తెలంగాణ పునరుత్పాదక ఇందన విధానం-2025ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. పదేళ్ల పాటు ఈ విధానం అమల్లో ఉండనుంది. పర్యావరణ హితం కాని కర్బన్ ఉద్గారాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా, అదేవిధంగా రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌ను చేరుకోవడమే లక్ష్యంగా ఈ విధాన ప్రకటన ఉద్దేశ మని ప్రభుత్వం చెబుతున్నది. నిస్సందేహంగా సాంప్రదాయక శిలాజ (బొగ్గు, సహజవాయువు) ఇంధన వినియోగం కన్న సాంప్రదాయేతర పునరుత్పాదక (సోలార్, విండ్ తదితర) వనరుల వినియోగం పర్యావరణానికి ఎంతో మేలుచేస్తాయి. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాల్లో సోలార్ పవర్ ఉత్పత్తి 52శాతం ఉంది. సోలార్ సెల్స్ (ఫోటో వోల్టాయిక్ సెల్స్) జీవితకాలం 25 నుండి ముప్పై ఏండ్లు మాత్రమే. వీటి వ్యర్ధాలు సిలికాన్, కాడ్మియం, టెల్యూరియం భూగర్భజలాల్లోకి చేరి ఎన్నో రకాల సూక్ష్మజీవులు చని పోతాయని, ఫలితంగా పంటల దిగుబడి తగ్గిపోతుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మరొక సమస్య విద్యుత్ స్టోరేజీ సమస్య. సోలార్ పవర్ ఉత్పత్తి డే టైం లో మాత్రమే జరుగుతుంది. వ్యవసాయానికి డే టైంలో ఉచిత విద్యుత్ సోలార్ పవర్ ఉత్పత్తి పెరగడం వల్లనే సాధ్యమైంది. విద్యుత్ స్టోరేజ్ జరగాలంటే పెద్ద ఎత్తున లిథియం ఆయాన్ బ్యాటరీలు వినియోగించాలి. బ్యాటరీల్లో వాడే సిలికాన్, గ్రాఫైట్, కాపర్ తదితర పదార్థాల వ్యర్ధాల వల్ల ఉత్పన్నమయ్యే పర్యావరణ సమస్యల గురించి విధాన ప్రకటనలో మాట మాత్రం లేదు. 2030 నాటికి మూడులక్షల టన్నులకు పైగా సోలార్ ప్యానల్ వ్యర్ధాలు పేరుకు పోతాయని ఒక అంచనా. విధాన ప్రకటనలో వేస్ట్ మేనేజ్మెంట్ చర్యలు ఏమిటో తెలుపలేదు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఉద్గారాలను తగ్గించే పేరుతో ప్రభుత్వ రంగ సంస్థ జెన్కోను పూర్తిగా విస్మరించి ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ విధాన ప్రకటన ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి కావలసింది కూడా ఇదే. ఇప్పటికే కేంద్రం విద్యుత్ సవరణ చట్టం-2022, నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ పేరిట విద్యుత్ రంగం ప్రయివేటీకరణకు, కాంట్రాక్టీకరణకు పూను కుంటున్న ది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణానికయ్యే భారీ ఖర్చుల వలన విద్యుత్ యూనిట్ రేటు భారీగా పెరగనున్నది.
రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు భారీగా రాయితీలను ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. సౌర, పవన, పునరుత్పాదక ఇందనం, ఎనర్జీ స్టోరేజీ (బ్యాటరీంపంప్ స్టోరేజీ) ప్రాజెక్టులు, జియోథర్మల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించనుంది. ప్రస్తుతం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్తు సరఫరా సామర్థ్యం 10,095.20 మెగావాట్లు ఉండగా, 2029-30 నాటికి 31,400 మెగావాట్లకు పెంచాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. 2034-35 నాటికి 49,500 మెగావాట్లకు పెంచాలని భావిస్తోంది. విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం, జియో థర్మల్, మినీ హైడల్, వ్యర్ధాల నుంచి విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు బిడ్లను ఆహ్వానించనున్నాయి. వీటిని గ్రిడ్‌కు అనుసంధానం చేసి, విద్యుత్తును కొనుగోలు చేయనున్నాయి. డెవలపర్లకు ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు అద్దెతో లీజుకిస్తాయి. డెవలపర్లు రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రయివేటు సంస్థలకు అమ్ముకోవచ్చు. సొంత అవసరాలకూ వాడుకోవచ్చు.
పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టులను స్థాపించే భూములకు నాలా కన్వర్షన్ నుంచి మినహాయింపు. టీజీ-ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతులు. పారిశ్రామిక హోదా కల్పించి అన్ని రకాల ప్రోత్సాహకాలు. ప్రతి మెగావాటుకు నాలుగెకరాల చొప్పున భూగరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు. భూముల కొనుగోళ్లపై స్టాంప్ డ్యూటీ వంద శాతం రిఫండ్. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సౌర, పవన విద్యుత్తు వాడుకుంటే ఎనిమిదేండ్ల పాటు విద్యుత్తు సుంకం నుంచి మినహాయింపు. డిస్కంలకు విద్యుత్తు విక్రయిస్తే ప్రోత్సాహకాలు. సౌర, పంప్, బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టులకు యాభై శాతం రాష్ట్ర జీఎస్టీ రిఫండ్ చేస్తారు. ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలపై ఏర్పాటు చేసే రూప్ టాప్ సోలార్ ప్రాజెక్టులకు వంద శాతం రాష్ట్ర జీఎస్టీని తిరిగి చెల్లిస్తారు. పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్రాజెక్టు (పీఎస్సీ)లకు ప్రభుత్వ భూములను 45 ఏళ్ల పాటు లీజుకిస్తారు. ఒకే ప్రాంతంలో సౌర, పవన, పవనం ఫ్లోటింగ్ సోలార్ వంటి హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టులతో పాటు విండ్ స్టోరేజ్, హైబ్రిడ్ – స్టోరేజీ వంటి ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహిస్తామని విధాన ప్రకటనలో పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 1959లో ఏర్పడిన ఏపీఎస్‌ఈబి, చంద్రబాబు మొదటిసారి అధికారంలో చేపట్టిన తర్వాత 1998లో జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలుగా మూడు ముక్కలైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీ(ఎస్)జి జెన్‌కోగా ఏర్పడింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ జెన్‌కోను బలహీనపరుస్తూ వస్తున్నాయి. వాజ్‌పేయి నాయకత్వంలోని అప్పటి ఎన్డీయే (బీజేపీ) సర్కార్ తీసుకొచ్చిన విద్యుత్ చట్టం- 2003 ద్వారా ప్రయివేటు కంపెనీలకు, క్యాప్టివ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు విద్యుత్ ఉత్పత్తిలోకి ప్రవేశించడానికి అవకాశం ఏర్పడింది. బొగ్గు ఉత్పత్తిలో ఉన్న సింగరేణి సంస్థ విద్యుత్ ఉత్పాదన రంగంలోకి 2010లో ప్రవేశించింది. 1200 మె.వా.ల (2ఞ600 మె.వా.) ప్రాజెక్టు నిర్మాణాన్ని మంచిర్యాల జిల్లా, జైపూర్‌లో మొదలు పెట్టింది. 2016 సెప్టెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం (రూ. 8250 కోట్లు) భారీగా పెరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం అధిక ధరలకు చేసుకున్నది. మార్వా ప్రాజెక్టు నుండి జరిగే విద్యుత్ ఉత్పత్తి ధర, ఇతర ఖర్చులు కలిపితే యూనిట్ ధర రూ.5కు మించుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ధరలను సవరిస్తారు. సోలార్ విద్యుత్తును కేంద్ర ప్రభుత్వం విధించిన సీలింగ్ ధర యూనిట్ రూ.4.50లకు భిన్నంగా యూనిట్‌కు రూ.5.50 చెల్లించి తీసుకోవడానికి ఆయా ప్రయివేటు సోలార్ కంపెనీలతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. మరోవైపు విద్యుత్ చట్టం 2003, పరిశ్రమల వంటి పెద్ద వినియోగదారులు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుండే కాకుండా నేరుగా బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తును కొనే అవకాశాన్ని కల్పించింది. పవర్ ఎక్స్చేంజిల్లో దొరికే చౌక విద్యుత్తును పరిశ్రమలు ఇటీవల పెద్దఎత్తున కొనడం మొదలు పెట్టాయి. దీంతో ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సంస్థల ఆదా యానికి భారీగా గండిపడింది. ఒకవైపు పరిశ్రమల కోసం అధిక ధరకు ప్రయివేటు విద్యుత్తు కొనుగోలు చేస్తున్న విద్యుత్ సంస్థలకు, అవే పరిశ్రమలు తమ వద్ద కాకుండా పవర్ ఎక్స్చేంజిల్లో విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాయి.
2014-15లో జెన్‌కో ఉత్పత్తి 19185 మిలియన్ యూనిట్లు కాగా 2024 ఏప్రిల్ నుండి డిసెంబరు 31 వరకు అయిన విద్యుత్ ఉత్పత్తి 21711.45 మి.యూ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మొత్తం విద్యుత్ స్థాపక ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, 2023 డిసెంబర్ నాటికి స్థాపక ఉత్పత్తి సామర్థ్యం 19,475 మెగావాట్లు. అయితే 2014-15లో జెన్‌కో స్థాపిత సామర్థ్యం 5,295.26 మెగావాట్లు కాగా, 2023 మార్చి 31 నాటికి జెన్‌కో స్థాపిత సామర్థ్యం 6,485.26 మెగావాట్లు. పి.ఎల్.ఎఫ్ 63 శాతం మాత్రమే. ఈ కాలంలో రాష్ట్రంలో 11697 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం పెరగ్గా, జెన్‌కో స్థాపిత సామర్థ్యం పెరిగింది కేవలం 1190 మెగావాట్లు మాత్రమే. మిగతాది సింగరేణి, ప్రయివేటు, సోలార్ సంబంధించినదే. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థ అయిన జెన్‌కోను పాలకులు ఎంత నిర్వీర్యం చేస్తున్నది దీన్నిబట్టే అర్థమవుతుంది. తెలంగాణ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
గీట్ల ముకుందరెడ్డి
94900 98857