Thursday, July 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమరమ్మతులకు వెళ్తే… మొత్తం కూలే ప్రమాదం

మరమ్మతులకు వెళ్తే… మొత్తం కూలే ప్రమాదం

- Advertisement -

కాళేశ్వరంపై ప్రభుత్వానికి దురుద్దేశం లేదు
ప్రజాభవన్‌‌లో మంత్రి ఉత్తమ్‌ ‌పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రెజెంటేషన్‌
ఎన్‌డీఎస్‌ఏ చెప్పినట్టే చేస్తాం
ఎల్‌‌నినోకు కాళేశ్వరంను ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారు
కేసీఆర్‌‌ది ఆర్థిక ఉగ్రవాద కుటుంబం ఆయన లేఖ రాస్తే మేడిగడ్డపై ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం
ప్రభుత్వాన్ని ఒప్పిస్తే మూడేండ్లు ఆయనకే కాంట్రాక్ట్‌ ఇస్తాం
బీఆర్‌ఎస్‌ ‌తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టండి: ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్‌‌రెడ్డి పిలుపు

నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
ఎల్‌‌నినో పేరు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ ‌నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టి, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వివరించాలని ముఖ్య మంత్రి ఎనుములు రేవంత్‌‌రెడ్డి కాంగ్రెస్‌ ‌శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని ప్రజాభవన్‌‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి, సంబంధిత అధికారులు కాళేశ్వరంపై పవర్‌‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ప్రాజెక్టును సరిదిద్దే ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే ఎనలేని నష్టం వాటిల్లుతుందని హెచ్చరిం చారు. దీనిపై కనీస అవగా హన లేకుండా బీఆర్‌ఎస్‌ ‌నాయకులు కేటీఆర్‌, హరీశ్‌‌రావు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘కేసీఆర్‌ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడకూడదు. రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులు గోదావరి పాలు కాకూడదు. మూడు బ్యారేజీలతో ఉపయోగముంటే… రాత్రింబవళ్లు అక్కడే ఉండి పూర్తి చేసేవాళ్లం. నిజంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అసహనంగా ఉన్నాం…’ అని సీఎం వివరణ ఇచ్చారు. కాళేశ్వరంపై చేసిన రూ.97 వేల కోట్ల అప్పులో ఇప్పటి వరకు 33,574.11 కోట్లు తిరిగి చెల్లించామని చెప్పారు. 30 నెలల్లో తమ ప్రభుత్వం 1.80 లక్ష‍ల కోట్లు అప్పుచేయగా, రూ.2.08లక్ష‍ల కోట్లను తిరిగి చెల్లించామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారి హయాంలో చేసిన ‌రూ.8లక్ష‍ల కోట్ల అప్పును వారసత్వంగా ప్రజా ప్రభుత్వానికి అప్పగించిందని గుర్తుచేశారు. అయినా వారు ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్ని ఆపలేదన్నారు. షాదిముబారక్‌, కళ్యాణలక్ష్మి, రైతు భరోసాతో పాటు పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500 గ్యాస్‌ ‌మొదలగు కొత్త పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

కమీషన్ల కోసమే రీ డిజైనింగ్‌
వైఎస్‌ ‌రాజశేఖర్‌‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రూ.38 వేల కోట్లతో ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కమీషన్ల కోసమే కేసీఆర్‌ ‌రీ డిజైన్‌ ‌చేసి రూ.81 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. ఆ తర్వాత ప్రాజెక్టు అంచనా రూ.1.47 లక్షల కోట్లకు పెరిగిందంటూ ‘కాగ్‌’ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై ఏర్పాటు చేసిన ‌రిటైర్డ్‌ ఇంజినీర్ల కమిటీ మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మించినా నిలబడదంటూ నివేదికనిచ్చిందని గుర్తు చేశారు. ఆ నివేదికను తుంగలో తొక్కి వాస్కోప్‌ ‌ద్వారా తనకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకున్నారని విమర్శించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు తన బ్రెయిన్‌ చైల్డ్‌ అని కేసీఆర్‌ చెప్పారు. ప్రారంభించిన ఏడాదిలోనే నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. మేడిగడ్డ వద్ద సీసీ బ్లాకులను సరి చేయాలని ఈఈ రమణారెడ్డి 2020లో రాసిన లేఖను పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మరమ్మతులు చేపట్టలేదని చెప్పారు. గోదావరి వరదకు 2022లో కన్నెపల్లి పంపుహౌస్‌లు మునిగాయి. పట్టించుకోకపోవడం వల్ల 2023లో కాళేశ్వరం పిల్లర్లు కూలాయి. బ్యారేజీల నిర్మాణానికి ముందు భూ పరీక్షలు చేయలేదు. ఇసుకమేటలపై నిర్మించడం వల్ల నిల్వ చేసిన నీటి ఒత్తిడికి బ్యారేజీ కుంగింది. నాలుగు పిల్లర్లు కుంగిపోతే ఏమవుతుందని కేసీఆర్‌ అంటున్నారు. గోదావరి జలాల ఎత్తిపోతలకు మేడిగడ్డ బ్యారేజీ వెన్నుపూస లాంటింది.

