Sunday, May 24, 2026
E-PAPER
Homeహెల్త్కొబ్బరికాయ కొడితే పాస్‌ అవుతానా?

కొబ్బరికాయ కొడితే పాస్‌ అవుతానా?

- Advertisement -

ఇప్పటి పిల్లలు ప్రశ్నలు అడుగుతున్నారు. ఆలోచిస్తున్నారు. అదే సమయంలో మనం పెద్దలుగా వారికి ఇస్తున్న కొన్ని సమాధానాలు.. ముఖ్యంగా ‘భక్తి’ పేరుతో వారి ఆలోచనలను మెల్లగా మూసివేస్తున్నామా.. అనిపిస్తోంది.

ఒక చిన్న సంఘటన: పరీక్షకు వెళ్లే ముందు ఒక పిల్లవాడు తన అమ్మను అడిగాడు… ”అమ్మా.. పరీక్ష నేను రాయాలి కదా! మరి నువ్వు దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నావ్‌?”
అమ్మ సమాధానం: అది భక్తి బాబూ..
పిల్లవాడు మళ్లీ అడిగాడు… ”అంటే నేను చదవకపోయినా కొబ్బరికాయ కొడితే పాస్‌ అవుతానా?” ఈ అమాయక ప్రశ్నలోనే ఒక పెద్ద సామాజిక మానసిక సమస్య దాగి ఉంది. భక్తి నుండి మూఢ విశ్వాసం వరకు.
మన సంస్కృతిలో భక్తి ఒక గొప్ప విలువ. కానీ, భక్తిని భయంతో, కారణం తెలియకుండా పిల్లలకు నేర్పితే.. అది ‘మూఢ విశ్వాసం’గా మారుతుంది. ఇప్పుడు మనం పిల్లలకు చెప్పే మాటలు గమనించాలి.
‘ఇలా చేస్తే దేవుడు శిక్షిస్తాడు..’, ‘ఈ పూజ చేస్తేనే ఎగ్జామ్‌ పాస్‌ అవుతావు’… ఇవి వినిపించడానికి చిన్న మాటలే అనిపించినా, పిల్లల మైండ్‌లో పెద్ద మార్పులను కలిగిస్తాయి.

సైకాలజికల్‌ కోణంలో సమస్య
భయ ఆధారిత ప్రవర్తన (Fear Conditioning) : పిల్లలు మంచి పనులు చేయడానికి కారణం ‘మంచి’ కాదు.. ‘శిక్ష పడకూడదు’ అనే భయం వల్ల. ఇది మనం బయట చూస్తున్న ఒక చిన్న ఉదాహరణతో అర్థమవుతుంది:
సిసిటివి కెమెరా ఉన్నప్పుడు మాత్రమే ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించే వారు.. అదే విధంగా, పిల్లలు కూడా ‘దేవుడు చూస్తున్నాడు”అనే భయంతో మాత్రమే ప్రవర్తిస్తారు.
షార్ట్‌కట్‌ మైండ్‌సెట్‌ (Instant Gratification Bias) : పరీక్ష ముందు ఒక చిన్న సన్నివేశం:
పిల్లాడు: అమ్మా పెన్‌ ఇవ్వు. అమ్మ: ఓ.. ముందు పూజ పూర్తి చేద్దాం!
ఇంకొక పిల్లాడు ఇలా అంటాడు: ”రెండు గంటలు చదవడం కంటే.. రెండు నిమిషాల ప్రార్థన బెటర్‌ కదా!”… ఈ భావన కష్టాన్ని తగ్గించి, ఫలితాలపై అనవసరమైన ఆశలను పెంచుతుంది.

బాధ్యతను బయట పెట్టడం(External Locus of Control):పరీక్షలో ఫెయిల్‌ అయితే ‘నేను చదవలేదు’ అని కాకుండా.. ‘దేవుడు సహాయం చేయలేదు’ అనుకోవడం ప్రమాదకరమైన మానసిక ధోరణి. ఎందుకంటే ఇది పిల్లల్లో స్వీయ బాధ్యతను తగ్గిస్తుంది.
ఒక సరదా వ్యాఖ్య ఇక్కడ గుర్తుకు వస్తుంది: ”దేవుడు కూడా అనుకుంటున్నాడేమో ‘బాబూ… నేను సిలబస్‌లో లేను కదా!’ అని.
అనుకరణ ద్వారా మూఢ నమ్మకాల వ్యాప్తి (Observational Learning) : పిల్లలు చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు చేసే ప్రతి ఆచారం, ప్రతి నమ్మకం.. అది ఎందుకు చేస్తున్నారో తెలియకపోయినా వారు అనుకరిస్తారు.
ఒక చిన్నారి అడిగిన ప్రశ్న: ”అమ్మా.. దేవుడికి వాట్సాప్‌ ఉంటే.. నేను హోమ్‌వర్క్‌ ఫొటో పంపించేవాడిని!”. ఇది వినడానికి సరదాగా అనిపించినా, పిల్లలు భక్తిని కూడా ఒక ‘షార్ట్‌కట్‌ సిస్టమ్‌’గా చూడటం ప్రారంభిస్తున్నారనే సంకేతం. భక్తి తప్పా? కాదు.. కానీ ఇక్కడ ఒక స్పష్టత అవసరం. భక్తి తప్పు కాదు. భక్తి మనసుకు ఓదార్పు. అది మనలో ధైర్యాన్ని పెంచుతుంది. కానీ… భక్తి + బుద్ధి = సమతుల్యం, భక్తి + భయం = మూఢ విశ్వాసం.
తల్లిదండ్రుల బాధ్యత : పిల్లల భవిష్యత్తు మన మాటలలోనే, మన ప్రవర్తనలోనే దాగి ఉంటుంది.
– ‘దేవుడు శిక్షిస్తాడు’ అనడం కాకుండా ‘ఇది మంచిది కాబట్టి చేయాలి’ అని చెప్పాలి.
– ‘పూజ చేస్తే పాస్‌ అవుతావు’ కాకుండా ‘చదువు+శ్రమ వల్లే విజయం వస్తుంది’ అని నేర్పాలి. ముఖ్యంగా పిల్లలు అడిగే ‘ఎందుకు?’ అనే ప్రశ్నను ఆపకూడదు. ఫ్యాన్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తే వెంటనే తిరుగుతుంది. ఆఫ్‌ చేస్తే కొంతసేపటికి ఆగుతుంది. అలాగే జీవితంలో సమస్యలు కూడా… ఒక్క పూజతో, ఒక్క నమ్మకంతో వెంటనే పరిష్కారం కావు. అవి ఓపిక, కష్టం, సమయంతోనే పరిష్కారం అవుతాయి.
ఒక చిన్న మాట : మన పిల్లలకు మనం ఇవ్వాల్సింది భయం కాదు బాధ్యత. మూఢ విశ్వాసం కాదు.. ఆలోచించే శక్తి. అప్పుడు వారు తమ జీవితాన్ని స్వయంగా నిర్మించుకుంటారు. అందుకే ‘కొబ్బరికాయ కొట్టడం కన్నా.. కష్టం పడడం నేర్పుదాం.’

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -