తీరంలో ఎగిసిపడుతున్న భారీ అలలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను రెండు రాష్ట్రాలను వణికిస్తోంది. గుజరాత్ తో పాటు మహారాష్ట్రలోని సముద్ర తీరంలో వాతావరణం బీభత్సంగా మారింది. భారీగా ఎగిసిపడుతున్న అలలకు జుహూ బీచ్ లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. గురువారం తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో కచ్, ద్వారక సహా పలు తీరప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. సముద్ర తీరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వారిని కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 12 వేల మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలపై తుపాను ప్రభావం పడింది. పశ్చిమ రైల్వే పరిధిలో 67 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 56 రైళ్ల రాకపోకలను కుదించారు. ముంబై ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలపైనా తుపాను ప్రభావం పడింది. మరోవైపు, ఈ నెల 15 వరకు గుజరాత్ లోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. బిపర్ జోయ్ తుపాను ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్ర తీరానికి వెళ్లొద్దంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే, సోమవారం సాయంత్రం కొంతమంది యువకులు అధికారుల హెచ్చరికలను లెక్కచేయకుండా జుహూ బీచ్ కు వెళ్లారు. భారీగా ఎగిసిపడుతున్న అలల కారణంగా నలుగురు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు. అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఉపయోగంలేకుండా పోయింది. ఇద్దరు యువకుల మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. వర్షాలు, పెను గాలులకు గుజరాత్ లో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. రాజ్ కోట్ లో బైక్ పై వెళుతున్న దంపతులపై ఓ చెట్టు కూలగా.. తీవ్రగాయాలపాలైన భార్య అక్కడికక్కడే చనిపోయింది. ఆమె భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Spread the love