గణితంలో రాణిస్తే జీవితంలో ఉన్నత స్థానం 

–  నోడల్ ప్రధానోపాధ్యాయుడు బుదారపు శ్రీనివాస్
నవతెలంగాణ – పెద్దవంగర
గణితంలో ఎవరు రాణిస్తారో వారు జీవితంలో ఉన్నత స్థాయిలో నిలుస్తారని మండల నోడల్ ప్రధానోపాధ్యాయుడు బుదారపు శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ గణిత ఫోరం మండల అధ్యక్షుడు గంగిశెట్టి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మండల స్థాయి గణిత టాలెంట్ టెస్ట్ ను శనివారం స్థానిక ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గణితం మానవుల దైనందిన జీవితం తో ముడిపడి ఉందన్నారు. నిత్య సాధన ద్వారానే గణితంపై విద్యార్థులు పట్టు సాధిస్తారని చెప్పారు. సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథంతో విద్యార్థులు ముందుకు సాగితే లక్ష్యం సాధిస్తారని చెప్పారు. కాగా మండలం నుండి పెద్దవంగర, అవుతాపురం, వడ్డెకొత్తపల్లి, బొమ్మకల్లు, చిట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటుగా, కేజీబీవీ విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వీరిలో పెద్దవంగర, చిట్యాల విద్యార్థులు శ్యామిని, లోకేష్ ప్రథమ స్థానంలో, రంజిత్ పెద్దవంగర ద్వితీయ స్థానంలో, రాకేష్ అవుతాపురం తృతీయ స్థానంలో, సింధుప్రియా, నానీ లు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love