ప్రతిభను వెలికి తీసేందుకు ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’

నవతెలంగాణ పెద్దవంగర: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికి తీయడంలో ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ ఎంతో దోహదపడుతుందని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు రాజలింగం అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ పరిశోధనల్లో పాఠశాలకు చెందిన బీ. హేమంత్ ఉత్తమ ప్రతిభ కనబర్చి, రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ శశాంక చేతుల మీదుగా విద్యార్థికి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం హేమంత్ ను అభినందించారు. అనంతరం రాజలింగం మాట్లాడుతూ.. ఎరువుల వాడకంలో తక్కువ వ్యయంతో రూపొందించిన ఎరువులను చల్లే పరికరాన్ని విద్యార్థి, గైడ్ టీచర్ శ్రీధర్ సహకారంతో ఆవిష్కరించారని తెలిపారు. దీంతో ఎరువులను చల్లడానికి రైతులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. తక్కువ వ్యయంతో రూపొందించిన ఈ పరికరంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. విద్యార్థులు మన చుట్టుపక్కల, ఇళ్లు, విద్యాలయాలు, వ్యవసాయం, ఇతర సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఆవిష్కరణలు చేయడం హర్షణీయమన్నారు. ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ పరిశోధనలతో విద్యార్థుల్లో మేథోసంపత్తి వృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలన్నారు. తద్వారా విద్యార్థులకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సదయ్య, యాకన్న, విజయ్ కుమార్, వెంకన్న, సువర్ణ, హైమ పాల్గొన్నారు.
Spread the love