ఆధార్‌పై ఆధారపడడం అవసరమా?

Is it necessary to rely on Aadhaar?– సమస్యలు ఎదురవుతున్నాయి
– సేవల నిరాకరణ జరుగుతోంది
– లోపాలను ఎత్తిచూపిన మూడీస్‌
న్యూఢిల్లీ : ఇప్పుడు దేశంలో ఏ సంస్థలో చూసినా బయోమెట్రిక్‌ సాంకేతికత ఆధారంగానే హాజరు నమోదు చేస్తున్నారు. అటెండెన్స్‌ రిజిస్టర్లకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. అది విద్యా సంస్థ అయినా, ప్రభుత్వ-ప్రైవేటు కార్యాలయమైనా, ప్రభుత్వ పథకమైనా… అన్నింటిలోనూ హాజరు నమోదుకు వేలిముద్రలు లేదా కనుపాప గుర్తింపే ఆధారం అవుతోంది. అయితే ఈ పద్ధతిపై ఆధారపడడం ఎంత వరకు సమంజసమని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా తేమ, వేడి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పనిచేసే వారి నుంచి ఆధార్‌ గుర్తింపు వెరిఫికేషన్‌ కోసం ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై సందేహాలు వ్యక్తం చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ఇలాంటి సాంకేతికతను వినియోగిస్తే అది ‘సేవల నిరాకరణ’కు దారి తీస్తుందని అభిప్రాయపడింది.
దేశంలో అనేక సేవలకు ఆధార్‌ ఆధారిత గుర్తింపు పద్ధతినే అనుసరిస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు బ్యాంక్‌ ద్వారా నగదు బదిలీ చేయడానికి ఆధార్‌ గుర్తింపే కీలకం అవుతోంది. చివరికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు సైతం ఆధార్‌ తప్పనిసరి అవుతోంది. ఆధార్‌ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద డిజిటల్‌ ఐడీ కార్యక్రమం అని మూడీస్‌ సంస్థ తెలిపింది. ‘
దేశంలోని కోట్లాది మందికి ప్రభుత్వం యూఐడీ నెంబర్లు కేటాయించింది. సంక్షేమ ప్రయోజనాలను అట్టడుగు వర్గాల ప్రజలకు చేర్చేందుకు ఆధారే ఆధారం అవుతోంది. అయితే ఈ వ్యవస్థ తరచూ వైఫల్యాలను చవిచూస్తోంది. లబ్దిదారులకు సేవలను నిరాకరిస్తోంది’ అని మూడీస్‌ సంస్థ వేలెత్తి చూపింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం…ముఖ్యంగా తేమ, వేడి వాతావరణంలో పనిచేసే కార్మికుల హాజరు నమోదు కోసం ఈ సాంకేతికతను వాడడం ప్రశ్నార్థకం అవుతోందని తెలిపింది.
ఆధార్‌ వ్యవస్థలో వినియోగదారుల భద్రత, గోప్యతపై మూడీస్‌ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఆధార్‌, వరల్డ్‌ లైన్‌ (క్రిప్టో ఆధారిత డిజిటల్‌ గుర్తింపు టోకెన్‌) వ్యవస్థలు ఎంతటి గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పటికీ వినియోగదారుల సమాచార భద్రత, గోప్యతలకు సంబంధించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి’ అని తెలిపింది. కొన్ని సంస్థలు పౌరుల ఆధార్‌ సమాచారాన్ని సేకరిస్తున్నాయని అంటూ అది సమాచార చౌర్యమే అవుతుందని స్పష్టం చేసింది.
ఆధార్‌ బదులు డిజిటల్‌ వ్యాలెట్ల వంటి వికేంద్రీకృత ఐడీ (డీఐడీ) పద్ధతులను ఉపయోగించవచ్చునని మూడీ సూచించింది. ఇవి వినియోగదారులకు మెరుగైన ప్రత్యామ్నాయం అవుతాయని, ప్రజల వ్యక్తిగత సమాచారంపై వీటికి నియంత్రణ ఉంటుందని తెలిపింది. ‘కేంద్రీకృత వ్యవస్థలో బ్యాంక్‌, సామాజిక మాధ్యమ వేదిక లేదా ఓటర్ల జాబితా వంటివి వినియోగదారుల గుర్తింపునకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తాయి. అయితే వీటి ద్వారా వినియోగదారుని పేరు, చిరునామా, సామాజిక భద్రతా నెంబరు వంటి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఎవరైనా పొందే అవకాశం ఉంది’ అని మూడీస్‌ సంస్థ వివరించింది.

Spread the love