ఇరాన్ విషయంలో ట్రంప్ వైఖరిపై నెతన్యాహూ కినుక
బీటలు వారుతున్న అమెరికా‘ఇజ్రాయిల్ స్నేహబంధం
శాంతి ఒప్పందంలో దక్కని చోటు
జెరుసలేం డిమాండ్లను పట్టించుకోని ట్రంప్
జెరుసలేం : ఇజ్రాయిల్-అమెరికా దళాలు ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఏకకాలంలో యుద్ధ విమానాలతో దాడి చేసినప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు ఒకరి ‘చారిత్రక నిర్ణయా’న్ని మరొకరు ప్రశంసించుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహబంధం ఇంతకుముందు ఎన్నడూ ఇంత బలంగా లేదని నెతన్యాహూ ఇజ్రాయిల్ ప్రజలకు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ స్నేహబంధం బీటలు వారినట్లు కన్పిస్తోంది. ఇరాన్‌పై యుద్ధం మొదలై మూడు నెలలు గడిచిపోయాయి. ఇరాన్‘అమెరికా మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో దౌత్య యత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటిలో నెతన్యాహూకు ఎలాంటి పాత్ర లేకుండా పోయింది. ఈ ప్రక్రియ నుంచి ఆయనను పూర్తిగా పక్కకు నెట్టేసినట్లే కన్పిస్తోంది.
శాంతి ఒప్పందంపై కలవరపాటు
ట్రంప్ చర్యలను నెతన్యాహూ జీర్ణించుకోలేకపోయినప్పటికీ ఆయనను బహిరంగంగా విమర్శించకుండా సంయమనం పాటిస్తున్నారు. అయితే యుద్ధాన్ని ముగించడానికి అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలపై ఇజ్రాయిల్ ఎలాంటి ప్రభావం చూపలేకపోతోందని ఆయన వాపోతున్నారని ఇజ్రాయిల్ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌లో కాల్పుల విరమణను ప్రకటించినప్పుడు దానిని నెతన్యాహూ తప్పుపట్టారు. ఇరాన్‌పై నిరంతరం ఒత్తిడి తెచ్చినప్పుడే అది పతనమవుతుందని ఆయన వాదించారు. ఇరాన్‌పై పూర్తి స్థాయిలో సైనిక చర్యను ప్రారంభించాలని ట్రంప్‌పై పదేపదే ఒత్తిడి తెచ్చారు. అయితే వైట్‌హౌస్ మాత్రం దౌత్యం వైపే మొగ్గు చూపింది. అమెరికా-ఇరాన్ మధ్య కుదరబోయే ఒప్పందం టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయిల్‌కు ఆందోళన కలిగిస్తున్న ఇరాన్ యురేనియం నిల్వలు, దాని బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, ప్రాంతీయ ప్రాక్సీ నెట్‌వర్క్ వంటి అంశాలకు ఈ ఒప్పం దం చాలా వరకూ ఎలాం టి పరిష్కారాలు చూపడం లేదని ఆ వర్గాలు చెప్పా యి.ఈ పరిణామం సహ జంగానే నెతన్యాహూను కలవరపెడుతోంది.
అది చెడ్డ ఒప్పందం
‘ట్రంప్ ఒక చెడ్డ మధ్యంతర ఒప్పందం చేసుకో వడం నిజంగా ఆందోళన కలిగి స్తోంది. ఇరాన్ తన వద్ద ఉన్న యురే నియ నిల్వలను తొలగిస్తే మంచిదే. కానీ అది కేవలం ప్రకటనకే పరిమితమైతే ఇరాని యన్లు అమెరికన్లను మభ్యపెట్టి చివరికి యురేనియం నిల్వలను తొలగించకపోవచ్చు’ అని ఇజ్రాయిల్ అధికారి ఒకరు సీఎనఎన్ వార్తా సంస్థతో అన్నారు. అమెరికాతో ప్రస్తుతం జరుగుతున్న చర్చలలో యురేనియం నిల్వల తొలగింపు ప్రస్తావనే లేదని ఇరాన్ పదేపదే చెబుతోంది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు ఇరాన్ అప్పగించాలని చెబుతూ వచ్చిన ట్రంప్ తాజాగా కొంత వెసులుబాటును సూచించారు. ట్రంప్ తాజా వైఖరి అణ్వాయుధాల తయారీకి ఇరాన్‌కు దారి చూపుతుందని ఇజ్రాయిల్ ఆందోళన చెందుతోంది.
చర్చల్లో ప్రతినిధులపై ఆగ్రహం
లెబనాన్‌లో కాల్పుల విరమణ పాటించాలని, దానిని ఒప్పందంలో చేర్చాలని ఇరాన్ పట్టుపట్టడం ఇజ్రాయిల్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇజ్రాయిల్ దూకుడుకు అమెరికా ఇప్పటికే కళ్లెం వేసింది. ఇజ్రాయిల్ దళాలపై, ఉత్తర సరిహద్దు ప్రాంతాలపై హెజ్బొల్లా డ్రోన్ దాడులను ఉధృతం చేసింది. లెబనాన్‌పై చర్యలను తీవ్రతరం చేయాలని నెతన్యాహూ ఇటీవల తన సైన్యాన్ని ఆదేశించారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులు, మిత్రపక్షాలు సైతం సైనిక చర్యకు మద్దతు తెలిపాయి. అయితే ట్రంప్ ఒత్తిడికి నెతన్యాహూ తలవంచడాన్ని ఆ పార్టీలు తప్పుపడుతున్నాయి. ట్రంప్‌ను చర్చల ప్రతినిధులు జేర్డ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్ తప్పుదోవ పట్టించి దౌత్యం వైపు లాగుతున్నారని నెతన్యాహూ ఆరోపిస్తున్నారు. నెతన్యాహూ అనుకూల మీడియాలో చర్చల ప్రతినిధులకు వ్యతిరేకంగా కథనాలు వండి వారుస్తున్నారు. నెతన్యాహూ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ట్రంప్ రంగంలోకి దిగారు. ఇజ్రాయిల్‌తో సంబంధాలను నెలకొల్పుకోవాలని, అబ్రహం ఒప్పందాలలో చేరాలని సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలను ఆయన కోరారు. అయితే వాటి నుంచి సానుకూల స్పందన రాలేదు.
ట్రంప్ మమ్మల్ని బలిపశువును చేశారు
ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి దాని చమురు కేంద్రాలపై పెద్ద ఎత్తున దాడి చేయాలని అమెరికాపై నెతన్యాహూ ఒత్తిడి తెస్తున్నారు. ‘ఇరాన్ ఓడరేవులపై అమెరికా కనుక దిగ్బంధాన్ని ఎత్తివేస్తే…అది చెడ్డ ఒప్పందంలో భాగమైతే…ఘోరం జరిగిపోతుంది. ఇరాన్ బలోపేతమవుతుంది’ అని ఇజ్రాయిల్ అధికారి చెప్పారు. ఈ ఒప్పందం సైనికులకు, పోలీసులకు జీతాలు చెల్లించలేని స్థితికి ఇరాన్‌ను తీసుకురావడానికి బదులు దానికి నిధులు అందించి ఆర్థికంగా పుంజుకునేందుకు సాయపడుతుందని వాపోయారు. ‘ట్రంప్ మమ్మల్ని బలిపశువులను చేశారు. ఇంతకంటే పరిస్థితి ఇంకెలా ఉంటుంది’ అని కొందరు మండిపడుతున్నారు.



