మారాం చేయ‌కుండా తినాలి అంటే..?

It means that you should eat it without changing it..?ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలని అందరికీ ఉంటుంది. మరీ ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు పోషకాలతో కూడిన ఆహారం చాలా అవసరం. అయితే వాళ్లకు కంటికి ఇంపుగా, నోటికి రుచిగా ఉంటేనే తింటారు. లేదంటే తిండంటేనే మారాం చేస్తారు. అందుకు వాళ్ల కోసం కాస్త ప్రత్యేకంగా, ఆరోగ్యవంతమైన ఆహారం ఏం పెట్టాలా అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. అలాంటి వారు వీటిని ట్రై చేయవచ్చు. పిల్లలు ఎంచక్కా మారాం చేయకుండా ఈ పోషకాల ఆహారాన్ని తినేస్తారు.
పల్లీ అటుకుల లడ్డు
కావాల్సిన పదార్థాలు: పల్లీలు – 1 కప్పు, అటుకులు – అర కప్పు, నువ్వులు – అర కప్పు, సన్నగా తురిమిన బెల్లం – 1 కప్పు, యాలకుల పొడి – 1 టీస్పూన్‌
తయారీ విధానం: ఇందుకోసం ముందుగా స్టౌపై ఇనుప కడాయి పెట్టుకొని పల్లీలను వేసి లో ఫ్లేమ్‌ మీద బాగా వేయించుకోవాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మందపాటి అటుకులు వేసి వీటిని కూడా లో ఫ్లేమ్‌ మీదనే కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత నువ్వులు వేసుకొని వాటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నీళ్లు చల్లుకొని కలుపుతూ లో ఫ్లేమ్‌ మీద వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే నువ్వులు గుల్లగా, చక్కగా వేగుతాయి. వేయించుకున్నాక వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే వేయించుకున్న ఇంగ్రీడియంట్స్‌ అన్నీ చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. అయితే లడ్డూల రుచి మీరు పదార్థాలను వేయించుకునే తీరుని బట్టే ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌ తీసుకొని అందులో వేయించుకున్న అటుకులు వేసి మెత్తని పొడిలా గ్రైండ్‌ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మరో మిక్సీ జార్‌ తీసుకొని ముందుగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను వేసి కాస్త బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో వేయించిన నువ్వులను వేసి మిక్సీ పట్టుకోవాలి. అదే మిశ్రమంలో సన్నగా తురుమిన బెల్లం వేసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్‌ బౌల్‌ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న బెల్లం మిశ్రమం, అటుకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలా గట్టిగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ చేతితో గట్టిగా లడ్డూ మాదిరిగా చుట్టుకోవాలి. ఒకవేళ ఎంత ట్రై చేసినా లడ్డూలు రానట్లయితే చేతులను కొద్దిగా తడిచేసుకుంటూ లడ్డూలను చుట్టుకోండి పర్ఫెక్ట్‌గా వస్తాయి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే ‘పల్లీ అటుకుల లడ్డూలు’ రెడీ! వీటిని గాలి చొరబడని డబ్బాలో స్టోర్‌ చేసుకుంటే కనీసం 10 నుంచి 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి.
రాగి ఉప్మా
కావాల్సిన పదార్ధాలు: ఒక కప్పు రాగి పిండి, 2 టేబుల్‌ స్పూన్ల నూనె, ఒక టీ స్పూన్‌ శనగపప్పు, ఒక టీ స్పూన్‌ మినపప్పు, ఒక టేబుల్‌ స్పూను పల్లీలు, అర టీ స్పూన్‌ ఆవాలు, అర టీ స్పూన్‌ జీలకర్ర, చిటికెడు ఇంగువ, 2 రెబ్బల కరివేపాకులు, కొద్దిగా తరిగిన అల్లం, ఒక ఉల్లిపాయ తరుగు, 6 పచ్చిమర్చి, పావు టీ స్పూన్‌ పసుపు, ఒక టీ స్పూన్‌ ఉప్పు, అర కప్పు తురిమిన పచ్చికొబ్బరి, ఒక టీ స్పూన్‌ నెయ్యి.
తయారీ విధానం: ముందుగా ఓ గిన్నెలో రాగి పిండి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి మరీ చపాతీ పిండిలా కాకుండా కలిపి పక్కనపెట్టుకోవాలి. తర్వాత ఓ స్టీమ్‌ ప్లేట్‌ను నూనెతో రాసి రాగి పిండి మిశ్రమాన్ని సమానంగా పరుచుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆన్‌ చేసి స్టీమర్‌లో (ఇడ్లీ పాత్ర లాంటిది) నీళ్లు పోసుకుని స్టీమ్‌ ప్లేట్‌ను అందులో పెట్టి పది నిముషాలు రాగి పిండిని ఆవిరిపై ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత స్టీమర్‌ దించేసి రాగిపిండి మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకొని పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఓ కడాయిని స్టౌపై పెట్టి నూనె పోసి వేడి చేసుకుని శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి. పప్పులు కాస్త రంగు మారిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువా, కరివేపాకు, సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్క వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఉల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిగడ్డ కాస్త మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత తురిమిన పచ్చికొబ్బరి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న రాగి పిండి మిశ్రమం వేసి రెండు నిమిషాలు కలిపి దించేసుకుంటే ఎంతో టేస్టీ అండ్‌ సింపుల్‌ రాగి ఉప్మా రెడీ!
