పేదలకిస్తే ఉచితాలు…పెద్దలకిస్తే రాయితీలా?

Free for the poor...concessions for the elderly?ఉచితాలతో సోమరితనం పెరుగుతుందని అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఉచితాలంటే ఏమిటి? రాయితీల మర్మం ఏమిటి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. మరోవైపు రాష్ట్రంలో రాహుల్‌గాంధీ కులం ఏమిటి, మతం ఏమిటని బీజేపీ నాయ కులు ప్రశ్నించారు. వెలమలు ఎందరు? రెడ్లు ఎందరు? అన్న చర్చ మరొకరు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. ఉచితాలకు, కులగుణనకు ఉన్న సంబంధం కూడా పరిశీలించాలి. ఎరువులు, పురుగుమందుల మీద ఇచ్చే సబ్సిడీలు రైతులకు పెట్టుబడి భారం తగ్గిస్తాయి. విద్యుత్తు, మంచినీరు, రేషన్‌ సరుకుల మీద ఇచ్చే సబ్సిడీలు, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం పేద కుటుంబాల మీద భారం తగ్గిస్తాయి. వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు ఇచ్చే పింఛన్లు వారి రోజువారీ ఆదాయానికి తోడవుతాయి. ఎంతోకొంత కొనుగోలు శక్తి పెంచుతాయి. కేంద్ర బడ్జెట్‌కు ముందురోజు ప్రవేశపెట్టిన ఆర్థికసర్వే రిపోర్టు, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయినందువల్ల సరుకుల అమ్మకాలు తగ్గాయని చెప్పింది. ఉపాధి అవకాశాలు పడిపోయాయని, ధరలు పెరిగాయని, ఆహార సరుకుల ధరలు మరింత పెరిగాయని తేల్చింది. ఆర్థిక వ్యవస్థ మీద వీటి పర్యవసానాలు తీవ్రంగా ఉన్నాయని హెచ్చరించింది. రానున్న కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌ ఒడిదుడుకులు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించే పన్నులు మన ఎగుమతులకు ఆటంకాలు కానున్నాయని కూడా చెప్పింది. ఇప్పటికే మన ప్రధాని అమెరికా పర్యటనలో, పన్నులు పెంచి తీరుతామని మోడీ ముఖం మీదనే చెప్పారు ట్రంప్‌. అంటే సరుకులు దేశంలో అమ్ముడుపోవు. విదేశాల్లో అమ్ముకునే అవకాశాలూ తగ్గిపోతాయి. ఇది రానున్న ప్రమాదం. గత ఐదేండ్లుగా నెలసరి వేతన జీవులకు, స్వయం ఉపాధి కార్మి కులకు నిజవేతనాలు పడిపోయాయని ఆర్థిక సర్వే రిపోర్టు స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం వెచ్చించే ప్రతి రూపాయి ప్రజల కొనుగోలు శక్తి పెంచుతుంది. ధరల పెరుగుదలతో ప్రస్తుతం పేదల ఆదాయం తిండికే సరిపోతున్నది. పారిశ్రామిక సరుకులు కొనగల స్థితి లేదు. అందుకే పేదలకు ప్రభుత్వం ఏ రూపంలో ఆర్థిక సహాయం చేసినప్పటికీ అది బట్టలు కుట్టించుకోవడానికో, చెప్పులకో, టూత్‌ బ్రష్‌కో, టూత్‌ పేస్టుకో, ఆడపిల్లల బొట్టుబిళ్లలకో, పౌడర్‌ డబ్బాల కొనుగోళ్లకో ఉపయోగిస్తారు. ఇందుకు భిన్నంగా రాయితీల పేరుతో పాల కులు బడాబాబులకు లక్షల కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారు. ఫలితంగా వారి ఆస్తులు పెంచుకుంటున్నారే తప్ప పెట్టుబడులు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పించేవైపు వారి దృష్టి లేదు. ముఖేశ్‌ అంబానీ కొడుకు పెండ్లికి రూ.ఐదు వేల కోట్లు ఖర్చు చేశారు. పెండ్లికొడుకు ఉంగరం ఖర్చు 9.5కోట్లు. చేతి గడియారం విలువ 22కోట్లు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలను ఇలాంటి దుబారా ఖర్చులకు వినియోగిస్తున్నారు. ఈ డబ్బును పెట్టుబడిగా వినియోగిస్తే ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు, ఉత్పత్తి పెంచవచ్చు. అది స్థూల జాతీయోత్పత్తిని పెంచుతుంది. గతంలో మోడీ ప్రభుత్వం పది శాతం కార్పొరేట్‌ పన్ను తగ్గించడం ద్వారా ప్రభుత్వం వదులుకున్న ఆదాయం ఏటా రూ.