భారత్‌లో పెరుగుతున్న సిజేరియన్ ప్రసవాలు
ప్రాణరక్షణ పేరుతో ప్రయివేటు ఆస్పత్రుల వ్యాపారం
దేశవ్యాప్తంగా 27 శాతానికి పైగా సిజేరియన్లు
తెలంగాణలో అత్యధికంగా 62 శాతానికి పైనే!
తల్లీబిడ్డలపై ప్రతికూల ప్రభావం : నిపుణులు
సాధారణ ప్రసవం కంటే 17 నుంచి 50 రెట్లు అధిక ఖర్చు
అప్పుల ఊబిలోకి పేద, మధ్యతరగతి కుటుంబాలు
న్యూఢిల్లీ : భారత్‌లో సిజేరియన్ (సి-సెక్షన్) ప్రసవాలు ఆందోళన కరంగా పెరుగుతున్నాయి. అత్య వసర పరిస్థితుల్లో తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడాల్సిన ఈ శస్త్రచికిత్స.. ప్రయివేటు ఆస్పత్రులకు వ్యాపార సాధనంగా మారుతోంది. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6) ప్రకారం.. దేశవ్యాప్తంగా సిజేరియన్ ప్రసవాల శాతం 21.5 శాతం నుంచి 27.2 శాతానికి పెరిగింది. ఇది ప్రయివేటు ఆస్పత్రుల్లో ఏకంగా 54 శాతానికి చేరుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించిన పరిమితులను ఇది దాటిపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణ ప్రక్రియగా సిజేరియన్
ప్రసవ సమయంలో శిశువు అడ్డంగా ఉండటం, ప్రసవం ముందుకు సాగకపోవడం, అధిక రక్తపోటు, కవలలు, మధుమేహం, గతంలో సిజేరియన్ కావడం వంటి సందర్భాల్లో మాత్రమే సి-సెక్షన్ అవసరమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ శస్త్రచికిత్స తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడుతుంది. అయితే ప్రస్తుతం వైద్య అవసరం లేకపోయినా.. అనవసరంగా సిజేరియన్ చేయిస్తున్నారని వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘డాక్టర్లు చెప్పిందే చేశాం.. జీవితాంతం మూల్యం చెల్లి స్తున్నాం’’ అంటూ ఓ మహిళ తన బాధను వెళ్లగక్కింది. బాధితురాలికి.. ఐవీఎఫ్ ద్వారా మొదటి గర్భం రావడంతో ప్రమాదకర గర్భధారణం గా భావించి వైద్యులు సిజేరియన్ చేశారు. బిడ్డ ఆరోగ్యంగా పుట్టింది. రెండో గర్భధారణ సమయంలో కూడా అదే ఆస్పత్రిలో చేరగా.. ప్రసవ రోజున రక్తపోటు పెరిగిందని మరోసారి సిజేరియన్ చేశారు. కానీ ఆ శస్త్రచికిత్స అనంతరం తీవ్రమైన రక్తస్రావం జరగడంతో వైద్యులు ఆమె గర్భాశయాన్నే తొలగించాల్సి వచ్చింది. అనంతరం కామెర్లు రావడంతో ప్రభుత్వాస్పత్రిలో ఆమె చికిత్స పొందాల్సి వచ్చింది. ఈ చికిత్సల కోసం రూ.6 లక్షలకు పైగా ఖర్చవడంతో వారి కుటుంబం అప్పులు చేయాల్సి వచ్చింది. గర్భాశయం తొలగిపోవడంతో పాటు ఆమె ఇప్పటికీ శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతోంది.
సిజేరియన్ ఎందుకు పెరుగుతోంది?
దేశంలో సిజేరియన్ పెరుగుదలపై వైద్య నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. కొన్ని కారణాలను మాత్రం అంగీకరిస్తున్నారు. మహిళలు ఆలస్యంగా గర్భం దాల్చడం, ఐవీఎఫ్ వంటి సంతానోత్సత్తి చికిత్సలు పెరగడం, ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు అధికం కావడం, మొదటి ప్రసవం సిజేరియన్ అయితే రెండోసారి కూడా అదే జరిగే అవకాశాలు ఎక్కువ కావడం, వైద్య నిర్లక్ష్యం కేసుల భయంతో వైద్యులు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడడం వంటి కారణాలను వారు చూపెడుతున్నారు. అయితే ఇవే కారణాలతో 50 శాతానికి పైగా సిజేరియన్లు జరగడం సాధ్యం కాదని కూడా స్పష్టం చేస్తున్నారు.
డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక
పెరుగుతున్న సిజేరియన్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరిస్తోంది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం.. సిజేరియన్ రేటు 10-15 శాతం దాటినప్పటికి కూడా తల్లీబిడ్డల మరణాలు తగ్గకపోవచ్చని అంటోంది. ఇక గరిష్టంగా 20 శాతం వరకు మాత్రమే నిజమైన వైద్య అవసరం ఉండొచ్చని భారత నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే భారత్‌లోని ప్రయివేటు ఆస్పత్రుల్లో 54 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరుగుతుండటం ఆందోళనకరం. ప్రయివేటు రంగంలో జరిగే ప్రతి ఐదు సిజేరియన్లలో కనీసం మూడు వైద్యపరంగా అవసరం లేనివే అని జన్ స్వాస్థ్య అభియాన్ జాతీయ సహ-సమన్వయకర్త అభయ్ శుక్లా తెలిపారు.
తెలంగాణలో అత్యధికం
దేశంలో అత్యధిక సిజేరియన్ ప్రసవాల రేటు తెలంగాణలో నమోదైంది. ఇది 62.2 శాతంగా నమోదైంది. అయితే సిజేరియన్ల పెరుగుదల అనేది మంచి సూచిక కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (47 శాతం), కేరళ (41 శాతం)లు ఉన్నాయి. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. ప్రయివేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు అత్యధికంగా జమ్మూకాశ్మీర్‌లో 90 శాతంగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (88 శాతం), తెలంగాణ (84 శాతం)లు ఉన్నాయి. అంటే.. ప్రయివేటు రంగంలో దాదాపు ప్రతి పది ప్రసవాల్లో ఎనిమిది నుంచి తొమ్మిది వరకు సిజేరియన్లే కావడం గమనార్హం. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో తల్లి మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. కానీ కర్నాటకలో సిజేరియన్ రేటు తమిళనాడుతో సమానంగా ఉన్నప్పటికీ.. తల్లి మరణాల రేటు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. దీనర్థం.. ఎక్కువ సిజేరియన్లు నమోదవడమంటే మెరుగైన వైద్యం కాదని వైద్య నిపుణులు చెప్తున్నారు.
రిస్క్ లేకుండా.. ధనార్జనే ధ్యేయంగా.. ప్రయివేటు ఆస్పత్రుల తీరు
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం… సాధారణ ప్రసవానికి 6 నుంచి 12 గంటలు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. వైద్యులు, నర్సులు నిరంతరం పర్యవేక్షించాలి. అదే సిజేరియన్ అయితే… ముందే సమయం నిర్ణయించుకోవచ్చు. పనిని గంటలోపు పూర్తి చేయొచ్చు. ఆస్పత్రి నిర్వహణ కూడా సులభం. ఆదాయం కూడా ఎక్కవగానే వస్తుంది. అందుకే ప్రయివేటు ఆస్పత్రులు సిజేరియన్ వైపు మొగ్గు చూపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గర్భిణులను ‘సాధారణ ప్రసవం ప్రమాదకరం’, ‘బిడ్డకు ముప్పు’ వంటి భయాలతో వారిని సిజేరియన్‌కు ఒప్పిస్తున్నారని మహిళా హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గర్భధారణను సహజ ప్రక్రియగా కాకుండా ప్రమాదకర పరిస్థితిగా చిత్రీకరిస్తూ శస్త్రచికిత్సలను ప్రోత్సహిస్తున్నారని ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
మరో భారంగా ఖర్చులు
ప్రయివేటు ఆస్పత్రిలో ఒక ప్రసవానికి సగటున రూ.39 వేలకుపైగా ఖర్చవుతోంది. ఇది ప్రభుత్వ ఆస్పత్రితో పోలిస్తే 17 రెట్లు ఎక్కువ. ఇక తెలంగాణలో అయితే… ప్రభుత్వ ఆస్పత్రి ఖర్చు రూ.1,714గా ఉంటే.. ప్రయివేటు ఆస్పత్రిలో అది రూ.53,355గా ఉంది. తమిళనాడులో ప్రయివేటు ప్రసవానికి సగటున రూ.70 వేల వరకు ఖర్చవుతోంది. దీంతో ఈ భారీ వ్యయాల కారణంగా అనేక పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేయడం, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
తల్లీబిడ్డలపై ప్రభావం
సిజేరియన్ ద్వారా పుట్టిన శిశువులకు పుట్టిన తొలి గంటలో తల్లిపాలు అందే అవకాశం సాధారణ ప్రసవాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి. శస్త్రచికిత్స తర్వాత తల్లికి నొప్పి, మత్తుమందుల ప్రభావం, కోలుకోవడానికి సమయం పట్టడం వల్ల తల్లి పాలు అందడం ఆలస్యమవుతుంది. తొలి గంటలో తల్లిపాలు అందకపోతే నవజాత శిశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో పెరిగిపోతున్న సిజేరియన్లను అరికట్టాలంటే కఠిన చట్టాలు, ప్రభుత్వ పర్యవేక్షణ ద్వారానే సాధ్యమవుతుందని సామాజికవేత్తలు చెప్తున్నారు. ప్రభుత్వాలు ప్రయివేటు ఆస్పత్రల విషయంలో రాజీపడకుండా కఠిన చట్టాలు తీసుకురావాలనీ, వైద్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తున్నారు.
అమ్మకు ఎంత కష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



