయి.
2016-17 నుంచి 2021-22 మధ్య రాజకీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలలో సగానికి పైగా ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా వచ్చినవేనని, ఇతర జాతీయ పార్టీలన్నింటి కంటే బీజేపీకి ఎక్కువ నిధులు వచ్చాయని ఏడీఆర్‌ తెలిపింది.
2016-17 నుంచి 2021-22 మధ్య కాలంలో ఏడు జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయపార్టీలకు దాదాపు రూ.16,437 కోట్ల విలువైన విరాళాలు అందాయని పేర్కొంది. ఇందులో రూ.9,188.35 కోట్లు (దాదాపు 56 శాతం) ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా స్వీకరించబడ్డాయి.
పార్టీలకు రాజకీయ నిధుల కోసం ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ బుధవారం కూడా కొనసాగింది.

Spread the love