ఒక లక్షా నలభైఐదు వేల కోట్లు. ఇది పెట్టుబడుల్లోకి రాలేదని, బడాబాబులు ఆస్తులు పెంచుకున్నారని తర్వాత తేలింది. రాయితీల పేరుతో వీరికిచ్చేవన్నీ ఉచితాలు కాదా? కార్మికులు కంపెనీల్లో, వ్యవసాయ కూలీలు భూమి మీద పని చేస్తారు. యజమానులు వీరికి తగిన వేతనం చెల్లించటంలేదు. ఫలితంగా వారి ఆదాయం తిండి ఖర్చుకే సరిపోవడంలేదు. వీరికి కనీసం నెలకు రూ.26 వేలు వేతనం చెల్లించాలని ఆదేశించడానికి పాలకులు సిద్ధంగా లేరు. ప్రభుత్వం సహాయం చేయవలసింది ఈ పేదలకు. కానీ యజమానులకే రాయితీలిస్తున్నది ప్రభుత్వం. సమాజంలో సరుకులు బడాబాబులు మాత్రమే కొంటే సరిపోదు. ప్రజలందరూ కొనుగోలు చేసినపుడే ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుంది. అంబానీ అయినా, అదానీ అయినా, కార్మికుడైనా, వ్యవసాయ కార్మికుడైనా ఒక మనిషి వాడేది ఒక సబ్బు, ఒక టూత్‌ పేస్టు, ఒక టూత్‌ బ్రష్‌. 143కోట్ల మంది ప్రజలకు ఆర్థిక సహాయం అందితే 143కోట్ల సబ్బులు, బ్రష్‌లు, పేస్టులు అమ్ముడవుతాయి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈమాత్రం సోయి లేని పాలకులు కష్టం చేసేవారికి ఇచ్చే సబ్సిడీలు, సహాయాలను ఉచితాల పేరుతో ఈసడించుకుంటూ లాభాలు పీల్చే జలగల్లాంటి బడాబాబులకు మాత్రం రాయితీలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాడే ప్రతి మాటా, చేసే ప్రతి వ్యాఖ్య ఆచితూచి చేయటం అవసరం. న్యాయమూర్తులు చెప్పే మాటల ప్రభావం సమాజం మీద ఎక్కువగా ఉంటుంది. బాధ్యతారహిత పాలకులు న్యాయమూర్తుల వ్యాఖ్యలను దుర్వినియోగం చేస్తారు.
కుటుంబ ఆదాయంలో విద్య, వైద్యం, ఇంటి కిరాయిలకే మూడొంతులు పోతున్నది. మిగిలిన పావు వంతు మాత్రం ఇతర కుటుంబ అవసరాలకు వెచ్చించవలసి వస్తున్నది. ప్రభుత్వం విద్య, వైద్యం ఉచితంగా అందిస్తూ, అందరికీ ఇంటి సౌకర్యం, చవకగా ప్రయాణ సౌకర్యం, కనీస వేతనాలు, ఉపాధి అవకాశాలు, రైతులకు మద్దతు ధర కల్పించి సార్వత్రిక ప్రజాపంపిణీ వ్యవస్థను అమలు జరిపితే ఎవరూ ఇన్నిరకాల సంక్షేమ పథకాలు కోరుకోరు. కానీ ప్రయివేటీకరణ పేరుతో ప్రభుత్వం వీటిని కార్పొరేట్‌ సంస్థలకు వదిలేసింది. దీని ఫలితమే పెరుగుతున్న ఆర్థిక అసమానతలు. కొనుగోలు చేసే ప్రతి సరుకు మీదా సాధారణ ప్రజలు పన్ను కడుతున్నారు. నిజానికి ప్రభుత్వానికి అందు తున్న పన్ను ఆదాయంలో అత్యధిక భాగం సాధారణ ప్రజలు చెల్లించేదే. పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లు ఏది చెపితే అదే సిద్ధాంతం అవుతున్నది. బడాబాబులకు ఏది లాభం అనుకుంటే అదే వీరు చెపుతున్నారు. అవే పాలకుల విధానాలు అవుతున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వరంగ సంస్థలు, సహకార రంగం, సంక్షేమ రాజ్యం అన్న నినాదాలు ఇట్లా వచ్చినవే. నిజానికి సంక్షేమ పథకాల పేరుతో పెద్దఎత్తున ప్రభుత్వం ఖర్చు పెట్టాలని పెట్టుబడిదారీ ఆర్థికవేత్త జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ చెప్పారు. అందుకే దీన్ని ‘కీనిషియన్‌ సిద్ధాంతం’ అంటారు. సంక్షేమ పథకాలు, నిరుద్యోగ భృతి, ఆహార సబ్సిడీ, ధరల స్థిరీకరణ తదితర పేర్లతో ప్రభుత్వం జోక్యం చేసుకుని పెద్ద ఎత్తున ఖర్చు చేయాలన్నాడు. ఆదాయాన్ని బట్టి పన్ను విధించాలన్నాడు. 70వ దశకంలో ప్రారంభమైన సంక్షేమ పథకాలన్నీ ఈ సిద్ధాంతం పర్యవసానమే. ప్రపంచబ్యాంకు, ఐఎమ్‌ఎఫ్‌ల ఏర్పాటుకు సహకరించిన ఆర్థికవేత్త కీన్స్‌. ఆ ప్రపంచబ్యాంకు విధానాలే ఇప్పుడు మన దేశాన్ని వెన్నాడుతున్న విషయాన్ని చూస్తున్నాం. బడాబాబుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వరంగం, సహకార రంగం స్థానంలో ఇప్పుడు ప్రయివేటీకరణ తెచ్చారు. సంక్షేమ రాజ్యం స్థానంలో మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ అన్నారు. సంక్షేమ పథకాలను ఉచితాలని హేళన చేస్తున్నారు. వీటితో ప్రజల కొనుగోలుశక్తి తగ్గి ఆర్థిక వ్యవస్థలు చితికిపోయాయి. ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజల్లో అశాంతి ప్రబలింది. ఇప్పుడు ఈ బడాబాబుల సమర్ధకులే ప్రపంచబ్యాంకు రూపంలో ప్రజల సంక్షేమం, సమ్మిళిత అభివృద్ధి పేరుతో సుద్దులు వల్లిస్తున్నారు. అంటే బడాబాబుల ప్రయోజనాల కోసం అవసరమైనపుడు సంక్షేమ పథకాలనీ, లేనప్పుడు ఉచితాలనీ మాట్లాడతారు. సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా నిజ వేతనాలు, ఉపాధి అవకాశాలు పడిపోయాయి. నిరుద్యోగం, ధరలు పెరిగాయి. ప్రజల్లో అసంతృప్తి విస్తరించింది. ఇది ప్రతిఘటన రూపం తీసుకోకుండా కులాల చుట్టూ, మతాల చుట్టూ ప్రజల భావోద్వేగాలు పెంచుతున్నారు.
దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల్లోనే పేదరికం, నిరుద్యోగం అత్యధికం. దీనికితోడు తరతరాలుగా సమాజాన్ని కులవివక్ష పట్టి పీడిస్తున్నది. ఒకవైపు కులవ్యవస్థ, భూస్వామ్య సంబంధాలు, మరోవైపు పెట్టుబడిదారీ విధానం విస్తరణ ఫలితంగా ఆర్థిక, సామాజిక అసమానతలు వేగంగా పెరుగుతున్నాయి. అందుకే కులగణన సమస్య ముందుకొచ్చింది. కుల వ్యవస్థ కొనసాగించాలన్న ఆరెస్సెస్‌ విధానం ఫలితంగా మోడీ సర్కారు కులగణనకు నిరాకరిస్తున్నది. జనగణనతో పాటు కులగణన చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఆ సమాచారం ఆధారంగా ఆర్థిక, సాంఘిక, సామాజిక అసమానతల నిర్మూలనకు అవసరమైన విధానాలు రూపొందించవచ్చు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన కులగణనను కేవలం రిజర్వేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. రాహుల్‌గాంధీ కులం గురించి, మతం గురించి బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కులగణన నుంచి మోడీ ప్రభుత్వం తప్పించుకుంటున్న తీరుపై ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ వివాదం. అంతేకాదు, కులాంతర మతాంతర వివాహాలు ఆరెస్సెస్‌-బీజేపీలకు గిట్టవు. మోడీ కులం గురించి చర్చ పెడుతున్నందువల్లనే రాహుల్‌గాంధీ కులం అడుగుతున్నామని అనడంలో అర్ధం లేదు. మోడీ తాను బీసీ అని చెప్పుకోవడం వల్లనే, అది నిజమా కాదా అన్న చర్చ సహజంగానే సాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనలో కూడా అనేక లోపాలుంటాయి. కానీ వాటిని ప్రశ్నించే నైతిక అర్హత బీజేపీకి లేదు. కేంద్ర ప్రభుత్వమే కులగణన చేపడితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వేలో గానీ, కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో గానీ ఉన్న లోపాలు పక్కకు పోతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్‌కు కూడా సుప్రీంకోర్టు తీర్పు ఆటంకంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడమే దీనికి పరిష్కారం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఎన్నికల వాగ్దానం మేరకు శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపాలి. కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇవి పక్కనపెట్టి బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు వెలమల సంఖ్య, రెడ్ల సంఖ్య చుట్టూ చర్చ తిప్పుతున్నారు. కులాల కుంపటికి తెర లేపుతున్నారు. కులగణనను కులాల కుంపటికి దిగజార్చుతున్నారు. ఇది పాలకవర్గాల సహజ లక్షణం. కుల వ్యవస్థ, కుల వివక్ష నిర్మూలన వీరికి నచ్చదు. అందుకే కుల దురహంకార దాడులకు వ్యతిరేకంగా ఈ పార్టీల నాయకులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ, మంత్రులు గానీ స్పందించరు. బాధితులకు అండగా నిలవరు. ఇలాంటి సందర్భాలలో కేవలం కమ్యూనిస్టులు మాత్రమే బహిరంగంగా బాధితులకు అండగా నిలవటం మనం చూస్తున్నాం.
ఎస్‌.వీరయ్య

Spread the love