అంబేద్కర్ ఆశయాలను కించపరుస్తూనే ఆయన సమాధి వద్ద మోకరిల్లుతున్నారు. ఒకవైపు విగ్రహాలను కూలగొడుతూ ఇంకోవైపు చిత్తశుద్ధి లేని శుద్ధికి పూనుకుంటున్నారు. రాజ్యాంగ నిర్మాతను అడుగడుగునా అవమానిస్తూనే ఆయన జయంతి వేడుకల్లో వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తున్నారు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటూనే దాన్ని గుండెలకు హత్తుకుని నటిస్తున్నారు. రాజ్యాంగ రక్షణ చేయాల్సిన వాళ్లే, దాని మౌలిక లక్ష్యాలైన ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సమాఖ్య స్ఫూర్తి, సామాజిక న్యాయం వంటి మూలాలను దెబ్బతీసేందుకు నడుం కడుతున్నారు. ఇది నేడు మనల్ని పాలిస్తున్న బీజేపీ-ఆరెస్సెస్ ముసుగు వీరుల విధానం.
కుల, మత, భాష, లింగ భేదం లేకుండా దేశంలోని పౌరులందకీ సమాన హక్కులుండాలనే ఆలోచనతో అంబేద్కర్, దానికి తగ్గట్టు రాజ్యాంగంలో కొన్ని సూత్రాలను రూపొందించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను, ఆత్మగౌరవంతో బతికే స్వేచ్ఛను అందులో పొందుపరిచారు. అంతేకాదు వ్యక్తిగత మత స్వేచ్ఛ గురించి సైతం స్పష్టపరిచారు. మతాన్ని, దేవుడిని రాజకీయాల్లోకి, పరిపాలనలోకి తేవడం దేశ సమైక్యతకు పెను ప్రమాదమని అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారు. కానీ నేడు దేశాన్ని ఏలుతున్న బీజేపీ మతోన్మాద రాజకీయాలతో దేశ భవితను పెను ప్రమాదంలోకి నెట్టేస్తోంది. మతాన్ని అడ్డుపెటుకుని అడుగడుగునా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోంది. లౌకిక ప్రజాస్వామిక దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు వ్యూహాన్ని పన్ని ఆచరణలోకి తెస్తున్నది. కరి మింగిన వెలగపండులా రాజ్యాంగ సారాన్నే మింగేస్తున్నది.
దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏండ్లు గడిచినా కుల వివక్ష, అంటరానితనం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి ఇలాంటి ఛాందస వాదులే కారణమనేది స్పష్టం. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల, మత విద్వేషాలు, సంబంధిత దాడులు పతాకస్థాయికి చేరాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు ప్రతి ఐదేండ్లకోసారి ఒక్కో నినాదంతో బీజేపీ నాయకులు ప్రజల ముందుకు వస్తున్నారు. గత పదేండ్లుగా హిందువుల ఓట్ల కోసం మైనార్టీలపై తమ హిందుత్వ బాణాన్ని ఎక్కు పెట్టారు. ప్రజలు తిరగబడటంతో సీట్లు తగ్గినా హిందువులపైనే దాడులకు తెగబడుతున్నారు. దీని కోసం సనాతన ధర్మాన్ని ముందుకు తెచ్చారు. తాము అధికారంలో ఉన్న చోట ఖాకీలను ఉసిగొలిపి సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారు. చివరకు దేవుళ్లు, గుళ్లో పూజారులు సైతం తాము చెప్పినట్టే వినాలని శాసిస్తున్నారంటే వారి ఉన్మాదం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. దక్షిణ ఢిల్లీలోని చిత్రరంజన్ పార్క్ సమీపంలో చేపలు అమ్ముకొని బతికే బెంగాలీ హిందువులను బెదిరించడం(పక్కనే కాళీమాత ఆలయం ఉందనే సాకుతో), ఇండోర్‌లో అర్ధరాత్రి గుడి తలుపులు తెరవనందుకు బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఆ గుడి పూజారినే కొట్టడం వంటి సంఘటనలే దీనికి నిదర్శనం.
ఏది ఏమైనా ఆరెస్సెస్ కనుసన్నల్లో నడుస్తున్న బీజేపీ తన హిందూ రాష్ట్ర ఎజెండాను ముందుకు తీసుకు పోయేందుకు పూనుకుంది. దానికి అడ్డుగా ఉన్నది భారత రాజ్యాంగం. అందుకే ఉన్న రాజ్యాంగాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్త రాజ్యాంగం లిఖిస్తామంటున్నారు. అంటే వారు చెప్పుకు తిరుగుతున్న సనాతన ధర్మం ప్రకారం మనుధర్మాన్ని రాజ్యాంగంగా భారత ప్రజల నెత్తిన రుద్దేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి మొదటి నుండి రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేద్కర్ ఆశయాలను వ్యతిరేకిస్తున్నది ఆరెస్సెస్ అనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. దాని అడుగుజాడల్లో నడిచే బీజేపీ రథసారధి మోడీ నేడు ‘రాజ్యాంగానికి అసలైన రక్షకులం మేమే’ అంటూ కపట ప్రగల్భాలు పలుకుతున్నారు.
పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోరుకున్న వ్యక్తి అంబేద్కర్. వివక్షకు తావు లేని సమాజం ఆయన స్వప్నం. ఆ లక్ష్యంతోనే రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించారు. దాని ఫలితమే నేటి రిజర్వేషన్లు. మహిళలకు సమానత్వాన్ని కల్పించే హిందూ కోడ్ బిల్లు కోసం మంత్రి పదవినే త్యజించారు. కానీ కులతత్వం, లింగ వివక్ష మన దేశంలో బలంగా పాతుకుపోయింది. ఇలాంటి సమయంలో జయంతి, వర్థంతుల సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి, జై భీం నినాదాలిస్తే సరిపోదు. అన్ని రకాల వివక్షల నుండి బయటపడాలంటే ప్రజలకున్న ఏకైక ఆయుధం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. మతోన్మాదం ముంచుకొస్తున్న నేటి పరిస్థితుల్లో దాన్ని కాపాడు కోవడమనేది ఇప్పుడు దేశ ప్రజల ముందున్న కర్తవ్యం. అంబేద్కర్ కోరుకున్న కుల, వర్గ రహిత సమాజ నిర్మితం కోసం ప్రతి ఒక్కరూ పూనుకోవాల్సిన సమయం. మతోన్మాదుల చెర నుండి రాజ్యాంగాన్ని, తద్వారా దేశాన్ని కాపాడు కోవాల్సిన తరుణం. ఇదే అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా భారత ప్రజలుగా మనమిచ్చే నిజమైన నివాళి.