నేను అడవితల్లిని…

I am the mother of the forest...‘ఇక్కడేదో అడవిలాగుందే, పోతూ పోతూ ఉంటే చెట్లు ఎక్కువవుతున్నాయి. ఎప్పుడూ చూడలేదే ఈ ప్రదేశం, చూద్దాం..లోపల ఏముందో..’ అనుకుంటూ సాగుతున్నాడు కిషన్‌. ‘అరే ఏదో జంతువుల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి’ అని చుట్టూతా చూశాడు. తన దోస్తులు యాద్‌గిరిని, దస్తగిరిని కూడా పిలుచుకొచ్చింటే ఇంకా బాగుండేది అనుకున్నాడు లోపల. పోనుపోను అందంగా కనిపిస్తోంది, భయమూ వేస్తోంది, అందుకే మిత్రులు గుర్తొచ్చినట్టున్నారు.
నిజంగా మస్తుగా ఉంది వాతావరణం, ఇంత ఎండకాలంలో కూడా చల్లగా ఉందిక్కడ అని పొరపాటున బయటికే అనేశాడు. ఇంతలో
”అవును” అన్న శబ్దం వినిపించింది. చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు.
”నేను అడవిని మాట్లాడుతున్నా” అంటూ మళ్లీ మాటలు.
”వామ్మో నేను నిజంగా అడవిలోకే వచ్చినట్టున్నానే” అన్నాడు.
”నిజమే నీవు అడవికే వచ్చావు మానవా” అని అడవి పలికింది.
”నీకు మాటలు కూడా వచ్చా”
”వినాలే కాని ఎన్నో మాట్లాడతాను మానవా”
”సరే కాని ఇంతకుముందెప్పుడూ నీ గొంతు వినపడలేదే, నాకేమైనా కల పడిందా అన్న అనుమానమొస్తోంది”
”కల కాదు కిషన్‌, నిజమే ఇది”
”నా పేరు….?”
”నీ పేరే కాదు ఈ భూమిపై ఉన్న అందరి పేర్లూ తెలుసు నాకు”
”ఐతే నా దోస్తుల పేర్లు చెప్పు?”
”యాద్‌గిరి, నర్సింగ్‌, దస్తగిరి, దామోదర్‌ ……” అలా ఎన్నో పేర్లు చెప్పింది అడవి
”వామ్మో నీవు మామూలు దానివి కాదు!”
”అదేమో కాని మీరు మామూలుకంటే కూడా ఇంకా దిగజారిపోయారు”
”మేమా”
”మీరు అంటే మానవులు అని అర్థం”
”బతికించావు, అందరిలోకీ నన్నుకూడా కలిపావనుకున్నాను”
”కలిపే చెబుతున్నాను”
”????”
”మంచివాళ్లయినా ప్రశ్నించకుంటే నేను చెప్పిన మానవుల్లోకి కలిపేస్తానంతే”
ఇంతలో అటుగా నెమళ్ళు, జింకలు దౌడ్‌ తీశాయి.
”ఇప్పుడైనా నమ్ముతవా, ఇది అడవి అని ఇంకా ఏమైనా సాక్ష్యం కావాలా?”
”అడవే, నేను ఒప్పుకుంటున్నాను కాని నాది ఒక అనుమానం”
”ఏమిటది”
”ఇన్ని అడవులు కొట్టేస్తున్నారే మానవులు, నీకు బాధగా లేదా”
”హ్హ .. హ్హ.. హ్హా” అంటూ నవ్వింది అడవి
”ఏమిటమ్మా అలా నవ్వుతున్నావు, బాధగా లేదా”
”బాధగా ఉండాల్సింది నాకు కాదు, మీకు కిషన్‌ మానవా. అడవులు నాశనమైతే జంతుజాలం తగ్గిపోయి పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, అకాల వర్షాలు, ఎండాకాలంలో విపరీతమైన ఎండలు, వడగాడ్పులు, సునామీలు ఒకటేమిటి మీరు అడవులను నరికేసి సంపాదించుకున్న ఆస్తులన్నీ నాశనమైపోతాయి. నీకు అర్థమైందా ఇప్పుడు ఎవరు నవ్వాలో ఎవరు ఏడ్వాలో?”
