– స్థానిక సంస్థల్లో పోటీకి అనుమితించకపోవడం సరిగాదు
– మంత్రి సీతక్కకు 1995 చట్టం రద్దు కమిటీ అధ్యక్షులు అభిమాన్ గాంధీ నాయక్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలనీ, దానికి అడ్డుగా ఉన్న 1995 చట్టాన్ని రద్దు చేయాలని 1995 చట్టం రద్దు కమిటీ అధ్యక్షులు అభిమాన్ గాంధీ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి దనసరి అనసూయ(సీతక్క)కు గాంధీనాయక్ వినతిపత్రం అందజేశారు. మున్సిపాల్టీల్లో ప్రత్యేక జీవో ద్వారా ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారిని పోటీచేసేందుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. గ్రామపంచాయతీల్లోనూ దాన్ని అమలు చేయాలని కోరారు. అపారమైన రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఆ చట్టం వల్ల తాము రాజకీయాలకు దూరమవుతున్నామని వాపోయారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని సీతక్క వారికి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇట్టడి లింగారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గొడిశాల నవీన్, రాజ్‌కుమార్, కొండ సమ్మయ్య, కిషన్‌నాయక్, బుక్యా వెంకట్, బిచ్య, తదితరులు పాల్గొన్నారు.