హక్కులు తెలిస్తేనే ప్రశ్నించే తత్వం వస్తుంది.!

హక్కులు తెలిస్తేనే ప్రశ్నించే తత్వం వస్తుంది.!– రాజ్యాంగంపై ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదు:మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
నవతెలంగాణ- మల్హర్ రావు:
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలకు తెలిస్తేనే ప్రశ్నించే తత్వం వస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బహుజన సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ స్తూపాన్ని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌, మాజీ జెడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం, హక్కుల గురించి అవగాహణ లేకుంటే ధైర్యం ఉండదన్నారు. ఈ క్రమంలోనే రాజ్యాంగంలోని విషయాలు ప్రజలకు తెలిస్తే మనల్ని ప్రశ్నిస్తారనే కుట్రలు దాగి ఉన్నాయన్నారు. పాఠ్యాంశాల్లో రాజ్యాంగాన్ని చేర్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఒకవైపు పాలకులు రాజ్యాంగం పరిరక్షించాలని మాట్లాడుతూనే మరోవైపు రాజ్యాంగంపై ప్రమాణాలు చేసి అసెంబ్లీ, పార్లమెంట్‌, లోక్‌సభల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం మాట్లడటం జరుగుతుందన్నారు. బీజేపీ నేత అమిత్‌షా పార్లమెంట్‌లో అంబేద్కర్‌ గురించి అవమానకరంగా మాట్లాడారని, ఇంతకంటే దురదృష్ఖకరం ఏముంటుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాలకు మనువాద సిద్దంతాలను నూటికి నూరు శాతం అమలు చేస్తూ ఒక్క మతం కోసమే పని చేస్తుందన్నారు. కేవలం హిందుత్వాని ఎలా పెంచాలనే ఆలోచన తప్ప విద్యావకాశాలు, వ్యవసాయ రంగాలను ఎలా కాపాడాలనే ఆలోచన చేస్తలేదని ఆయన విమర్శించారు. ఆర్థికంగా విద్యాపరంగా పేదరికరంగాల్లో 50అంశాల్లో మనం వెనుకబడిపోయామని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. అనేక ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం అనేక అబద్దాలు ఆడుతుందన్నారు. ఆనాడు గరీబ్‌ హాటావ్‌ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్‌ పాలనలో పేదరికం పోయిందా అని ఆయన ప్రశ్నించారు. ఈనాడు రాష్ట్రంలో సైతం అనేక అబద్దాలు, మాయమాటలతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను నట్టేల ముంచిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా పూర్తిగా అమలు చేయలేదని, ఈ ప్రభుత్వం మూలంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆయన అన్నారు. అంబేద్కర్‌ వారసులు రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.రాజ్యాంగాన్ని అవమానపర్చింది రెండు పార్టీలే పుట్ట మధూకర్‌, మాజీ ఎమ్మెల్యే, మంథని రాజ్యాంగానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్‌ పార్టీ అయితే అవమానపర్చింది బీజేపీ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. శనివారం కాటారం అంబేద్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ స్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు అవమానపర్చిన రెండు పార్టీలు ఈనాడు రాజ్యాంగం బుక్కు పట్టుకోకుండా అంబేద్కర్‌ పేరు ఎత్తకుండా ఉండలేకపోతున్నారని అన్నారు. ఈనాడు బీజేపీ పార్టీ అంబేద్కర్‌ జయంతి అభియాన్‌ అనే కార్యక్రమాన్ని చేపట్టితే సంవిధాన్‌ బచావ్‌ అంటూ రాహుల్‌ గాంధీ యాత్రను చేపట్టారని ఆయన తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆనాడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగంలో ఏముందో తెలుసుకోకపోతే చరిత్ర సృష్టించలేమని అన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మంథని నియోజకవర్గంలో జరుగుతోందన్నారు. ఆనాడు మంథని ఎమ్మెల్యే పోలీసులను వాడుకుంటాడ్లని ఆరోపణలు చేశారని, కానీ ఈనాడు పోలీసులే పని చేస్తున్నారు తప్ప నాయకులు పని చేయడం లేదన్నారు. మోసం చేసినోళ్లే మళ్లీ మోసం చేయాలని రాజ్యాంగం పట్టుకుని తిరుగుతాండ్లని, రాష్ట్రానికి వచ్చిన రాహుల్‌ గాంధీ తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు రూ.2500 నగదును అకౌంట్‌లో జమ చేశామని చెప్పారని, కానీ ఏ ఆడబిడ్డ ఖాతాలో రూపాయి జమకాలేదన్నారు. అంటే తాము ఏది చెప్పితే అది ప్రజలు నమ్ముతారని, తాము చెప్పేది అర్థం కాదనే ఆలోచన వారిలో ఉందన్నారు. రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో ఎక్కడా మంథని ఎమ్మెల్యే కనబడటం లేదని, అభిమానులు ఇచ్చిన అంబేద్కర్‌ చిత్రపటాన్ని బలవంతంగా పట్టుకుంటున్నారని ఆయన అన్నారు. 40ఏండ్లు ఒక్క కుటుంబానికి అధికారం ఇచ్చిన ప్రజలకు ఏం చేశామనే ఆలోచన చేయడం లేదని, ఏం చేసిండ్లో ఎమ్మెల్యే చెప్పడం లేదని ఆయన అన్నారు. అట్టడుగు వర్గాల్లో ఆలోచన, చైతన్యం తీసుకువచ్చేందుకే తమ ప్రయత్నాలు చేస్తున్నామని, ఏదైనా సాధించాలనే తపన, ఆలోచన లేకపోతే ఈ జన్మ వృధా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. ఈ క్రమంలోనే అంబేద్కర్‌ విగ్రహాల ఆవిష్కరణలు, రాజ్యాంగ స్థూపాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. మహనీయుల మాసం సందర్బంగా దీక్ష చేపట్టిన ప్రతి ఒక్కరు గడపగడపకు వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే బాధ్యత తీసుకోవాలన్నారు. భవిష్యత్‌ తరాల కోసమే తమ ఆలోచన ఉంటుందని, మహనీయుల చరిత్రను చాటి చెప్పి చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Spread the love