ఇద్దరికీ ఇష్టమైతేనే

Only if both of you like it.స్త్రీ-పురుషుల కలయిక అనేది మానవజాతి తన గమనాన్ని కొనసాగించడానికి ప్రకృతి ఇచ్చిన అద్భుతం. ఇద్దరి వ్యక్తుల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇక భార్యా భర్తల మధ్య ప్రేమ, అనురాగం, అప్యాయత పెరిగేందుకు చక్కని మార్గం. అంతేకాదు శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో సహాయం చేస్తుంది. మనుషులకే కాదు ప్రతి జీవిలో పుట్టే అత్యంత సహజమైన కోరిక ఇది. అయితే భార్యా భర్తలైనా సరే ఇద్దరూ మనస్ఫూర్తిగా ఇందుకు సిద్ధంగా ఉండాలి. అలా కాకుండా కొందరు భర్తలు నా భార్యే కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. దీని వల్ల జరిగే పరిణామాలు అత్యంత దారుణంగా ఉంటాయి. అలాంటి ఓ సమస్యే ఈవారం ఐద్వా అదాలత్‌తో…
దేవికీ సుమారు 28 ఏండ్లు ఉంటాయి. ఆమెకు వంశీతో మూడేండ్ల కిందట పెండ్లి జరిగింది. ఇద్దరూ ఉద్యోగస్తులే. ఉదయం ఆఫీసుకు వెళితే సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. పిల్లలు లేరు. వంశీ ‘ఇప్పుడే పిల్లలు ఎందుకు, ఇంకొంచెం టైం తీసుకుందాం’ అంటాడు. దేవి కూడా సరే అంది. అత్తమామలు ఊరిలో ఉంటారు. అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. ఎప్పుడైనా వీళ్లు కూడా వెళ్లి వస్తుంటారు.
అత్తమామలతో దేవికి ఎలాంటి సమస్యా లేదు. ఇప్పుడు ఆమె సమస్య మొత్తం వంశీతోనే. మంచి వాడే కానీ విపరీతమైన కోరికలు ఉన్నాయి. ఎప్పుడూ అదే ఆలోచనతో ఉంటాడు. అంతేకాకుండా ఫోన్లో సినిమాలు చూసి ‘మనం కూడా అలాగే చేద్దాం’ అంటాడు. ఆ సమయంలో దేవికి ఇష్టం లేకపోయినా ఆమె మాటలు పట్టించుకోడు. ఆమె నిద్రపోతున్నా సరే బలవంతంగా లేపి తన కోరిక తీర్చుకుంటాడు. ఈ ఆలోచనలతోనే పిల్లలు కూడా వద్దంటున్నాడని దేవికి తర్వాత తెలిసింది. ఊరికి వెళ్ళినా వెంటనే తీసుకొచ్చేస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆఫీస్‌కి సెలవు వస్తే దేవికి ఇంట్లో ఉండాలంటేనే భయం పట్టుకుంది.
చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడేలా ఆమెతో ప్రవర్తిస్తాడు. పెండ్లయిన కొత్తలో అయితే తనపై ప్రేమతోనే ఇలా చేస్తున్నాడని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాను రాను అతను క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తన కోరికల కోసం శారీరకంగా హింసించేవాడు. తర్వాతి రోజు ఆఫీస్‌కి వెళ్లడానికి కూడా దేవి ఇబ్బంది పడేది. ఈ విషయం ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోడు. ఆమె గట్టిగా మాట్లాడితే ‘నేను కాకుండా నీకు ఇంకెవరైనా ఉన్నారా, అందుకే నన్ను వద్దంటున్నావా. నేను చెప్పినట్టు చెయ్యకపోతే నన్ను దగ్గరకు రానివ్వడం లేదని, అందుకే మనకు పిల్లలు పుట్టడం లేదని మీ అమ్మ వాళ్లకు చెబుతాను’ అంటూ బెదిరిస్తాడు.
దేవి ఒంటి నిండా గాయాల మచ్చలే. భర్త ప్రవర్తనతో పెండ్లయిన మూడేండ్లకే సంసార జీవితమంటేనే ఆమెకు విరక్తి పుట్టుకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐద్వా ఆఫీస్‌కు వచ్చి ‘నా భర్త నాతో జంతువు కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. అతనితో ప్రతి రాత్రి నరకం అనుభవిస్తున్నాను. పెండ్లి తర్వాత ప్రతి జంట చేసేదే అయినా నాకు మాత్రం ఎందుకు ఇంత బాధగా అనిపిస్తుంది. మిగిలిన వాళ్లంతా హాయిగా, సంతోషంగా ఉంటున్నారు. నేనేమైనా ఎక్కువగా ఊహించుకుంటున్నానా? ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పినా నాదే తప్పంటున్నారు. వంశీకి సర్ది చెప్పే ప్రయత్నం చేయడం లేదు. ‘వాడు మగాడు, అలాగే వుంటాడు, కోరికలు ఉంటాయి. అతని కోరిక తీర్చడం భార్యగా నీ ధర్మం’ అంటుంది వంశీ అక్క. ‘అన్నీ ఓర్చుకోవాలి కానీ ఈ విషయం గురించి గొడవలు పడడం ఏంటీ. నాకూ భరించలేని బాధలు ఉన్నాయి. అయినా నేను ఓపిగ్గా ఉండడం లేదా’ అంటుంది.
