సమాజంలో భార్యా భర్తల బంధానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు ఎంత సహజమో, అప్పుడుప్పుడు చిన్నచిన్న గొడవలు కూడా అంతే సహజం. ఈ గొడవలు కూడా ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచడానికి ఉపయోగపడతాయి. అయితే ఒకరిపై ఒకరికి కోపం వస్తే దాన్ని అప్పుడే బయటకు చెప్పాలి. లేకపోతే అవే తర్వాత కాలంలో మనస్పర్థలకు కారణమవుతాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు, గొడవలు జరిగినప్పుడు నేనే ఎందుకు మాట్లాడాలి, నేనే ఎందుకు క్షమాపణ చెప్పాలి. తనే ముందు చెప్పొచ్చు కదా! అనే ఇగోలకు పోకూడదు. అలా చేస్తే బంధంలో అగాధం ఏర్పడుతుంది. చివరకు విడాకుల వరకు వెళుతుంది. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
అనుదీప్‌కు 30 ఏండ్లు ఉంటాయి. అతనికి సృజనతో పెండ్లి జరిగి ఆరేండ్లు అవుతుంది. ఒక బాబు ఉన్నాడు. వీరితో పాటు అత్తమామలు కూడా ఉంటారు. అనుదీప్, సృజన ఇద్దరూ ఉద్యోగస్తులు. బాబును అత్తమామలే చూసుకుంటారు. కానీ భార్యా, భర్తల మధ్యనే ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతుంటారు. ఈ విషయం చెప్పుకోవడానికి అనుదీప్ ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చాడు.
చిన్న విషయాలకే వారెందుకు ఇంతలా గొడవ పడుతున్నారు. సృజనకు అవే ఎందుకు పెద్ద సమస్యల్లా అనిపిస్తున్నాయో తెలుసుకునేందుకు మేము అనుదీప్‌తో మాట్లాడితే ‘ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. కాబట్టి ఇద్దరం ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లడం తప్పదు. అయితే నేను బాబును రెడీ చేయలేదని, సెలవు రోజుల్లో బయటకు తీసుకు వెళ్లలేదని, ఇంట్లో పనుల్లో సాయం చేయడం లేదని నాతో గొడవ పడుతుంది. ఆమే పెద్ద పెద్దగా అరుస్తుంది, తిడుతుంది. అయితే ఎప్పుడూ నేనే ఆమెకు సారీ చెబుతాను. ఈ మధ్య సృజన వాళ్ల బంధువుల ఇంట్లో పెండ్లికి వెళ్లాము. అక్కడ కూడా అందరి ముందు నాపై అరిచింది. దానికి కూడా నేనే సారీ చెప్పాను. కానీ ఆమె మాత్రం ‘నీతో ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. మనిద్దరం కలిసి ఉండటం ఇక అసాధ్యం. కాబట్టి విడిపోదాం’ అంటుంది. ఎన్ని సార్లు చెప్పినా నా మాటలు పట్టించుకోవడం లేదు. నాకు కూడా ఇగో అనేది ఉంటుంది కదా! ఆమెకే అంత పట్టుదల ఉంటే నాకు ఇంకెంత వుండాలి. అని నేను కూడా విడిపోదాం అని చెప్పాను. ఆమె నాకు విడాకుల నోటీసు పంపించింది. ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఆమె లేకుండా నేను నా జీవితాన్ని ఊహించుకోలేను. మా అమ్మ వాళ్లు చెప్పినా, వాళ్ళ అమ్మ వాళ్లు చెప్పినా తను వినడం లేదు. మీరే ఎలాగైనా మమ్మల్ని కలపండి’ అంటూ చెప్పుకొచ్చాడు.
మేము సృజనకు ఫోన్ చేసి పిలిపించాము. అనుదీప్ చెప్పిన విషయం గురించి అడిగితే ‘భార్యంటే గౌరవం లేని వ్యక్తితో ఎలా బతకాలి. ప్రతి విషయంలో అతనే గొప్ప అనుకుంటాడు. ప్రతి సారి నన్ను తక్కువ చేసి చులకన చేస్తాడు. ఇంటి పనుల్లో అస్సలు సహాయం చెయ్యడు. బాబును రెడీ చేయమన్నా చేయడు. ఇంట్లో ఓ పనిమనిషిని పెట్టుకుందామన్నా వినడు. అత్తయ్యా, మామయ్య పనులు కూడా నేనే చూసుకోవాలి. ఇంటి పనుల్లో సాయం చేయమని మా అత్తయ్య చెప్పినా ఆయన మాట వినడు. అందుకే ఆమె సాయం చేయడానికి వస్తుంది. ఆమెకు ఆరోగ్యం బాగోదు. అలాంటి ఆమెతో నేను పనులు ఎలా చేయించాలి? అందుకే వద్దని పనులన్నీ నేనే చేసుకుంటాను. నేను ఉదయం 9 గంటలకు వెళితే 7 గంటలకు వస్తాను. బాబును అత్తయ్యా మామయ్యనే చూసుకుంటారు.
కనీసం సెలవు రోజుల్లో బయటకు తీసుకెళ్లమంటే వినడు. మమ్మల్ని తీసుకెళ్లడానికి ఆయన దగ్గర టైం, డబ్బులు ఉండవు కాని స్నేహితులతో మాత్రం వెళతాడు. కనీసం ఏడాదికి ఒక్కసారైనా అందరం కలిసి బయటకు వెళదామన్నా ఒప్పుకోడు. ఆరేండ్లలో ఒక్కసారి మాత్రమే మా పిన్ని కొడుకు పెండ్లికి అందరం కలిసి వెళ్లాము. అక్కడ కూడా అందరి ముందు నన్ను చులకన చేసి మాట్లాడాడు. తాగి నాపై చేయి చేసుకున్నాడు. అయినా నేను ఆయన్ని ఏమీ అనలేదు. మా పిన్నికి ఆడపిల్లలు లేరు. అందుకే నన్నే తన కూతురిగా అనుకుంటుంది. పెండ్లిలో బియ్యం మమ్మల్ని పోయించుకోమని డబ్బులు కూడా ఇచ్చి వెళ్లింది. ఆయనకు ఇష్టం లేకపోతే రాకుండా ఉండొచ్చు కదా. అక్కడకు వచ్చి బియ్యం పొయ్యడానికి కూడా మీకు ఎవరూ లేరంటూ అవమానంగా మాట్లాడాడు. అప్పుడు నేను అలాంటి మాటలు ఎందుకు మాట్లాడతావు అని కోప్పడ్డాను. దాంతో నన్ను కొట్టి ఇక్కడికి వచ్చి ఏమీ చేయలేదని అమాయకంగా మాట్లాడుతున్నాడు. పైగా ఎన్ని సార్లు సారీ చెప్పినా నేను పట్టించుకోవడం లేదని అందరి దగ్గర చెప్పుకుంటున్నాడు.
బంధువుల ముందు మా కుటుంబ పరువు పోయింది. ఇలాంటి వ్యక్తితో నేను ఎలా ఉండాలి. నాకు ఈయనతో బతకడం చాలా కష్టంగా ఉంది. అందరి ముందు ఆయనే విడాకులు ఇస్తానన్నాడు. మా అత్తయ్య మామయ్య అలా ఎందుకు మాట్లాడతావు అంటే ‘నా కన్నా మీకు ఆమే ఎక్కువైతే ఆమెతోనే వెళ్లండి’ అన్నాడు. నాకూ ఆత్మాభిమానం ఉంటుంది కదా! ఇలాంటి వ్యక్తితో నేను ఎలా ఉండాలో మీరే చెప్పండి’ అంటూ బాధపడింది.
సృజన చెప్పింది విన్న తర్వాత అనుదీప్‌ను కూర్చోబెట్టి ‘ముందు మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కొంత సమయం కేటాయించుకోండి. కనీసం 30 నిమిషాలైనా కలిసి మాట్లాడుకోండి. అలాగే ఇంటి పనులు ఇద్దరూ పంచుకోండి. లేదంటే ఓ పనిమనిషిని పెట్టుకోండి. అన్నింటికంటే ముందు ఆమెను గౌరవించడం నేర్చుకోండి. తమ్ముడి పెండ్లిలో ఆమెను, ఆమె బంధువులను అగౌరవంగా మాట్లాడితే ఆమెకు కోపం రాదా! నీ పద్ధతి సరైనది కాదు. భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. మీరు మీ భార్యతో నిజంగా కలిసి ఉండాలంటే ఆమెను గౌరవించండి’ అని చెప్పాము.
సృజనతో ‘మీకు మంచి అత్తమామలు దొరికారు. భర్తను మార్చుకోవడానికి ప్రయత్నించండి. మళ్లీ ఏదైనా సమస్య వస్తే మా దగ్గరకు రండి’ అని చెప్పి పంపించాము. ప్రస్తుతం ఇద్దరూ సంతోషంగా ఉంటున్నారు. సృజన రెండు వారాలకు ఓసారి ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి మాట్లాడి వెళుతుంది. ప్రస్తుతం తను గర్భవతిగా ఉంది.
భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నేను గొప్పంటే నేను గొప్ప అనే ఇగోలకు పోకుండా ఉంటే జీవితం హాయిగా ఉంటుంది. దీని కోసం ప్రతి జంట కనీసం రోజులో అరగంట అయినా ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవాలి. ఫోన్ చూడటం మానేసి ఒకరి భావాలు మరొకరు పంచుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యలూ భార్యాభర్తలను విడదీయలేవు.
– వై వరలక్ష్మి, 9948794051