”అవునమ్మో, నీవు చెప్పింది అక్షరాలా నిజం”
”అసలు అడవిలో కోతినుండి మెల్లగా మైదానాలకు పోయి నా ముద్దు బిడ్డడు డార్విన్‌ చెప్పినట్టు మనుషులుగా మారారే, కన్నతల్లినే మరచిపోతారా, మానవత్వం లేని మనుషులే మిగిలారా”
”మేమేమీ మరవలేదమ్మా, నేనసలు జింకలు, నెమళ్లు కనిపిస్తున్నాయంటే అదేపనిగా వచ్చాను, పర్యావరణ ప్రేమికులు మా మానవుల్లో కూడా చాలామంది ఉన్నారు”
”సెహభాష్‌ కిషన్‌ మానవా, మీరైనా కష్టపడి ఈ భూమితల్లిని కాపాడుకొండి, అందుకు అడవులను కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం.
”దీన్ని కూడా రాజకీయం చేసి మావోళ్ళు తాము పండగ చేసుకుంటున్నారు అడవితల్లీ. తాము ఉన్నప్పుడు ప్రాజెక్టులకని, రోడ్లకని చెట్లు కొట్టేసినోళ్లే ఇప్పుడు పర్యావరణ సమ్రక్షకుల్లా మాట్లాడుతున్నారు”
”వాళ్లు చేయాలనుకున్నది పర్యావరణ పరిరక్షణ కాదు, తమ రాజకీయ పరిరక్షణ అని నాకెప్పుడో అర్థమయింది. పర్యావరణానికై అరుంధతీరారు లాంటి వాళ్లు ఉద్యమాలు చేస్తూనే ఉన్నా సామాన్య ప్రజలు ఒక జట్టుగా దిగితే కాని నన్ను, పర్యావరణాన్ని రక్షించలేరు. గంగా నదిలో శవాల గురించి కాకుండా ఇతర విషయాలను దేశభక్తులు మాట్లాడుతున్నారు. నీకవన్నీ ఎరుకేకద కిషనా”
”అవునమ్మా. కెనడాలో ఒక్కో మనిషికి తెమ్మిదివేల చెట్లు, రష్యాలో నాలగువేల ఐదువందలు, ఆస్ట్రేలియాలో మూడు వేలపైన, బ్రెజిల్లో ఒక వేయి ఐదువందలు, అమెరికాలో ఏడువందలపైన ఇలా ఉంది పరిస్థితి. మనదేశంలో మనిషికి ఇరవై ఎనిమిది చెట్లే ఉన్నాయమ్మా. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, ప్రజలు అందరూ కదిలి చెట్లు పెంచితే మనం కెనెడాను కూడా దాటచ్చు అంత స్థలముంది”
”స్థలాల కోసం, రాష్ట్రాల్లో అధికారాల కోసం నిత్యం పోట్లాడుకునే మీనాయకులకు అంత తెలివి ఉందంటావా?”
”అవునమ్మా, అనుమానమే!!??”
”పొలాల్లోకి ఏనుగులు రావడం మామూలే, ఈమధ్య ఇంట్లోకి, వీధుల్లోకి సింహాలు, పులులు కూడా వస్తున్నాయి. ఎందుకిదంతా. వాటికున్న అడవి వాటికుంటే అవెందుకొస్తాయి చెప్పు?”
”బాగా చెప్పావు అడవి తల్లీ, బుద్ధొచ్చింది”
”బుద్ధి రావలసింది అందరికీ, పాలకులతో సహా, వాళ్లు ఏ పార్టీ వాళ్లయినా సరే”
”అవును అడవి తల్లీ, ఈమాట వంద శాతం నిజం”
”అసలు భూమంటూ ఒకటుంటే కద మనుషులుండేది. మనుషులుంటేనే కద ప్రభుత్వాలు ఉండేది. ఈ చెట్లు, తరువాత నీళ్లు భూమి మీద లేకుండా పోతే మనుషుల మనుగడే ప్రశ్నార్ధకమై పోతుంది. అందుకే కళ్లు తెరవండి”.

– జంధ్యాల రఘుబాబు, 9849753298

Spread the love