చరిత్ర వేటాడుతూ..!

ఢీ– సెమీఫైనల్లో అఫ్గాన్‌, సఫారీ ఢీ
– తొలిసారి ఫైనల్లో చోటు కోసం తహతహ
– ఉదయం 6 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-తరౌబా
2004.. అఫ్గనిస్థాన్‌ తొలి అధికారిక క్రికెట్‌ మ్యాచ్‌ ఆడిన ఏడాది. 20 ఏండ్లలో ఆ జట్టు ఏకంగా 20 జట్లు పోటీపడిన మెగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌కు చేరుకుంది. కొన్ని జట్లు 50 ఏండ్లలో సాధించలేని ఘనత.. అఫ్గనిస్థాన్‌ 20 ఏండ్లలో సాధించింది. సహజ ప్రతిభకు నైపుణ్యత సైతం తోడవటంతో అఫ్గనిస్థాన్‌ అగ్రజట్లను నిలకడగా నిలువరించే స్థాయికి ఎదిగింది. 10 ఏండ్ల నిరీక్షణ అనంతరం ఐసీసీ టోర్నమెంట్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా.. గత చేదు రికార్డులను తుడిచిపెట్టాలనే సంకల్పంతో కనిపిస్తుంది. గతంతో పోల్చితే ఒత్తిడితో కూడిన ఉత్కంఠ మ్యాచుల్లో సఫారీలు చిరస్మరణీయ విజయాలు నమోదు చేశారు. ఇదే జోరు మరో రెండు మ్యాచుల్లోనూ కొనసాగించాలని మార్‌క్రామ్‌సేన భావిస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్‌ పోరులో అఫ్గనిస్తాన్‌, దక్షిణాఫ్రికా నేడు తలపడనున్నాయి.
ఉరిమే ఉత్సాహం : అఫ్గనిస్థాన్‌ క్రికెట్‌ చరిత్రలో నేడు అతిపెద్ద మ్యాచ్‌ ఆడనుంది. తొలిసారి సెమీస్‌కు చేరిన రికార్డుతో ఆగిపోకూడదనే పట్టుదల ఆ జట్టులో కనిపిస్తుంది. అఫ్గాన్‌ శిబిరంలో ప్రతిభకు ఎన్నడూ కొదవ లేదు. బంగ్లాదేశ్‌పై సూపర్‌8 విజయం సాధించిన అఫ్గాన్‌ జట్టులో ఏకంగా 8 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ ప్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అఫ్గాన్‌ ప్రధాన బలం బౌలింగ్‌. కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ టీ20 ఫార్మాట్‌లో మకుటం లేని మాయగాడు. మహ్మద్‌ నబి, నూర్‌ అహ్మద్‌ స్పిన్‌ ద్వయం ప్రత్యర్థి పరుగుల వేట మరింత కష్టతరం చేయగలరు. అఫ్గాన్‌ పేస్‌ పదును సైతం ఎక్కువే. ఫజల్‌హాక్‌ ఫరూకీ, నవీన్‌ ఉల్‌ హాక్‌ కొత్త బంతితో నిప్పులు చెరుగుతున్నారు. పేస్‌, స్వింగ్‌కు తోడు తెలివిగా స్లో బాల్స్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తున్నారు. అఫ్గాన్‌ ఆందోళన చెందాల్సిన విభాగం బ్యాటింగ్‌. ఓపెనర్లు గుర్బాజ్‌, ఇబ్రహీం మినహా ఎవరూ నిలకడగా రాణించటం లేదు. ఈ ఇద్దరు సైతం ఛేదనలో మెరుగ్గా రాణించలేదు. తొలుత బ్యాటింగ్‌ చేసిన మ్యాచుల్లో గుర్బాజ్‌, ఇబ్రహీం నాలుగుసార్లు 50 ప్లస్‌ భాగస్వామ్యాలు నమోదు చేశారు. మిడిల్‌ ఆర్డర్‌ ఆశించిన ప్రదర్శన చేయటం లేదు. మహ్మద్‌ నబి, కరీం జనత్‌, అజ్మతుల్లా రాణిస్తే.. అఫ్గనిస్థాన్‌ బ్యాటింగ్‌ కష్టాలు తీరినట్టే. ఛేదనలో అఫ్గాన్‌కు మంచి రికార్డు లేదు. తొలుత బ్యాటింగ్‌ చేస్తే అఫ్గాన్‌ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి!.
సఫారీ సై : అగ్రజట్టు దక్షిణాఫ్రికాకు ఐసీసీ ఈవెంట్లలో అత్యంత చెత్త రికార్డు ఉంది. దిగ్గజాలు బరిలో నిలిచినా.. అనుకోని పరిస్థితులతో ఓటమి చెందటం ఆ జట్టు గత చరిత్ర. ఈ వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా కొత్తగా కనిపిస్తోంది. ఒత్తిడిని జయిస్తూ ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. గ్రూప్‌, సూపర్‌8 దశల్లో అజేయంగా నిలిచింది. అన్ని రంగాల్లోనూ జోరు మీదున్న దక్షిణాఫ్రికా టైటిల్‌ పోరుకు చేరుకోవాలని తపన పడుతోంది. స్పిన్‌ అస్త్రంతో సవాల్‌ విసురుతున్న అఫ్గాన్‌కు.. హెన్రిచ్‌ క్లాసెన్‌ బదులు ఇస్తాడని సఫారీలు భావిస్తున్నారు. స్పిన్‌పై కండ్లుచెదిరే హిట్టింగ్‌ చేయగల క్లాసెన్‌ నేటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాకు ఎక్స్‌ ఫ్యాక్టర్‌. బ్యాటింగ్‌ లైనప్‌లో హెండ్రిక్స్‌ మినహా అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌ విభాగం సైతం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కుడి చేతి బ్యాటర్లతో కూడిన అఫ్గాన్‌ బ్యాటింగ్‌ లైనప్‌కు కేశవ్‌ మహరాజ్‌ స్పిన్‌తో పరీక్షగా నిలువనున్నాడు.
పిచ్‌,వాతావరణం : గ్రూప్‌ దశలో ఇక్కడ జరిగిన మ్యాచుల్లో నిలకడలేని బౌన్స్‌ కనిపించింది. సెమీఫైనల్‌ మ్యాచ్‌ పిచ్‌కు క్యూరేటర్‌ కొన్ని సొబగులు అద్దాడు. నేటి మ్యాచ్‌లో బౌన్స్‌ ప్రభావం కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) మ్యాచుల్లో ఇక్కడ మంచు ప్రభావం ఎక్కువగా కనిపించింది. రాత్రి వేళ మ్యాచ్‌ కావటంతో మంచు ప్రభావం తీసిపారేయలేం. అఫ్గాన్‌, సఫారీ సెమీస్‌కు ఎటువంటి వర్షం ముప్పు లేదని చెప్పవచ్చు. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునేందుకు మొగ్గు చూపనున్నాయి.

Spread the love