ఓట్ల వేట

Hunt for votes– గంపగుత్త ఓట్ల కోసం బేరసారాలు
– కాలనీలు, డివిజన్ల నాయకులతో అభ్యర్థుల సమావేశాలు
– మొదటి దఫా ప్రచారంలోనే మద్దతు కూడగట్టుకోవడంలో నిమగం
– క్షేత్ర స్థాయి పర్యటనలో ‘మల్కాజిగిరి’ అభ్యర్థులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగే అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు.. ఇక ఓట్ల వేట కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముందే బీజేపీ అభ్యర్థిని ప్రకటించగా.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఇటీవలే అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో వీరు ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నారు. గెలుపు కోసం ఇప్పటి నుంచే తంటాలు పడుతున్నారు. మొదటి దఫా ప్రచారంలో గంపగుత్తగా ఓట్లు సాధించే అంశాలపై దృష్టి సారించారు. అన్ని నియోజకవర్గాలు, మండలాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో కీలకమైన నేతలను, ఆయా సంఘాల నాయకులను కలుస్తున్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పార్టీ ఇన్‌చార్జీలు, కీలక ప్రజాప్రతినిధులతో వరుస భేటీ అవుతున్నారు.
చేరికలపై ప్రయత్నాలు
బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఆరు గ్యారంటీలు, వంద రోజుల పాలనపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థి సునితా మహేందర్‌రెడ్డి సమావేశాల పేరిట ముఖ్య నేతలను కులుసుకుంటూనే నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ప్రధాని మోడీ చరిష్మాపై ఆధారపడిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ మార్నింగ్‌ వాక్‌, కాలనీలు, డివిజన్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటిస్తూ మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుస్తూ నియోజకవర్గంలోని ఆయా కాలనీల నేతలతో సమావేశమవుతున్నారు. మేడ్చల్‌, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు నవీన్‌రావు, శంభీపూర్‌ రాజును ఒక విడత కలిశారు. మండలాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో కుల సంఘాల నాయకులతో మమేకం అవుతున్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆయా తరగతులు, సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్‌, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కంటోన్మెంట్‌ తదితర చోట్ల అభ్యర్థులు సన్మానం, చేరికల కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
భిన్న ఎన్నికల వాతావరణం
లోక్‌సభ ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్స్‌కు భిన్నంగా ఉంటాయి. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి తక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రత్యక్షంగా కలిసేందుకు వీలుండేది. ఇంటింటికీ తిరిగి నేరుగా ఓటర్లతో మమేకం అవుతుంటారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇలా ప్రచారం చేయడానికి వీలు పడదు. లోక్‌సభ నియోజకవర్గం పరిధి విస్తృతంగా ఉంటుంది. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం మేడ్చల్‌-మల్కాజిగిరి.. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రత్యక్షంగా కలవడం సాధ్యం కాదు. దీంతో గంపగుత్త ఓట్లు సాధించడం కోసం అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మండలాలు, కాలనీల ముఖ్య నేతలతో సమావేశమై ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Spread the love