మిల్లెట్స్‌ లడ్డు
కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కొర్రలు, ఒక కప్పు రాగులు, ఒక కప్పు సజ్జలు, ఒక కప్పు అరికలు, ఒక కప్పు సామలు, ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు బార్లీ, ఆరు కప్పుల తురిమిన బెల్లం, కొద్దిగా యాలకుల పొడి, వేయించడానికి సరిపడా నెయ్యి, పావుకప్పు జీడిపప్పు.
తయారీ విధానం: ముందుగా స్టౌ ఆన్‌ చేసి ప్యాన్‌ పెట్టి అందులో నెయ్యి వేడి చేసి జీడిపప్పును దోరగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్‌లో కొర్రలు, రాగులు, సజ్జలు, అరికలు, సామలు, పెసరపప్పు, బార్లీలను ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేయించుకొని చల్లార్చి పక్కకు పెట్టాలి. ఆ తర్వాత వీటన్నింటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇందులోనే తురిమిన బెల్లం కూడా వేసి మళ్లీ గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని.. అందులో వేయించిన జీడిపప్పు, కరిగించిన నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. అనంతరం అరచేతులకు నెయ్యి రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా తయారైన లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే సుమారు 2-3 వారాల పాటు నిల్వ ఉంటాయి.
మిల్లెట్‌ నూడుల్స్‌
కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి – 75 గ్రాములు(అర కప్పు), పెసరపప్పు పిండి – 30 గ్రాములు, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – తగినంత, సన్నని వెల్లుల్లి తరుగు – 1 టీస్పూన్‌, సన్నని క్యాప్సికం ముక్కలు – 30 గ్రాములు, ఉల్లి తరుగు – 30 గ్రాములు, క్యాబేజీ తరుగు – 50 గ్రాములు, క్యారెట్‌ తరుగు – 50 గ్రాములు, బీన్స్‌ తరుగు – 50 గ్రాములు, మిరియాల పొడి – రుచికి సరిపడా, మసాలా పొడి – కొద్దిగా, సోయా సాస్‌ – పావుటీస్పూన్‌, స్ప్రింగ్‌ ఆనియన్స్‌ తరుగు – కొద్దిగా.
తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్‌ బౌల్‌లో జొన్నపిండి, పెసర పిండి వేసుకొని చక్కగా మిక్స్‌ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని అరకప్పు వాటర్‌, చిటికెడు ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి. వాటర్‌ మరిగాయనుకున్నాక అందులో ముందుగా కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్‌ మీద బాగా కలిపి దింపుకోవాలి. పిండి కాస్త చల్లారాక చేతితో చపాతీ పిండి మాదిరిగా బాగా కలిపి దానిపై కాస్త ఆయిల్‌ అప్లై చేసి మూతపెట్టి గంటన్నర నుంచి 2 గంటలపాటు అలా వదిలేయాలి. తర్వాత పిండిని మరోసారి సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని అందులో నూడుల్స్‌ మాదిరిగా వచ్చే సన్నని అచ్చును ఉంచి లోపల ఆయిల్‌ అప్లై చేసుకోవాలి. దానిలో కలిపి పెట్టుకున్న పిండిని ఉంచాలి. ఇప్పుడు ఒక పొడవాటి ప్లేట్‌ తీసుకొని దానిపై కాస్త ఆయిల్‌ అప్లై చేసుకోవాలి. అనంతరం మురుకుల గొట్టం తీసుకొని లైన్‌గా నూడుల్స్‌ని వత్తుకోవాలి. అలా వత్తుకున్న నూడుల్స్‌పై కొద్దిగా నూనె రాసుకొని స్టీమర్‌లో పెట్టి పావుగంట పాటు ఉడికించుకోవాలి. స్టీమర్‌ లేనివారు స్టౌపై పెద్ద గిన్నెలో స్టాండ్‌ ఉంచి, దానిపై నూడుల్స్‌ వత్తుకున్న ప్లేట్‌ ఉంచి అవి మంచిగా ఉడికే వరకు స్టీమ్‌ చేసుకున్నా సరిపోతుంది. ఆవిధంగా ఉడికించుకున్నాక నూడుల్స్‌ని బయటకు తీసి మరోసారి వాటిపై కొద్దిగా నూనె అప్లై చేసుకొని చలార్చుకోవాలి. ఉల్లిగడ్డ, క్యారెట్‌, క్యాప్సికం, క్యాబేజీ, బీన్స్‌ని పొడవుగా, సన్నని ముక్కలుగా కట్‌ చేసుకొని పక్కనుంచాలి. ఇప్పుడు స్టౌపై పాన్‌ పెట్టుకొని కొద్దిగా ఆయిల్‌ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక వెల్లుల్లి తరుగు వేసి వేయించుకోవాలి. వేగాక ముందుగా కట్‌ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, క్యాబేజీ, క్యారెట్‌, క్యాప్సికం, బీన్స్‌ వేసుకొని మీడియం ఫ్లేమ్‌ మీద రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆవిధంగా వేయించుకున్నాక అందులో ముందుగా ప్రిపేర్‌ చేసుకున్న నూడుల్స్‌ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, మసాలా పొడి, సోయా సాస్‌ యాడ్‌ చేసుకొని ఎగరేస్తూ కాసేపు వేయించాలి. చివరిలో స్ప్రింగ్‌ ఆనియన్స్‌ తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. ‘మిల్లెట్‌ నూడుల్స్‌’ రెడీ!

Spread the love