ఆమె ఉన్నంత ఓపిగ్గా నేను ఉండలేకపోతున్నాను. ఆయన్ని భరించడం నా వల్ల కావడం లేదు. ఎలాగైనా మీరే నా సమస్యకు పరిష్కారం చూపండీ’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
అంతా విన్న తర్వాత మేము వంశీని పిలిచి మాట్లాడితే ‘నా భార్యను నేను చాలా బాగా చూసుకుంటున్నాను. ఆమె అడగక ముందే అన్నీ తెచ్చిపెడతాను. ఆమే ఉద్యోగం చేస్తుంది. అయినా తన దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోను. అయినా ఆమె మీ దగ్గరకు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు’ అన్నాడు.
‘ప్రతి రోజూ మీ కోర్కెలు తీర్చమని ఆమెను ఇబ్బంది పెట్టడం లేదా?’ అని అడిగితే ‘ప్రతి భార్యా భర్త చేసేదే కదా అది. అందులో తప్పేముంది. నేనేమీ వేరే ఆడవాళ్లతో సంబంధం పెట్టుకోలేదు. నా భార్యతోనే కదా ఉంటున్నాను. ఇక పెండ్లి చేసుకోవడం ఎందుకు, చేసుకోకుండా ఉంటే సరిపోయేది’ అన్నాడు. దానికి మేము ‘అందరిలా మీరూ మీ భార్యపై ప్రేమతోనో, ఇష్టంతోనో ఉంటే ఇలాంటి సమస్య ఉండేది కాదు. ఆమే మిమ్మల్ని తప్పుగా అనుకునేది కాదు. కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఆమెకు నరకం చూపిస్తున్నారు. ఆమె ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా మీ కోరికలు తీర్చుకుంటున్నారు. ఆ బాధ భరించలేకే ఆమె ఇక్కడి వరకు రావల్సి వచ్చింది. మీరు పెడుతున్న ఇబ్బందులకు ఆమెకు మీ నుండి విడిపోయే హక్కు ఉంటుంది. అది చట్టం మహిళలకు ఇచ్చిన హక్కు. పైగా మీ భార్య బాధపడుతూ అర్థం చేసుకొమ్మని అడిగితే మీరు ఆమె గురించే తప్పుగా చెబుతానని బెదిరిస్తున్నారు. ఇదంతా చూస్తే మీరు ఆమె నుండి ఏం కోరుకుంటున్నారో అందరికీ అర్థం అవుతుంది. మీకు ప్రేమను పంచే భార్య కన్నా ఆమె శరీరం ఉంటే చాలు. ఆమె ఒంటి నిండా మీరు చేసిన గాయాలే ఉన్నాయి. వాటిని ఎప్పుడైనా చూశారా? మీరూ మనిషే కదా! అంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు. దేనికైనా ఓ పరిమితి ఉంటుంది. ఫోనుల్లో, సినిమాలల్లో చూసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు మారకపోతే మీకే నష్టం. ఇష్టం లేకుండా భార్యను అనుభవించినా అది చట్ట ప్రకారం అత్యాచారం కిందకే వస్తుంది. మీ ఇష్టం మారిటల్‌ రేప్‌ కింద మీపై కేసు పెట్టాల్సి వస్తుంది.
కానీ దేవీ మీరు మారాలనీ, తనను ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటుంది. కాబట్టి మీకు రెండు నెలలు టైం ఇస్తున్నాము. ఈ లోపు మీ ప్రవర్తన మార్చుకోండి. మీ భార్యతో ప్రేమగా ఉండండి. ఆమె ఇష్టాలను గౌరవించండి. లేదంటే మీ ఇష్టం’ అన్నాము.
దాంతో వంశీ భయపడ్డాడు. ‘మీరు చెప్పినట్టే వింటాను. దేవిని ప్రేమగా చూసుకుంటాను. ఇకపై ఆమెను ఇబ్బంది పెట్టను’ అన్నాడు. ‘మాటల్లో చెప్పడం కాదు. మళ్ళీ నెల రోజుల తర్వాత మా దగ్గరకు రావాలి. ఆమెతో ప్రేమగా ఉండి చూడండి. మీకూ ఎంత ఆనందంగా ఉంటుందో అర్థమవుతుంది’ అని చెప్పి పంపించాము. ఆరు నెలల నుండి ప్రతి నెల ఐద్వా ఆఫీస్‌కు వచ్చి ఇద్దరూ ఎలా ఉన్నారో చెప్పి వెళుతున్నారు. ప్రస్తుతం వంశీలో చాలా మార్పు వచ్చింది. దేవి కూడా అతనితో చాలా సంతోషంగా ఉంటుంది.
– వై వరలక్ష్మి, 9948794051

Spread the love