వెన్నుపూస దెబ్బతింటే చేసేదేమీ లేదు.. నీళ్లు అలా వస్తే.. ఇలా పోతాయి. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి మూడేండ్లలో కట్టిన కాళేశ్వరం కూలింది. వారం రోజులపాటు తమకు ప్రాజెక్టును అప్పగిస్తే నీరు నింపుతానని అంటున్నారు. మిడిమిడి జ్ఞానం ఉన్నవారిని పంపితే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నాణ్యత లోపం వల్ల కాళేశ్వరం కూలిందని ఎన్‌డీఎస్‌ఏ చెప్పింది. ఎవరెన్ని విమర్శలు చేసినా మేం మాత్రం గతంలో జరిగిన తప్పిదాలు చేయకుండా నిపుణుల సలహా మేరకే ముందుకెళ్తాం…’ అని సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు. ఎల్‌‌నినో పేరు చెప్పి ఉత్తర తెలంగాణ ప్రజలను బీఆర్‌ఎస్‌ ‌తప్పుదోవ పట్టిస్తున్నదని సీఎం విమర్శించారు. ఎల్‌నినో వల్ల వర్షాలే రాకపోతే.. వరదలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఉద్యమం పేరుతో ప్రజలను మభ్యపెట్టి బీఆర్‌ఎస్‌ ‌నేతలు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న కోదండరామ్‌, ప్రొఫెసర్‌ యాదగిరి వంటి వారిని దగ్గరకు రానివ్వలేదని గర్తు చేశారు. ‘తాటిచెట్టులా పెరిగితే సరిపోదు.. తలకాయలో గుజ్జు ఉండాలి. నీటిని ఎలా ఒడిసిపట్టాలో తెలియని వారు నీతులు చెబుతున్నారు. కేవలం కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును నిర్మించారు. కేసీఆర్‌ది ఆర్థిక ఉగ్రవాద కుటుంబం. ​నీరు నింపడం సాధ్యం కాదని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

ప్రత్యేక అసెంబ్లీకి సిద్ధం
‘కాళేశ్వరం అంశంపై కేసీఆర్‌ లేఖ రాస్తే ప్రత్యేక శాసనసభ ఏర్పాటు చేసి చర్చించేందుకు మేం సిద్ధం. ప్రాజెక్టును వారం రోజులు కాదు.. ఎల్‌ అండ్‌ టీ, కాంట్రాక్టర్లను తీసేసి మూడేండ్లు కాంట్రాక్టర్‌గా కేసీఆర్‌కే అప్పగిస్తాం. ఆయన వాదనలో బలం ఉంటే.. ఏ తప్పూ చేయకపోతే సభకు రావాలి. ఎప్పుడు కోరితే అప్పుడు స్పీకర్‌ను రిక్వెస్ట్‌ చేసి సభ పెడతా. వారు కోరుకున్నన్ని రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తాం. నిపుణులు, అడ్వకేట్‌ జనరల్‌ను సభకు పిలిచి జాయింట్‌ సెషన్‌ నిర్వహిద్దాం. కాళేశ్వరంపై ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చిద్దాం. స్పీకర్‌కు కేసీఆర్‌ లేఖ రాస్తే.. మేం కూడా లేఖ రాసి చర్చ పెట్టిద్దాం. ఆయన మాట్లాడేటప్పుడు చర్చకు అడ్డుపడకుండా సభ సజావుగా నడిపిస్తాం. నిపుణుల కంటే మంచిగా కేసీఆర్‌ చెబితే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది…’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -