‘ఎంపురాన్‌’పై విద్వేష ప్రచారం

Movieమోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ”ఎంపురాన్‌”పై సంఫ్‌ు పరివార్‌ తీవ్ర విద్వేష ప్రచారాన్ని కోనసాగిస్తోంది. గుజరాత్‌లో జరిగిన హత్యాకాండను చిత్రీకరించిన విషయమూ, హిందూత్వ శక్తులు దేశాన్ని ఎలా పట్టుకుని పాలిస్తున్నాయో చూపించిన అంశమూ వారిని తీవ్రంగా కుదిపేశాయి. ఈ తీవ్రమైన దుష్ప్రచార వాతావరణంలో, చిత్రాన్ని మళ్లీ సెన్సార్‌ చేయాల్సిన పరిస్థితి నిర్మాతలకు కల్పించింది. ఇది కేరళలో, మొత్తం మలయాళ సినీ చరిత్రలోనే, బయటి ఒత్తిళ్ల వల్ల సినిమా మళ్లీ సెన్సార్‌ చేసిన మొదటి సందర్భం. ఇది మన ప్రజాస్వామ్య దేశంలో చోటుచేసుకుంటున్న ప్రమాదకరమైన మార్పును సూచిస్తుంది.పురోగమన ఆలోచనలు కలిగినవారిపై, భిన్న స్వరాలపై, సంఫ్‌ు పరివార్‌ చూపుతున్న అసహనమే ”ఎంపురాన్‌”పై వచ్చిన ఆరోపణల్లో ప్రతిఫలిస్తోంది. తమపై విమర్శలు చేసే రచనలు, కళలు, రాజకీయ ప్రకటనలు బెదిరింపులు చేయడంలో హిందూత్వ శక్తులు ఎన్నో పద్ధతులు అవలంబిస్తున్నాయి. రచయితల్ని, కళాకారుల్ని, ప్రజా ప్రతినిధుల్ని, మేధావుల్ని టార్గెట్‌ చేయడం, కేసులు పెట్టడం, కోర్టుల ద్వారా వేధించడం వంటి పద్ధతులు వినియోగిస్తూ వస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలో, బాధితులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇది చాలదన్నట్లు శారీరక దాడులు, హత్యలకు కూడా పాల్పడుతున్నారు.ఇలాంటి ప్రతి సంఘటన ప్రజాస్వామ్య సమాజానికి హెచ్చరికగా మనం చూడాలి.
2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఇలాంటి ఒత్తిళ్లు భారీగా పెరిగాయి. ఎం.ఎం. కల్బుర్గి, నరేంద్ర ధబోల్కర్‌, గౌరి లంకేష్‌ వంటి, అలాగే ప్రజాప్రతినిధుల హత్యలు,ఈ కోవకు చెందినవి. అలాగే పికె, పద్మావతి, అన్నపూర్ణి వంటి సినిమాలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు, హింసాత్మక ఘటనలు.. ఇవన్నీ ఒకే ధోరణిని సూచిస్తున్నాయి. తాజాగా స్టాండప్‌ కామేడియన్‌ కునాల్‌ కమ్రాపై శివసేన చేసిన దాడీ ఈ వరుసలోనే మరో ఘట్టం.సంఫ్‌ు పరివార్‌ ఈ దాడులన్నింటినీ ప్రజాస్వామ్య హక్కుల కోణంలో చూపిస్తూ, వాటిని తమ హక్కులుగా సమర్ధించడానికి ప్రయత్నిస్తోంది. తాము నమ్మే మత సాంప్రదాయాలను దూషించే విషయాలపై చర్యలు తీసుకుంటే అది పౌరస్వాతంత్య్రానికే చెందుతుందని వాదిస్తున్నారు. శకుంతల బెనర్జీ అనే తత్వవేత్త చెప్పినట్లు ఇది ప్రజాస్వామ్య విలువలనే వక్రీకరించే చర్య.సంఫ్‌ు పరివార్‌ చెబుతున్న హిందూత్వ సిద్ధాంతం ప్రకారం, భారతదేశానికి సనాతన హిందూ ధర్మమే ఆధారం. దేశప్రజలంతా హిందువులే అన్న భావనతో ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించేందుకు సంఫ్‌ు పరివార్‌ ప్రయత్నిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఎవరైనా హిందూత్వాన్ని విమర్శిస్తే, వారిని దేశద్రోహులుగా ముద్రించడమే వారి సూత్రంగా మారుతోంది.కానీ ఇది కేవలం సాంస్కృతిక మార్పు మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా (నియో-ఫాసిజం) పెరుగుదలకు కారణం నియో లిబరల్‌ ఆర్థిక విధానాలే కారణం. భారతదేశంలో 1990ల్లో నియో లిబరల్‌ సంస్కరణలతోపాటే హిందూత్వ శక్తులు బలపడ్డాయి. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత, అంతకుముందు మండల్‌ కమిషన్‌ వ్యతిరేకత ఉద్యమం, రామజన్మభూమి ఉద్యమం వంటి ఘటనలే ఈ శక్తులకు ఊతమిచ్చాయి.
”విజిలాన్టే సెన్సార్‌షిప్‌” అంటే చట్టబద్ధ అధికారాలే లేని వర్గాలు తమకు నచ్చని అభిప్రాయాలపై దాడులు చేయడం. భారత సినీ రంగంలో పెరిగిపోతున్నది.గతంలో ఈసినిమాల సందర్భంగా మనకు అనుభవాలున్నాయి. ఖల్నాయక్‌ (1993), బొంబాయి(1995), ఫైర్‌ (1996), ఫనా (2006), మై నేమ్‌ ఈస్‌ ఖాన్‌ (2010), పికె (2014), పద్మావత్‌ (2018), అన్నపూర్ణి (2023) ఇవన్నీ ఈకోవలోనే ఈ దాడుల గురయ్యాయి.ఇప్పుడు ”ఎంపురాన్‌”పై వస్తున్న ప్రచారం అదే విధంగా హిందూత్వ శక్తుల విజయాన్నే సూచిస్తోంది. ఇది కేవలం సినిమా విషయంలో కాదు, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ శక్తులు తమ ఆధిపత్యాన్ని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగం. ముఖ్యంగా ”ఎంపురాన్‌” పై పెంచిన వ్యతికేత కేవలం సోషల్‌ మీడియాకే పరిమితమైపోయింది. దీని కోసం ఎలాంటి ర్యాలీలు, నిరసనలు జరగలేదు.అయిన నిర్మాతలు బెదిరింపులకు గురై భయపడి మళ్లీ సెన్సార్‌ చేయాల్సిన పరిస్థితిని సంఫ్‌ు పరివార్‌ కల్పించింది.సోషల్‌ మీడియాలో కాసుకుని ఉన్న సంఫ్‌ుపరివార్‌ శక్తుల హిందూత్వ విధ్వేషానికి బలైతామనే భయంతో నిర్మాతలు సినిమా మళ్లీ సెన్సార్‌ చేయడం ఆందోళన కలిగించే విషయం. ఇది పూర్తిగా నియో-ఫాసిస్టు శైలికి చిహ్నంగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేయకుండా, దాన్ని వక్రీకరించి ఉపయో గించుకునే అంశాన్ని రాజకీయంగా చూడాలి. హిందూత్వ శక్తులు కూడా మీడియా బదులు సోషల్‌ మీడియాను ఈ విధంగా వాడు కుంటున్నాయి.ఈ పరిస్థితుల్లో, పురోగమనశక్తులు అప్రమత్తంగా ఉండి, ఈ విధ్వంసకర ప్రయత్నాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.
– టి.నాగరాజు, 9490098292

Spread the love