అయోధ్య రామాలయంలో నిధుల దోపిడీపై ప్రతిపక్షాలు ఏకమవ్వాలి
రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు
అధికారంలోకి రాగానే కుచ్చుటోపీ
సమాజ్‌వాది పార్టీ రౌండ్ టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అయోధ్య రామాలయంలోని నిధుల దుర్వినియోగం, అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ తీరును ఎండగట్టేందుకు దేశంలోని ప్రతిపక్షాలు ఒక్కతాటిపైకొచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమాజ్‌వాది పార్టీ ఆధ్వర్యంలో ‘అయోధ్య రామ మందిరం లూటీ…అండర్ బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ రూల్’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎస్పీ తెలంగాణ అధ్యక్షులు ప్రొఫెసర్ సింహాద్రి యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. బీజేపీ రాముడిపేరుతో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తూ అధికారంలోకి వచ్చిందనీ, మోడీ సర్కారు వేసిన రామాలయం ట్రస్టు ఇప్పుడు ఆ దేవుడికే కుచ్చుటోపి పెడుతున్నదని విమర్శించారు. యూపీ ప్రభుత్వం వేసిన సిట్ తన విచారణలో కింది స్థాయి ఉద్యోగుల్ని బాధ్యుల్ని చేసి కీలక వ్యక్తులను విస్మరించడాన్ని తప్పుబట్టారు. ఆ విచారణపై నమ్మకం లేదనీ, వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పులను ఎత్తిచూపుతున్న, ప్రశ్నిస్తున్నవారి గొంతుల్ని మోడీ సర్కారు నొక్కేస్తున్న తీరును ఎండగట్టారు. ప్రశ్న రావణ్ ప్రశ్నిస్తే ఉపా కేసు పెట్టడం దారుణమన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓ పక్క దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతూ మరో పక్క ప్రజల, కార్మికుల హక్కులను హరిస్తున్న తీరును వివరించారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ…దేశంలోని క్రిస్టియన్, ముస్లిం మత సంస్థలకు రిజిస్ర్టేషన్లు ఉన్నాయనీ, ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పటి వరకూ రిజిస్ర్టేషన్ చేయించుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఉత్తర భారతంలోని దేవాలయాలు ఎండోమెంట్ కింద లేవనీ, ఆ నిధులు ఏమవుతున్నాయో కూడా తెల్వదని చెప్పారు. అయోధ్య రామాలయంలోని నిధులు పక్కదారి పట్టడంపై అఖిలేష్ యాదవ్ మాత్రమే కొట్టాడుతున్నారనీ, రాముడి పేరుతో రాజకీయం చేసే బీజేపీ విషయంలో రాజకీయ అస్ర్తం దొరికినా మిగతా ప్రతిపక్షాలు అంతగా పోరాడటం లేదని తెలిపారు.
రాముడి అంశాన్ని ఎజెండాగా చేసుకుని తెలంగాణలో రాహుల్‌గాంధీ, అఖిలేష్‌యాదవ్, సిద్ధరామయ్య, దక్షిణాది రాష్ర్టాల సీఎంలను పిలిచి భారీ బహిరంగ సభ పెట్టాలని సూచించారు. దేశాన్ని నడిపే సమర్ధనాయకుడు రాహుల్‌గాంధీనే అన్నారు. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. అయోధ్య రామాలయానికే రక్షణ కల్పించలేనివారు దేశానికి ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఇంత రచ్చ జరుగుతుంటే ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. ప్రశ్నించేవారిని బెదిరించడం, చైనీయులు, పాకిస్తానీయులు అని ముద్రవేయడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. దొంగల్ని దేశభక్తులంటూ భూమి పుత్రులను దేశ ద్రోహులుగా ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు. అయోధ్య రామాలయం ఘటన తర్వాత దేశపాలకులు ఈ భూమిపుత్రులేనా అన్న సందేహం వస్తోందన్నారు. అయోధ్య రామాలయం తలంబ్రాలతో సెంటిమెంట్ రాజకీయాలు చేసిన బీజేపీ ఎదుర్కొనేందుకు ఇప్పుడు అదే రాముడి అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లి ఆ పార్టీ మోసాలను ఎండగట్టాలన్నారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలను భయపెట్టి లొంగదీసుకోవడం, వినని పార్టీలను చీల్చడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. అంతచేసినా మొన్నటి ఎన్నికల్లో దేశంలోని 70 శాతం ప్రజలు మోడీసర్కార్‌ను వ్యతిరేకించారనీ, అయితే కొన్ని పార్టీలను భయపెట్టి మోడీ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఓట్ చోరీ, సీట్ చోరీ, హుండీ చోరీలతో ముందుకెళ్తున్న బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాష్టార్‌జీ, సీపీఐ(ఎం) నేత రాములు, భూపతి వెంకటేశ్వర్లు, కోల జనార్థన్, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



